Poor students
-
టీచర్లు లేక పేద విద్యార్థులకు ఇబ్బంది.. డీఎస్సీకి సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య సరిగా లేక పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని.. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాసేందుకు సిద్ధం కావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ప్రస్తుతం 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని.. కొన్ని నెలల్లో మరిన్ని పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని ప్రకటించారు.ఆదివారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేశ్‌రెడ్డి తదితరులతో కలసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచి్చందన్నారు. జాబ్ కేలండర్ ప్రక్రియ వేగవంతం చేస్తాం గత పదేళ్లలో గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలు నిర్వహించకుండా బీఆర్ఎస్ సర్కారు నిరుద్యోగులను గాలికి వదిలేసిందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని.. జాబ్ కేలండర్ విడుదల ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు.తాము అధికారంలోకి వచి్చన మూడు నెలల్లోనే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. గురుకుల పీఈటీలు, అసిస్టెంట్ ఇంజనీర్లు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లు, లైబ్రేరియన్లు, జూనియర్ లెక్చరర్లు, మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ వంటి మరో 13,321 మంది ఉద్యోగుల నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుందని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు భర్తీ సాధ్యం కాదని తెలిసినా గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచి్చందని ఆరోపించారు. తాము వాటికి మరో 6వేల పోస్టులు కలిపి 11వేల టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే.. 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. జూలై 18 నుంచి ఆగస్టు 5వరకు పరీక్షల షెడ్యూల్ ఉందని.. ఆ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు రాసేందుకు 2.05 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు.ఈ పరీక్షకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని.. ఖాళీగా ఉన్న మరో ఐదువేల టీచర్ పోస్టులతోపాటు మరికొన్ని పోస్టులు కలిపి త్వరలోనే మరో నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు డీఎస్సీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో పరీక్ష పెట్టారు.. లీక్ చేశారు..! గత ప్రభుత్వం గ్రూప్–1 పరీక్షకు నోటిఫికేషన్ ఇచి్చందని.. ఆ పేపర్ లీక్ అయిందని భట్టి చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ నోటిఫికేషన్‌ను రీషెడ్యూల్ చేశామని.. ప్రిలిమ్స్ పరీక్షను విజయవంతంగా నిర్వహించామని, 31,382 మంది మెయిన్స్‌కు కూడా ఎంపికయ్యారని వివరించారు. గత ప్రభుత్వం గ్రూప్–2 పరీక్షలను మూడు సార్లు వాయిదా వేసిందని.. తాము అధికారంలోకి రాగానే ఆగస్టులో పరీక్షలు నిర్వహించేలా తేదీలు ఖరారు చేశామన్నారు.గత సర్కారు గ్రూప్–3 కోసం డిసెంబర్ 30, 2022న నోటిఫికేషన్ ఇచ్చినా పరీక్షలు నిర్వహించలేదని.. తాము నవంబర్‌లో ఆ పరీక్ష తేదీలు ఖరారు చేశామని చెప్పారు. తెలంగాణ బిడ్డలు ఉద్యోగాలు సాధించి జీవితాల్లో స్థిరపడాలన్నదే తమ ప్రభుత్వ ఆశ, ఆలోచన అని.. డీఎస్సీకి సిద్ధమవుతున్న నిరుద్యోగులు పరీక్షలు బాగా రాసి, త్వరగా పాఠశాలల్లో చేరి పేదబిడ్డలకు పాఠాలు చెప్పాలని కోరారు. -
ఇంగ్లిష్ మీడియం జగన్ విజన్
► మన పిల్లలు ఇంగ్లిషు చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయాలి.. ► ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివి తమ ప్రతిభను చాటాలి.. ► కేవలం కార్పొరేట్ కళాశాలల విద్యార్థులకే ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలా? ► ప్రభుత్వ బడుల్లో చదివే మన పిల్లలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు కలేనా.. ► ఎన్నో ఏళ్ల నుంచి సామాన్య,పేద వర్గాల తల్లిదండ్రులను తొలిచే ఈ ప్రశ్నలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా సంస్కరణలతో సమాధానమిచ్చారు. ► మన పిల్లలకు ఇంగ్లిషు మీడియం చదువుల్ని అందుబాటులోకి తెచ్చారు. ► ‘‘ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం బోధన.. ► 3వ తరగతి నుంచి సబ్జెక్టు టీచర్ విధానం.. ► 1000 ప్రభుత్వ స్కూళల్లో సీబీఎస్ఈ సిలబస్ ► 2025 జూన్ నుంచి ఐబీ సిలబస్ ► మన చిన్నారులకు ట్యాబ్‌లతో డిజిటల్ బోధన’’ – సాక్షి, అమరావతి బోధన, పాఠ్యాంశాల్లో సంస్కరణలు విద్యార్థుల్లో నేర్చుకునే తత్వం, జిజ్ఞాస పెంచేలా ప్రభుత్వం పాఠ్యాంశాల్లో సంస్కరణలు తీసుకొచ్చింది. 21వ శతాబ్దపు నైపుణ్యాలు అందిపుచ్చుకునేలా, ఫౌండేషనల్ అక్షరాస్యత ప్రోత్సాహం కోసం క్లాస్రూమ్ బేస్డ్ అసెస్మెంట్ అమలు చేస్తోంది. 3 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్లను అందించారు. అన్ని పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల అవసరాలు తీర్చేందుకు దాదాపు 25 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కలి్పంచారు. ఉపాధ్యాయుల్లో బోధనా సామర్థ్యాలు పెంచేందుకు, సీబీఎస్ఈ బోధనకు అనగుణంగా ‘టీచర్ కెపాసిటీ బిల్డింగ్’ శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం ఇఫ్లూ, రివర్సైడ్ లెరి్నంగ్ సెంటర్లలో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐబీ సిలబస్ బోధన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధ్యాయులకు ఐబీ సిలబస్ బోధనపై శిక్షణకు చర్యలు ప్రారంభించారు. మరోపక్క విద్యార్థుల్లో నిర్మాణాత్మకమైన లైఫ్ స్కిల్స్, నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు, సమాజంలో ఉన్నత విలువలతో ఉన్నతంగా జీవించేందుకు ఉపయోగపడే నైపుణ్యాలను అందించేందుకు ‘సంకల్పం’ శిక్షణను సైతం ప్రభుత్వం అందిస్తోంది. డిజిటల్ విద్య కోసం 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు రూ.1,306 కోట్లతో 9,52,925 ఉచిత బైజూస్ కంటెంట్ ట్యాబ్‌ల పంపిణీ ఆరో తరగతి నుంచి ఆపైన రూ.838 కోట్లతో ప్రతి తరగతిలోను 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ),ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీల ఏర్పాటు విద్యార్థుల చెంతకు డిజిటల్‌పాఠాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 4 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఉత్తమ కంటెంట్‌ను ఉచితంగా అందించేందుకు దేశంలోనే అతిపెద్ద ఎడ్ టెక్ కంపెనీ అయిన బైజూస్‌తో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఈ కంటెంట్‌ను ఇంటర్ విద్యార్థులకు కూడా అందించడం విశేషం. ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కలిపి 2021–22, 2022–23 విద్యా సంవత్సరాల్లో 9.53 లక్షల మందికి బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు ఇచ్చి, విద్యార్థులు ఇంటి వద్ద కూడా డిజిటల్ పాఠాలు నేర్చుకునేలా చర్యలు తీసుకుంది. డిజిటల్ పాఠాలు ట్యాబ్స్‌తో పాటు 16 లక్షల మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల మొబైల్స్‌లో కూడా చూడడం విశేషం. ఏపీ ఈ పాఠశాల మొబైల్ యాప్, దీక్ష వెబ్సైట్, డీటీహెచ్ చానెళ్లు, యూట్యూబ్ చానెల్ వంటి వాటి ద్వారా నిరంతరం ప్రభుత్వం పాఠాలను అందిస్తోంది. దీంతో విద్యార్థులు ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా చదువుకునే ఏర్పాటు చేసింది. సబ్జెక్టుల్లో సందేహాలను నివృత్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఏఐ’ టెక్నాలజీతో పనిచేసే ‘డౌట్ క్లియరెన్స్ బాట్’ యాప్‌ను రూపొందించింది. ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, టోఫెల్ శిక్షణలో ఎదురయ్యే క్లిష్టమైన సందేహాలను నివృత్తి చేస్తుంది. మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేదింటి పిల్లలు ఉన్నత చదవులకు వచ్చేసరికి ఇంగ్లిష్ భాషపై పట్టు అవసరమని ప్రభుత్వం భావించి తెలుగు, ఇంగ్లిష్‌లో పాఠాలు మిర్రర్ ఇమేజ్ విధానంలో ముద్రించి బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం అందించింది. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిషు బోధనను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్‌పై పట్టు సాధించేలా, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్విసెస్ (ఈటీఎస్)తో టోఫెల్ శిక్షణ అందిస్తోంది. టోఫెల్ ప్రైమరీలో 3 నుంచి 5 తరగతులకు, టోఫెల్ జూనియర్లో 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు శిక్షణనిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఈ సదుపాయం లభించింది. ఈనెల 10వ తేదీన టోఫెల్ ప్రైమరీ పరీక్షను నిర్వహించగా 13,104 ప్రాధమిక పాఠశాలల్లో చదువుతున్న 3 నుంచి 5 తరగతుల విద్యార్థులు 4,17,879 మంది (92 శాతం) రాశారు. శుక్రవారం (ఏప్రిల్ 12)న జరిగిన టోఫెల్ జూనియర్ పరీక్షకు 5,907 పాఠశాలకు చెందిన 11,74,338 మంది హాజరయ్యారు. ప్రపంచ వేదికలపై మెరిసేలా ఐబీ విద్య మన పేదింటి పిల్లలు ప్రపంచానికి దిక్సూచిగా మారాలన్న సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు సమున్నతంగా మారాయి. ఇంగ్లిష్ మీడియం బోధన, సీబీఎస్ఈ సిలబస్ అమలుతో ఆగిపోకుండా ప్రభుత్వ బడుల్లోకి ఇప్పుడు ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) బోధనను కూడా తెస్తోంది. ఇప్పటిదాకా దేశంలో 210 వరల్ట్ క్లాస్ కార్పొరేట్ స్కూళ్లలో సంపన్నుల పిల్లలకు మాత్రమే చదువుకొనగలిగే ఐబీ బోధన 2025 జూన్ నుంచి ప్రారంభం కానుంది. తొలి ఏడాది ఒకటో తరగతి నుంచి ప్రారంభమై ఏటా ఒక తరగతి చొప్పున ఐబీ బోధన పెంచుతూ 2037 నాటికి +2 వరకు విద్యనందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. విద్యార్థులకు క్రిటికల్. లేటరల్, డిజైన్ థింకింగ్, ప్రాబ్లమ్ సాలి్వంగ్ వంటి నైపుణ్యాలు అందించడంతోపాటు భవిష్యత్ రంగాల్లో రాణించేలా, ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. మన ఇంగ్లిషు విద్యపై ప్రసంశల జల్లు ► ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బైలింగువల్ పాఠ్యపుస్తకాలను అందించడం గొప్ప పరిణామం– కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కితాబు..’’ ► ‘‘ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యమైన విద్య అందించడంలో పనితీరు అద్భుతంగా ఉంది: కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్’’ ►‘‘మహారాష్ట్ర, ఒడిశా, అసోం, హరియాణా, ఛత్తీస్‌గఢ్, మిజోరాం, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, గుజరాత్, పుదుచ్చేరి, కేరళ, తెలంగాణ, అండమాన్ –నికోబార్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీ విద్యాశాఖాధికారులు మన సంస్కరణలు తమ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలుకు సిద్ధం’’ ►‘‘అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై జరిగిన ఉన్నత స్థాయి సదస్సులో 140 దేశాల విద్యావేత్తలు మన విద్యా సంస్కరణలపై ప్రశంసలు’’ సీబీఎస్ఈ బోధన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా పోటీపడేలా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అందుకు అనువైన బోధన కోసం మొదటి విడతగా ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం 1,000 పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధన ప్రారంభించింది. ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ స్కూళ్లలోని విద్యార్థులు 2024–25 విద్యా సంవత్సరంలో తొలిసారి పదో తరగతి పరీక్షలు సీబీఎస్ఈ విధానంలో రాయనున్నారు. హైసూ్కల్లో ఉత్తీర్ణులైన బాలికలు చదువు మానేయకుండా ప్రభుత్వం ప్రతి మండలంలో బాలికల కోసం ఒక జూనియర్ కళాశాల ఏర్పాటు చేసింది. 292 ఉన్నత పాఠశాలలు బాలికల కోసం హైసూ్కల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. మొత్తం 352 కేజీబీవీల్లో ఇంటరీ్మడియట్ ప్రవేశపెట్టారు. 2022–23 నుంచి 14 కో–ఎడ్ జూనియర్ కళాశాలలను బాలికల జూనియర్ కళాశాలలుగా మార్చారు. దీంతో మొత్తం 679 మండలాల్లో బాలికల కోసం ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల చొప్పున అందుబాటులోకి వచ్చింది. -
