తప్పుడు పత్రాలతో రూ.100 కోట్ల రుణం తీసుకున్నారు
- డీసీ వైస్‌చైర్మన్ పీకే అయ్యర్‌ను కస్టడీకి అప్పగించండి
- నాంపల్లి కోర్టును కోరిన సీబీఐ
సాక్షి, హైదరాబాద్: నేరపూరిత కుట్రతో తప్పుడు ఆడిటింగ్ పత్రాలను సమర్పించి డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్).. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి రూ.100 కోట్లు రుణం మంజూరు చేయించుకుందని సీబీఐ.. నాంపల్లి కోర్టుకు నివేదించింది. ఇందులో రూ.70 కోట్ల రుణం మొత్తాన్ని తీసుకున్నారని, ఈ కుట్ర మొత్తం వైస్‌చైర్మన్ పీకే అయ్యర్‌కు తెలుసని... ఈ నేపథ్యంలో ఆయన్ను 13 రోజులపాటు కస్టడీలో విచారించేందుకు అనుమతించాలని కోరింది.
ఈనెల 9 నుంచి జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న అయ్యర్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీబీఐ... నాంపల్లి పద్నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అప్పులను, ఖర్చులను దాచిపెట్టి ఎక్కువ లాభాలు వస్తున్నట్లుగా చూపించి డివిడెండ్లు ప్రకటించడం ద్వారా డీసీ వ్యవస్థాపకులు, ప్రధాన వాటాదారులు లబ్ధిపొందారని సీబీఐ వివరించింది. 2009-11 మధ్య డీసీ అప్పులు రూ.2,895.89 కోట్లు ఉన్నాయని, వీటన్నింటినీ దాచిపెట్టి తప్పుడు ఆడిటింగ్ పత్రాలను సృష్టించి ఐఓబీ నుంచి రుణం మంజూరు చేయించుకున్నారని తెలిపింది.
నిర్ణీత గడువులోగా రుణం మొత్తం చెల్లించకపోవడంతో బ్యాంకుకు రూ.72.61 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. బ్యాంకు రుణాన్ని పక్కదారి పట్టించారని, ఈ మొత్తం ఎక్కడుందో కనిపెట్టాల్సి ఉందన్నారు. విచారణకు హాజరు కావాల్సింది నోటీసులు జారీచేసినా అయ్యర్ స్పందించలేదని, ఈ నేపథ్యంలో మారు పేరుతో భువనేశ్వర్‌లోని ఓ లాడ్జిలో ఉన్న అయ్యర్‌ను ఈనెల 6న అరెస్టు చేసి 9న ఇక్కడి కోర్టులో హాజరుపర్చామని తెలిపింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి వై.వీర్రాజు అభ్యంతరాలుంటే తెలపాలని అయ్యర్ తరఫు న్యాయవాదులను ఆదేశిస్తూ విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.