పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
సోలార్ పంప్ ఇన్స్టాలేషన్ సౌలబ్యాన్ని రైతులకు అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 2019లో 'ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్' (పీఎం కుసుమ్) స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉంది. రైతులకు దీని మీద పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల సోలార్ పంప్ ఇన్స్టాలేషన్ ఎక్కువగా అమలు కాలేదు. ఇప్పుడు రైతులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ఏడాది ప్రారంభమైన 'పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' మాదిరిగానే.. ఇప్పుడు రైతులు ఈ సోలార్ పంప్ ఇన్స్టాలేషన్ కోసం నేషనల్ పోర్టల్ ద్వారా విక్రేతలతో కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది రైతులు ఇష్టపడే సోలార్ పంపుల రకాన్ని ఎంచుకోవడంలో మాత్రమే కాకుండా ఇన్స్టాలేషన్ సమయాన్ని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.కుసుమ్ యోజన స్కీమ్ అనేది మూడు భాగాలుగా ఉంటుంది. అవి 10000 మెగావాట్ల సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేయడం, 2 మిలియన్ స్టాండ్-అలోన్ సోలార్ అగ్రికల్చర్ పంపులను ఏర్పాటు చేయడం, 1.5 మిలియన్ వ్యవసాయ పంపులను సోలారైజ్ చేయడం. వ్యవసాయ పంపుల ఇన్స్టాలేషన్, సోలారైజేషన్ కోసం హేతుబద్ధీకరణ కోసం చర్చలు జరుగుతున్నాయి. కానీ సబ్సిడీలో ఎటువంటి మార్పులు లేదు. కేంద్రం దీనికోసం రూ.34,422 కోట్లు కేటాయించింది.సోలార్ పంప్ ఇన్స్టాలేషన్లు, సోలారైజేషన్ కోసం కేంద్రం 30% సబ్సిడీని అందిస్తుంది. రాష్ట్రాలు కూడా 30 శాతం సబ్సిడీ అందిస్తాయి. ఈ పథకం కోసం బ్యానుకులు కూడా తక్కువ వడ్డీకి లోన్స్ అందిస్తాయి. అయితే కేంద్రంతో పాటు రాష్ట్ర సబ్సిడీ కాంపోనెంట్ కూడా పోర్టల్‌లో పేర్కొనటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.రైతు తాను ఏర్పాటు చేసుకున్న సోలార్ పంపుసెట్ నుంచీ తాను వాడుకోగా మిగిలిన సోలార్ పవర్‌ను డిస్కంలకు విక్రయించుకోవచ్చు. దీని ద్వారా రైతు డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. అయితే దీనికోసం రైతులు ఆయా డిస్కంలతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. డిస్కంలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని బట్టి 25 సంవత్సరాల వరకు రైతుల నుంచి కరెంటు కొంటారు.ఇదిలా ఉండగా.. ఫిబ్రవరిలో 10 మిలియన్ల గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లను ఇన్స్టాల్ చేయాలనే లక్ష్యంతో ప్రారంభమైన పీఎం సూర్యఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన పథకానికి ఇప్పటి వరకు 8,00,000 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.