చరిత్ర ఎరుగని వినూత్న నమూనాలు
వైఎస్ జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత, గత 75 ఏళ్లలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నమూనాను మార్చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్ర మానవాభివృద్ధికి బలమైన పునాది వేయడానికి అనేక చర్యలు తీసుకున్నారు. పిల్లల నాణ్యమైన విద్య కోసం ఖర్చు చేయడం మానవ వనరుల అభివృద్ధికి ఖర్చు చేయడమే తప్ప మరొకటి కాదు. దేశంలోని వికృతమైన విద్యా వ్యవస్థలో ఇది అత్యంత కష్టతరమైన సంస్కరణ. పాఠశాలలు, కళాశాలలపై దృష్టి సారించే మానవశక్తి అభివృద్ధి నమూనాను ఇంతవరకూ ఏ మూడవ ప్రపంచ దేశంలోనూ ప్రయత్నించలేదు. అలాగే, ప్రతి సంక్షేమ పథకాన్నీ పర్యవేక్షించడానికీ వాలంటీర్లను నియమించడం కూడా ప్రజాస్వామ్య పరిపాలనలో పూర్తిగా కొత్త ఆలోచన. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్సార్సీపీకీ, చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ, భావోద్వేగ సినీ నటుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలకూ మధ్య పోటీ నెలకొంది. జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు తమిళనాడులో వలె నామమాత్రపు ఆటగాళ్లుగా ఉన్నాయి. ఆసక్తికరంగా, బీజేపీ రాష్ట్ర శాఖకు చంద్రబాబు వదిన పురందేశ్వరి నాయకత్వం వహిస్తుండగా, కాంగ్రెస్ రాష్ట్ర శాఖను జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల నడిపిస్తున్నారు. రెండు జాతీయ పార్టీలు, తమ సమీప బంధువులైన ప్రాంతీయ పార్టీల అధినేతలను ఇబ్బంది పెట్టేందుకు మహిళా అధ్యక్షులను ఎంపిక చేశాయి. ఇలాంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. 2014 ఎన్నికల నుంచి జగన్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి చంద్రబాబు పొత్తుల కోసం తహతహలాడుతున్నారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని 102 సీట్లు గెలుచుకున్న చంద్రబాబు, 2019లో కేవలం 23 సీట్లు గెలుచుకుని జగన్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. అందుకే ఇప్పుడు ఆయన జనసేన, బీజేపీతో పొత్తుకు తెగ ఆరాటపడుతున్నారు. ఇది కచ్చితంగా బాబులో ఉన్న అలజడిని తెలియజేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదీపై చంద్రబాబు దూషణలు చేసినందున, ప్రధాని ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ‘అందితే జుట్టు... అందకపోతే కాళ్ళు’ అనే తెలుగు సామెత చెప్పినట్టుగా ఉంది చంద్రబాబు రాజకీయ జీవితం. ఇప్పుడు చంద్రబాబు రాజకీయ స్థితిని మోదీ చక్కగా ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌కు చాలా కీలకమైనవి. ఎందు కంటే వైఎస్ జగన్ 175 సీట్లలో 151 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత, గత 75 ఏళ్లలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ప్రయత్నించని విధంగా రాష్ట్ర అభివృద్ధి నమూనాను మార్చేశారు. రాష్ట్రంలోని పాఠశాల, విశ్వవిద్యాలయ విద్య ప్రాథమిక నిర్మాణాన్ని మార్చడం ద్వారా వైఎస్ జగన్, భౌతిక అభివృద్ధి అని పిలుచుకునే అభివృద్ధి నమూనాను మానవ అభివృద్ధి నమూనాగా మార్చారు. గత ఐదేళ్లలో రాష్ట్ర మానవాభివృద్ధికి బలమైన పునాది వేయడానికి జగన్ అనేక చర్యలు తీసుకున్నారు. ఆయన తీసుకున్న మొదటి అడుగు – ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టడం. భారతదేశంలోని వికృతమైన విద్యా వ్యవస్థ చరిత్రలో ఇది అత్యంత కష్టతరమైన సంస్కరణ. పట్టణ పేదల పిల్లలను, వ్యవసాయ రంగంలోని శ్రామిక జనాల పిల్లలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటూ కదలలేని ప్రాంతీయ భాషా విద్యా విధానంలో ఉంచాయి. భాషాప్రయుక్త రాష్ట్రాల ఆలోచన పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల మెడకు చుట్టుకుంది. ధనవంతులు తమ పిల్లలను ప్రైవేట్ ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో చేర్పిస్తే, గ్రామీణ ప్రజలలో మాత్రం ప్రాంతీయ భాషావాదం ప్రచారం చేశారు. పాఠశాల మౌలిక సదుపాయాలు, నాణ్యమైన బోధన, ఆర్థిక స్థోమత లేని పిల్లలకు మంచి ఆహారం కోసం బడ్జెట్‌ను ఖర్చు చేయడానికి ఏ ప్రభుత్వమూ కూడా సిద్ధపడలేదు. పిల్లల నాణ్యమైన విద్య కోసం ఖర్చు చేయడం మానవ వనరుల అభివృద్ధికి ఖర్చు చేయడమే తప్ప మరొకటి కాదు. అసెంబ్లీల బడ్జెట్ సమావేశాల్లో చర్చలన్నీ రోడ్లు, భవ నాలు, అప్పుడప్పుడు డ్యామ్‌లకు మాత్రమే డబ్బు ఖర్చు చేసే విధంగా సాగుతుంటాయి. ఇలాంటి భౌతిక అభివృద్ధిలో భారీ మొత్తంలో డబ్బులు కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళతాయి. పాఠశాల విద్యకూ, విశ్వవిద్యాలయ విద్యకూ; పేద పిల్లల తల్లిదండ్రుల ఖాతాలకు నగదు బదిలీ పథకాలకూ గణనీయమైన మొత్తంలో బడ్జెట్‌ను కేటాయించడం ద్వారా ఆ నమూనాను జగన్ ప్రభుత్వం మార్చింది. ఇది దళారుల పాత్రను రూపుమాపింది. ఈ మార్పు అంతరార్థం ఏమిటంటే దళారీ వ్యవస్థ బలహీనపడుతుంది. తాము పొరపాటున అధికారంలోకి వచ్చినా, పాత భౌతిక వనరుల అభివద్ధి నమూనా వైపు తిరిగి వెళ్లలేమన్నది ప్రతిపక్ష పార్టీల ఆందో ళన. అదే వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి వస్తే, సంస్కరణలు మరింత లోతుగా సాగుతాయి. పది పదిహేనేళ్లలో మంచి విద్యావంతులు, ఆత్మవిశ్వాసం ఉన్న గ్రామీణ యువత సామాజిక–రాజకీయ వ్యవస్థలోకి వస్తారు. మానవ వనరుల అభివృద్ధికి అలవాటు పడిన ఆర్థిక వ్యవస్థను మార్చడానికి వారు అనుమతించరు. పైగా ఉద్యోగ స్వామ్యంతో పనిలేని అవినీతి రహిత కార్యకలాపాల కోసం పని చేస్తారు. వివిధ స్థాయుల పరిపాలనలో ‘సివిల్, పోలీసు నియంతల’ వలె పని చేయాలనుకునే అవినీతి ఉద్యోగులు, ఉన్నత స్థాయి బ్యూరో క్రాట్లు కూడా ఈ మానవ అభివృద్ధి నమూనాకు మద్దతు ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ నగదు బదిలీ జీవితాన్ని రుచి చూసిన పేద గ్రామీణ, పట్టణ ప్రజలు కొత్త వ్యవస్థకు కచ్చితంగా మద్దతు ఇస్తారు. ప్రతి సంక్షేమ పథకాన్నీ పర్యవేక్షించడానికీ వాలంటీర్లను నియమించడం ప్రజాస్వామ్య పరిపాలనలో పూర్తిగా కొత్త ఆలోచన. వృద్ధులకు, రోగులకు ప్రభుత్వం నుండి వృద్ధాప్య పింఛన్ అందేలా లేదా రేషన్ వంటి ప్రయోజనాలను ఇంటి వద్దే ఇచ్చేలా వీరు సాయపడుతున్నారు. మధ్య, ఉన్నత స్థాయి బ్యూరోక్రాట్లు గ్రామాల్లో ఉన్న స్వచ్ఛంద సేవకులపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ, పెద్ద సంఖ్యలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఒక గ్రామంలోని వాలంటీర్ ప్రతి గ్రామస్థునికీ ఒక సహాయ హస్తం! పాఠశాలలు, కళాశాలలపై దృష్టి సారించే మానవశక్తి అభివృద్ధి నమూనాను ఇంతవరకూ ఏ మూడవ ప్రపంచ దేశంలోనూ ప్రయత్నించలేదు. ఉదాహరణకు, చైనా... విద్య, ఆరోగ్య వ్యవస్థలలో ఒక రకమైన సారూప్య వ్యవస్థను ప్రయత్నించింది. వారు పెద్ద సంఖ్యలో కాలినడక వైద్యులను నియమించారు. మెరుగైన పర్యవేక్షణ వ్యవస్థ లతో కూడిన అసమానమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను కూడా జగన్ కల్పించారు. కరోనా సంక్షోభాన్ని అధిగమించడంలో ఇది ఎంతో సహాయపడింది. ఆరోగ్య రంగంలో కూడా గ్రామ వాలంటీర్లు చక్కటి పని చేస్తున్నారు. ఈ కొత్త ప్రయోగాలన్నీ దేశంలోని కాంట్రాక్టర్ వర్గాన్ని ఆశ్చర్యపరిచాయి. కాంట్రాక్టర్ వర్గం భౌతికాభివృద్ధిని కోరుకుంటుంది కానీ భారీ స్థాయి మానవ శక్తి అభివృద్ధిని కాదు. తెలంగాణలో నా చిన్నతనంలో స్థానిక భూస్వాములు ఊరి స్కూల్ టీచర్లను చదువు చెప్పవద్దనీ, జీతం తీసుకుని ఇంట్లో సంతోషంగా ఉండమనీ అనేవారు. పల్లెటూరి పిల్లలందరూ చదువుకుంటే తమ పశువుల చుట్టూ బాలకార్మికులుగా ఎవరు పని చేస్తారు, పెద్దయ్యాక జీతగాళ్లుగా ఎవరు పని చేస్తారన్నది వారి తర్కం. ఆ సమయంలో భూస్వాములు విద్య ద్వారా మానవ శక్తిని అభివృద్ధి చేయడాన్ని భూస్వామ్య వ్యతిరేకతగా చూశారు. ఇప్పుడు ఏపీలో ఇంగ్లీషు విద్యావంతులైన మానవశక్తిని అభివృద్ధి చేయడాన్ని కాంట్రాక్ట్ వ్యతిరేక పెట్టుబడిగా చూస్తున్నారు. కాంట్రాక్ట్ పెట్టుబడికీ, ప్రైవేట్ విద్యా రంగానికీ, చంద్రబాబుకూ చాలా దగ్గరి సంబంధం ఉంది.2024 ఎన్నికలలో జగన్ గెలిస్తే ఈ మోడల్ దాని మూలాలను మరింత లోతుగా పాతుకుపోయేలా చేస్తుంది. పైగా దానిని ఎవరూ మార్చలేరు. ఇది జాతీయ విద్యావ్యవస్థపై కూడా ప్రభావం చూపు తుంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
రూ. 5 లక్షలిస్తే ‘విద్యానిధి’ మీదే!
వరంగల్ జిల్లాకు చెందిన మురిపాల సిద్ధార్థ్ ఎంఎస్ కోసం అమెరికాకు వెళ్లాలనుకున్నాడు. బీటెక్‌లో మంచి మార్కులు రావడంతో విదేశీ విద్యానిధి పథకం కింద దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఓ మధ్యవర్తి.. ఈ పథకం కింద రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందేలా చూస్తానని, అందుకు ప్రతిఫలంగా రూ. 5 లక్షలు ఇవ్వాలంటూ బేరమాడాడు. ఆర్థిక సాయంపై ఆశతో సిద్ధార్థ్ తండ్రి ఒప్పుకున్నాడు. రూ.లక్ష కూడా ఇచ్చాడు. ధ్రువపత్రాల పరిశీలన సమయంలో అధికారులు సిద్ధార్థ్ తండ్రిని పిలిచి మంచి మార్కులు, ఉత్తమ స్కోర్ ఉండడంతో మీ కుమారుడు తప్పకుండా ఎంపికవుతాడని చెప్పాడు. ఈ క్రమంలో ఎంపికైన సిద్ధార్థ్ అమెరికా వెళ్లి చదువు కొనసాగిస్తున్నాడు. అయితే ఎంఎస్ కోర్సులో చేరిన తర్వాత అడ్మిషన్ సర్టిఫికెట్, ధ్రువపత్రాలను సమర్పించాలని సిద్ధార్థ్ తండ్రికి అధికారులు ఫోన్ చేశారు. దీంతో ధ్రువపత్రాలను సమర్పించిన ఆయన మధ్యవర్తి విషయాన్ని వెల్లడించారు. అధికారులు ఫిర్యాదు ఇవ్వాలని చెప్పడంతో లేఖ ఇచ్చాడు. కానీ మధ్యవర్తి ఫోన్ నంబర్ పనిచేయకపోవడంతో అధికారులు చర్యలు తీసుకోలేదు. మధ్యవర్తి మాటలు విని తాను మోసపోయినట్లు చివరకు సిద్ధార్థ్ తండ్రి గుర్తించాడు. సాక్షి, హైదరాబాద్: ప్రతిభావంతులైన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా నిధి పథకం కింద గరిష్టంగా రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి, బీసీ సంక్షేమ శాఖ ద్వారా మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ విద్యా నిధి పేరిట ఈ పథకాలు అమలవుతున్నాయి. అర్హుడైన విద్యార్థికి రెండు దఫాలుగా గరిష్టంగా రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ఆర్థిక సాయం అందించే పథకం ఇదే కావడం గమనార్హం. కాగా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో ఈ పథకానికి విపరీతమైన క్రేజ్ ఉంది. దీంతో మధ్యవర్తులు దరఖాస్తుదారులను మాయ మాటలతో మోసం చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. అత్యంత గోప్యంగా ఎంపిక ప్రక్రియ పరిమిత కోటాతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఏటా గరిష్టంగా 2 వందల మందికి, బీసీ, ఈబీసీలకు 300 మందికి సాయం అందిస్తోంది. బీసీ, ఈబీసీ కేటగిరీలో ఈ ఏడాది ఏకంగా 3వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పోటీ తీవ్రంగా ఉండటంతో దరఖాస్తు, సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో మధ్యవర్తులు తల్లిదండ్రులను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అడుగుతూ ఈ పథకం కింద తప్పకుండా మీకు ఆర్థిక సాయం అందేలా చూస్తామని నమ్మబలుకుతున్నారు. విద్యానిధి పథకం కింద దరఖాస్తులు, సర్టిఫికెట్ల పరిశీలన, అర్హుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. సంబంధిత సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి/కార్యదర్శితో పాటు సంక్షేమ శాఖ కమిషనర్/డైరెక్టర్, అదనపు సంచాలకులు, సంయుక్త సంచాలకులు, ఉప సంచాలకులు ఇందులో ఉంటారు. ఈ ప్రక్రియ ఆద్యంతం గోప్యంగా సాగుతుంది. ఎంపికైన తర్వాత జాబితా వెలువడినప్పుడు మాత్రమే అర్హుల పేర్లు బయటకు వస్తాయి. ఈ అంశాన్ని మధ్యవర్తులు అవకాశంగా మలుచుకుంటున్నారు. కొందరు జాబితా వెలువడిన వెంటనే లబ్ధదారులకు ఫోన్లు చేసి తమ ప్రయత్నం వల్లే ఆర్థిక సాయం అందుతోందంటూ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి వసూళ్లకు తెగబడుతున్నారు. అధికార యంత్రాంగం నజర్ వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి తండ్రి ఇటీవల ఫిర్యాదు చేయడంతో విద్యానిధి పథకంలో జరుగుతున్న అక్రమ వ్యవహారంపై అధికారులు దృష్టి పెట్టారు. విద్యార్థులు, తల్లిదండ్రులను పిలిపించి మధ్యవర్తుల అంశంపై ఆరా తీస్తున్నారు. సమాచారం ఇచ్చిన వారి నుంచి లిఖిత పూర్తక ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. దీనిపై ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. విద్యానిధి అర్హతలు, ఎంపిక ఇలా... విదేశీ విద్యా నిధి పథకంలో గ్రాడ్యుయేషన్ మార్కులు కీలకం. నిర్దేశించిన దేశాల్లో ఎంఎస్ చదువుకునే విద్యార్థులు ఈ పథకం కింద ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు సమర్పించాలి. విద్యార్థి డిగ్రీ మార్కులకు 60 శాతం స్కోర్, జీఆర్ఈ/జీమ్యాట్ స్కోర్‌కు 20 శాతం, ఐఈఎల్టీఎస్/టోఫెల్‌కు మరో 20 శాతం మార్కులుంటాయి. దరఖాస్తులను అధికారులు వడపోసి నిబంధనల ప్రకారం అత్యధిక మార్కులున్న వారిని రిజర్వేషన్ల వారీగా ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో అత్యధిక మార్కులున్న వారి జాబితాను రూపొందించి పరిమితికి లోబడి అర్హుల ఎంపిక చేపడతారు. బీసీల్లో మాత్రం సబ్ కేటగిరీలు, ఈబీసీ కేటగిరీ వారీగా వడపోత చేపట్టి ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థికి మొదటి రెండు సెమిస్టర్లు పూర్తయ్యాక సగం, చివరి రెండు సెమిస్టర్లు పూర్తయ్యాక మిగతా సాయాన్ని ప్రభుత్వం విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. విద్యార్థి చదువుకు సంబంధించిన ప్రతి అంశాన్ని అధికారులకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తేనే నిధులు విడుదలవుతాయి. -
పేద విద్యార్థులు, దాతల మధ్య వారధిగా రాజ్‌భవన్
సాక్షి, హైదరాబాద్: పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్ లను బహూకరించేందుకు దాతలు ముందుకు రావాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ‘డొనేట్ ఏ డివైస్’కార్యక్రమంలో భాగంగా అక్షయవిద్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాజ్‌భవన్‌లో వంద మంది పేద విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లను గవర్నర్ బహూక రించారు. పేద విద్యార్థులు, దాతల మధ్య వారధి గా రాజ్‌భవన్ పనిచేస్తుందని గవర్నర్ అన్నారు. అయోధ్య రామాలయ పాదుకలకు పూజలు అయోధ్య రామాలయం కోసం చల్లా శ్రీనివాసశాస్త్రి రూపొందించిన స్వర్ణ పాదుకలకు గవర్నర్ తమి ళిసై మంగళవారం రాజ్‌భవన్‌లో పూజలు నిర్వహించారు. గర్భగుడిలో ఈ పాదుకలు నిత్యం కోట్లాది మంది భక్తుల పూజలను అందుకోనున్నాయని గవర్నర్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసశాస్త్రిని ప్రత్యేకంగా అభినందించారు. నరసింహన్ భేటీ: రాష్ట్ర మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు మంగళవారం రాజ్‌భవన్‌లో గవ ర్నర్ తమిళిసైని మర్యాదపూర్వకంగా కలిశారు. -
174 మంది విద్యార్థులు.. రూ. 61.27 లక్షలు
రాయదుర్గం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే గ్రామీణ విద్యార్థులకు చేయూత ఇచ్చేందుకు కొండాపూర్‌లోని చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు నడుం బిగించారు. అందుకోసం ‘క్లౌడ్ ఫండింగ్ ఫ్లాట్‌ఫాం ఫ్యూయల్ ఎ డ్రీమ్ డాట్‌కామ్’ద్వారా నిధులను సేకరించారు. పాఠశాలకు చెందిన 174 మంది విద్యార్థులు స్వచ్చందంగా ముందుకొచ్చి మూడు వారాల్లోనే రూ.61.27 లక్షలు సేకరించడం విశేషం. తెలంగాణ, మహారాష్ట్రలోని అన్ని ప్రాంతాలలో చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్యాక్–టు–స్కూల్ కిట్‌ను అందించడమే లక్ష్యంగా వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కిట్కోసం సంవత్సరానికి రూ.900 ఖర్చవుతుంది. గ్రీన్‌సోల్ అనే ఎన్జీఓ సహకారంతో ఈ కిట్‌ను తయారు చేయించారు. చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రతి విద్యార్థి రూ.27వేలు సేకరించడం లక్ష్యం. దీంతో 30 మంది గ్రామీణ విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. అయితే 174 మంది విద్యార్థులు రూ.61.27 లక్షలను సేకరించడంతో 6,800 మంది విద్యార్థులకు మేలు జరగనుంది. -
ఓట్ల కోసం కేసీఆర్ కపట నాటకం
మధిర: పదేళ్లు అధికారంలో ఉండి చేయలేని పనులను పదిరోజుల్లో చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం ప్రజలను మోగించడమేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఖమ్మం జిల్లా మధిరలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తశుద్ధితో పనిచేసే సీఎం కావాలా, ఫామ్‌హౌస్‌లో పడుకునే సీఎం కావాలో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు క్యాంప్ ఆఫీసులో ప్రజల సమస్యలు తెలుసుకుని, వినతిపత్రాలు స్వీకరించడమే కాక అన్ని పారీ్టల ఎమ్మెల్యేల సమస్యలు వినేవారని, సచివాలయంలో అధికారులతో సమీక్షలు చేసేవారని గుర్తుచేశారు. ఇందులో ఏ ఒక్కటీ చేయలేని కేసీఆర్, ఆరు నెలలకోసారి అసెంబ్లీని మూడు రోజులు తూతూమంత్రంగా నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవరు సీఎం అయితే ఏంటీ? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎవరు సీఎం అయితే ఏంటీ.. రాజీవ్ ఆరోగ్యశ్రీ, పేదలకు ఇళ్లు, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు అమలవుతాయా, లేదా అన్నదే ముఖ్యమని భట్టి అన్నారు. కేసీఆర్ అనవసరంగా సీఎం గోల ఎత్తుకున్నారని మండిపడ్డారు. దోపిడీ, కమీషన్లు లేకుండా ప్రతీపైసా ప్రజల కోసం ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు నిధుల సమస్య రాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో పారీ్టపరంగానే తప్ప వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని భట్టివిక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. -
AP: ప్రభుత్వ బడుల్లో ‘ఐబీ’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ స్కూళ్లలో అంతర్జాతీయ ప్రమాణాల పెంపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేద విద్యార్థులను గ్లోబల్ స్థాయిలో సగర్వంగా నిలబెట్టేందుకు మహత్తర యజ్ఞాన్ని తలపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బక్‌లారియెట్ (ఐబీ) సిలబస్ అమలుకు ముందడుగు వేసింది. ఈ మేరకు ఐబీ సంస్థతో పాఠశాల విద్యా శాఖ కుదుర్చుకున్న ఒప్పందానికి (ఎంఓయూ) బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో హర్షధ్వానాల మధ్య ఆమోదం లభించింది. విద్యా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటికే ఆంగ్ల భాష పరిజ్ఞానం పెంపునకు మూడో తరగతి నుంచి ప్రతి రోజు గంటపాటు విద్యార్థులకు టోఫెల్ శిక్షణ అందిస్తోంది. తాజా ఒప్పందంతో ఒకటవ తరగతి నుంచి ఐబీ సిలబస్‌ను ప్రవేశపెడుతూ నెమ్మదిగా పై తరగతులకు విస్తరిస్తుంది. దీంతోపాటు రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేకూరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్ అనంతరం సీపీఎస్ ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ప్రతిపాదించిన గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) అమలుకు ముందడుగు వేసింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీం(ఏపీజీపీఎస్) బిల్లు– 2023ను ప్రవేశపెట్టనుంది. దీనితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో 2014 జూన్ 2వ తేదీ కంటే ముందు కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన సుమారు 10 వేల మందికిపైగా ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ బిల్లు–2023నూ అసెంబ్లీ ముందుకు తీసుకురానుంది. ఈ నిర్ణయాలకూ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాల వివరాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సహం’ పేరుతో అవార్డులను అందజేయనున్నారు. యూపీఎస్సీ పరీక్షల్లో ప్రిలిమనరీ, మెయిన్స్ రెండు విభాగాల్లో ఉత్తీర్ణులై సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడిన పేద అభ్యర్థులకు ఆర్థిక సాయం అందిస్తారు. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయితే రూ.లక్ష, వీరిలో మెయిన్స్‌కు అర్హత సాధిస్తే అదనంగా మరో రూ.50 వేలు నగదు ప్రోత్సాహకం అందిస్తారు. ఇందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జఫ్రీన్‌కు గ్రూప్–1 ఉద్యోగం కోసం చట్ట సవరణ 2017 డెఫ్ ఒలింపిక్స్ టెన్నిస్‌లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతక విజేత, ఇండియన్ డెఫ్ టెన్నిస్ టీం కెప్టెన్ షేక్ జఫ్రీన్‌కు గ్రూప్–1 సర్వీసెస్‌లో కో–ఆపరేటివ్ సొసైటీస్ డెప్యూటీ రిజిస్ట్రార్ హోదాలో నియామకం కల్పించనున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ (రెగ్యులేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్ పేట్రన్ అండ్ పే స్ట్రక్చర్) యాక్ట్– 1994ను సవరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జఫ్రీన్‌కు 10 సెంట్ల ఇంటి స్థలం కూడా కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. జీరో వేకెన్సీలో టాప్ వైద్య ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ పాలసీని సమర్థవంతంగా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ. ఆరోగ్య శాఖలో ఎక్కడా కూడా ఖాళీలు లేకుండా సిబ్బందిని ఎప్పటికప్పుడు నియమిస్తున్నారు. తాజాగా కేన్సర్ వైద్యాన్ని బలోపేతం చేసేందుకు డీఎంఈ పరిధిలోని విశాఖ కింగ్‌జార్జ్ ఆస్పత్రి, గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రి, కడప ప్రభుత్వ ఆస్పత్రిలో కేన్సర్ కేర్ సెంటర్లో 353 పోస్టుల భర్తీ చేస్తున్నాం. ఒంగోలు, ఏలూరు, విజయవాడలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో ప్రమోషన్ విధానం/అవుట్ సోర్సింగ్ ద్వారా 168 పోస్టుల భర్తీకి నిర్ణయం. వీటికి తోడు 11 ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో వివిధ విభాగాల్లో మరో 99 పోస్టులను భర్తీ చేయాలన్న వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదలకు ఆమోదం లభించింది. ఏపీ వైద్య విధాన పరిషత్‌ను వైద్య ఆరోగ్య శాఖలోకి విలీనం చేస్తున్నాం. ఆర్డినెన్స్ స్థానంలో దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నాం. దీంతో ఏపీవీవీపీలోని ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. దీనికి మంత్రివర్గం ఆమోదం లభించింది. 45 రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష రాష్ట్రంలోని ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే సెప్టెంబరు 15 నుంచి జగనన్న ఆరోగ్య సురక్షపై అవగాహన కార్యక్రమాలు తలపెట్టాం. ఇందులో భాగంగా తప్పకుండా పేదల ఇళ్లను సందర్శించి ఆరోగ్య శ్రీ, ఆరోగ్య సురక్షపై అవగాహన కల్పించాలని అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సీఎం జగన్ సూచించారు. ఆ తర్వాత ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, వలంటీర్లు, ఎంఎల్‌హెచ్‌పీలు ఇంటింటికీ వెళ్లి అవసరమైన వారికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు అందజేస్తారు. మెడికల్ క్యాంపుల తేదీలను ముందుగానే ప్రకటిస్తారు. దీర్ఘకాలిక, తీవ్ర వ్యాధులతో బాధ పడేవారికి పూర్తిగా చికిత్స చేయించేంత వరకు తోడుగా నిలుస్తారు. ఇందుకోసం ప్రభుత్వం విలేజ్ క్లినిక్స్‌లో అందుబాటులో ఉన్న మందులు కాకుండా అదనంగా 162 రకాల మందులు, 18 సర్జికల్స్ అందుబాటులో ఉంచుతోంది. స్పెషలిస్ట్ వైద్యుల సూచన మేరకు ఇతర మందులు కూడా అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 15 వరకు దాదాపు 45 రోజుల పాటు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల నిర్వహణకు క్యాబినెట్ ఆమోదించింది. ప్రైవేటు వర్సిటీ విద్యలో మార్పు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు వర్సిటీస్ (ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్టు–2016 చట్ట సవరణకు అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనున్నాం. దీని ద్వారా ప్రైవేటు వర్సిటీల్లో నాణ్యత ప్రమాణాలు మెరుగుపడతాయి. ఈ చట్ట సవరణతో ఇంతకు ముందున్న ప్రైవేటు వర్సిటీలు, కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు వర్సిటీలు ప్రపంచంలోని టాప్ 100 వర్సిటీలతో భాగస్వామ్యం కలిగి ఉండాలి. ప్రఖ్యాత వర్సిటీలతో ఇక్కడి ప్రైవేటు వర్సిటీలు విద్యార్థులకు సంయుక్త సర్టిఫికేషన్ డిగ్రీలు అందించాలి. ఇప్పుడున్న ప్రైవేటు కాలేజీలను వర్సిటీలుగా మారిస్తే వచ్చే అదనపు సీట్లలో 35 శాతం సీట్లు కన్వీనర్ కోటాలోకి వస్తాయి. దీనివల్ల పేద విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. చిరుద్యోగికి పెద్ద సాయం ప్రభుత్వంలో చిరుద్యోగి రిటైరయ్యే సమయానికి కనీసం ఇంటి స్థలం సమకూర్చుకునేలా ప్రోత్సహిస్తాం. దీనిని ప్రభుత్వం బాధ్యతగా స్వీకరిస్తుంది. రిటైరైన తర్వాత చిరుద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీతో సేవలు అందేలా సీఎం నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మరోవైపు పోలవరం నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న ఇళ్ల అంచనా ఖర్చు పెరిగింది. 2016–17 నాటి రేట్ల ప్రకారమే ఇళ్ల నిర్మాణ అంచనాలు తయారు చేశారు. తాజా రేట్లను బట్టి చూస్తే 8,424 ఇళ్ల నిర్మాణానికి రూ.70 కోట్లు అదనంగా వ్యయం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. భూదాన్– గ్రామదాన్ చట్ట సవరణ ఆంధ్రప్రదేశ్ భూదాన్–గ్రామదాన్ యాక్టు 1965 సవరణలతో కూడిన డ్రాప్ట్ బిల్లుకు కేబినెట్ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ఆచార్య వినోభా భావే లేక ఆయన నామినేట్ చేసిన వ్యక్తిని సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వాలు భూదాన్ బోర్డును నియమించాలి. కానీ ఈ చట్టం వచ్చి 58 సంవత్సరాలు కావడం, వినోభా భావే మృతి చెంది కూడా 41 ఏళ్లవడంతో ఆయన నామినేట్ చేసిన అసలు వ్యక్తి ఎవరో నిర్ధారించడం కష్టంగా మారింది. దీంతో చట్టానికి అనుగుణంగా ప్రభుత్వమే బోర్డు ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులను నియమించేందుకు వీలుగా చట్టాన్ని సవరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బలహీన వర్గాలు, పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం భూమిని మంజూరు చేసే అధికారాన్ని బోర్డు కల్పించేలా చట్టంలో మార్పు చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చట్ట సవరణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. పోస్టుల భర్తీ ప్రతిపాదనకు ఆమోదం – ఆదోనిలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 34 టీచింగ్ పోస్టులు, 10 నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి కేబినెట్ ఆమోదం. – కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా 13 స్పెషల్ కేడర్ డెప్యూటీ రిజిస్ట్రార్, 6 డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టుల భర్తీ. – సెరికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టు భర్తీ. – ఆంధ్రప్రదేశ్ విద్యుత్ విభాగంలో డెప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ (తిరుపతి), ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్(రాజమండ్రి) పోస్టుల ఏర్పాటు. – కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ కోస్టల్ జోన్ మేనేజిమెంట్ అథారిటీ (ఏపీసీజెడ్‌ఎంఏ)లో శాశ్వత విభాగంతో పాటు 10 కొత్త పోస్టుల మంజూరు. – సాధారణ పరిపాలన విభాగంలో చీఫ్ ఎలక్టోరల్ కార్యాలయంలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ. – ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ సోషల్ అండ్ హజార్డస్ యాక్టివిటీస్ ట్రిబ్యునల్‌లో 5 కొత్త పోస్టుల మంజూరు. – ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 40 ఆఫీసు సబార్డినేట్ పోస్టులు, 28 డ్రైవర్ పోస్టులు అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ. మరిన్ని అంశాలకు కేబినెట్ పచ్చ జెండా – ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా తొమ్మిది మంది జీవిత ఖైదీలకు క్షమాభిక్ష ప్రతిపాదిత నిర్ణయం – కురుపాం గిరిజన ఇంజనీరింగ్ కళాశాలలో 50 శాతం సీట్లను షెడ్యూల్ ప్రాంతంలోని ఎస్టీ విద్యార్థులకే కేటాయింపు. – వ్యక్తుల గుర్తింపు కోసం ఆధారం వినియోగంపై చట్టబద్ధత కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఆధార్ చట్టంపై బిల్లుకు కేబినెట్ ఆమోదం. – నిషేధిత కార్యకలాపాలకు పాల్పడుతున్న రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్(ఆర్డీఎఫ్), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మావోయిస్టు)పై నిషేధం మరో ఏడాది పొడిగింపు. – ఏపీఐఐసీసీకి చెందిన 2 వేల ఎకరాల్లో రూ.2,190 కోట్లతో బల్క్ డ్రగ్ ప్రాజెక్టును ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే తొలుత అనుకున్నట్లు కాకుండా కాకినాడ నుంచి బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టును అనకాపల్లి జిల్లా నక్కపల్లికి తరలిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కేవలం ప్రభుత్వ భూముల్లోనే ఈ ప్రాజెక్టు నెలకొల్పాలి. నక్కపల్లిలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో స్థలం మార్పు చేయడానికి మంత్రివర్గం ఆమోదించింది. పలు చట్ట సవరణ బిల్లులకు ఆమోదం – ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యాక్టు–2017లో భాగంగా వర్సిటీల్లో నియామకాలు ఇకపై ఏపీపీఎస్సీ ద్వారానే చేపట్టేలా సవరణ బిల్లు. – ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ టాక్సియేషన్ యాక్ట్ 1963 సవరణలతో కూడిన డ్రాప్ట్ బిల్లు. – ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ 2023 సవరణల బిల్లు. – ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ యాక్టు–1987 సవరణలకు ఆమోదం. – ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్) యాక్ట్ 1977కు సవరణ. ఆర్డినెన్స్ స్థానంలో చట్టం తీసుకువస్తూ ప్రవేశపెట్టనున్న బిల్లు. – ది ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూపు (ఏపీ ఎస్ఎస్జీ) బిల్లుకు అమోదం. అభివృద్ధికి భూ కేటాయింపులు – విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలో ఎస్బీఐ ఆధ్వర్యంలో రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కు ఎకరా స్థలాన్ని 33 ఏళ్లపాటు లీజు ప్రతిపాదికన కేటాయింపు. – పల్నాడు జిల్లా మాచర్ల మండలం నాగులవరంలో 100.45 ఎకరాల భూమి ఏపీఐఐసీకి కేటాయింపు. – గుంటూరుకు చెందిన విశ్వ మానవ సమైక్యతా సంసత్ విజ్ఞప్తి మేరకు ఎకరా రూ.లక్ష చొప్పున 7.45 ఎకరాల స్థలాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడిమిపాలెంలో మదర్ అండ్ చైల్డ్ కేర్ ఆస్పత్రి నిర్మాణానికి కేటాయింపు. – చిత్తూరు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కృష్ణ, శ్రీకాకుళం, బాపట్ల, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం జిల్లాల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమైన భూ కేటాయింపులు. – ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీకి కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో ఉచితంగా 2.41 ఎకరాల భూమి కేటాయింపు. – సంస్కృతి, కళలు పెంపొందిస్తూ పర్యాటక ఆదాయాన్ని పెంచడంలో భాగంగా మధురవాడలో యూనిటీ మాల్ (కన్వెన్షన్ సెంటర్) నిర్మాణం. – బాపట్ల, నాయుడుపేట, తణుకు మున్సిపాల్టీల పరిధిలో చదరపు మీటరుకు ఏడాదికి రూ.1 నామమాత్రపు అద్దె ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులను డీబీఓటీ (డిజైన్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్) విధానంలో నిర్వహించేందుకు అవసరమైన భూమి కేటాయింపు. ‘ఐబీ’ సిలబస్ చారిత్రక ఘట్టం అమెరికా వంటి దేశాల్లో మాత్రమే ఐబీ సిలబస్ అందుబాటులో ఉంది. ఇప్పుడు మన పిల్లలకు అందిస్తున్నాం. రాష్ట్రంలో ‘ఐబీ’ సిలబస్‌ను ప్రవేశపెట్టడం చారిత్రక ఘట్టం. ఐబీలో చదువుకున్న విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా ఏ యూనివర్సిటీకి వెళ్లినా మంచి అవకాశాలు వస్తాయి. ప్రశ్నలు వేసే విధానం, వాటికి సమాధానాలు నేర్చుకునే విధానం నిజ జీవితాలకు దగ్గరగా ఉంటుంది. ఇప్పటికే మూడో తరగతి నుంచి విద్యార్థులకు వారానికి ఆరు రోజులు.. రోజూ గంట పాటు టోఫెల్ శిక్షణ ఇప్పిస్తున్నాం. వీళ్లు 8, 9 తరగతులకు వచ్చే సరికి మంచి నైపుణ్యం సాధిస్తారు. దీనివల్ల వారికి ఇంగ్లిషులో పరిజ్ఞానం బాగా పెరుగుతుంది. సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి కూడా మనం తోడ్పాటునందించాలి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే రూ.లక్ష, వీరు మెయిన్స్ కూడా క్వాలిఫై అయితే అదనంగా మరో రూ.50 వేలు ఇస్తే.. కష్టపడి చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఎంతో మేలు చేసినట్టువుతుంది. భవిష్యత్తులో సివిల్ సర్వెంట్లుగా ఎందరో పేదలకు సేవ చేయడానికి స్ఫూర్తినిచ్చినట్టు ఉంటుంది. – ప్రభుత్వ బడుల్లో ఐబీ సిలబస్‌పై మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ -
విద్యార్థులకు ‘విదేశీ’ వరం!
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం విద్యా రంగంలో విప్లవాత్మకమైన అడుగుగా చరిత్రలో నిలిచిపోతుంది. మన పిల్లలు టాప్ సీఈవోలుగా ప్రపంచాన్ని శాసించే ఉద్యోగాలు చేసే స్థాయికి చేరుకుంటారు. ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలిచిన కాలేజీల్లో ఎవరికి సీటు వచ్చినా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పథకాన్ని అమలు చేస్తున్నాం. అలాంటి యూనివర్సిటీల్లో చదవాలంటే చాలా ఖర్చు అవుతుంది. తల్లిదండ్రులు అప్పుల బారిన పడకుండా.. పిల్లలు దిగులు చెందకుండా విదేశాల్లో ఉన్నత చదువులకు అండగా నిలుస్తున్నాం. ఇలా పిల్లలకు బాసటగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉన్నత చదువులు అభ్యసించేలా జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని రూపొందించినట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పథకానికి పరిమితులు లేకుండా శాచ్యురేషన్ విధానంలో అర్హులందరికీ ప్రయోజనం చేకూరుస్తున్నట్లు చెప్పారు. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద అర్హులైన 357 మందికి రూ.45.53 కోట్లను ముఖ్యమంత్రి జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ ఏమన్నారంటే.. వీసా నుంచి విమాన చార్జీల దాకా.. మంచి కాలేజీలో సీటు వచ్చినా అంత డబ్బులు కట్టే స్ధోమత లేని రాష్ట్ర విద్యార్ధులకు విదేశాల్లో చదువులకు ఒక వరంలా జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం అన్ని రకాలుగా తోడ్పాటునిస్తుంది. ఒక భరోసా కల్పిస్తుంది. ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా ఎక్కడా వివక్ష, లంచాలు లేకుండా అమలు చేస్తున్నాం. క్యూఎస్ లేదా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిల్చిన టాప్ 50 విద్యాసంస్ధల్లో సీటు సాధించిన వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. శాచ్యురేషన్ పద్ధతిలో ఎంతమంది దరఖాస్తు పెట్టుకున్నా అర్హత ఉంటే సపోర్టు అందిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతరులకైతే రూ.కోటి వరకు చెల్లిస్తున్నాం. విదేశీ విశ్వ విద్యాలయాలకు వెళ్లే పిల్లలను విమాన చార్జీలు, వీసా చార్జీల దగ్గర నుంచి ప్రతి అడుగులోనూ చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. పది ఉత్తమ విద్యాసంస్థల్లో ఫీజులిలా.. ఈ టాప్ 50 కాలేజీల్లో చదవాలంటే ఫీజులు ఎలా ఉన్నాయి? సీటు వచ్చినా సామాన్యుడు, పేదవాడు చదువుకునే పరిస్థితి ఉందా? అన్నది ఒక్కసారి గమనిస్తే.. చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ రూ.1.32 కోట్లు, యూనివర్సిటీ ఆఫ్ మాంఛెస్టర్‌లో ఎంఎస్ రూ.1.02 కోట్లు, కార్నిగీ మిలన్ యూనివర్సిటీలో టెపర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ రూ.1.16 కోట్లు, లండన్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ రూ.1.13 కోట్లు, కొలంబియా యూనివర్సిటీలో ఎంఎస్ రూ.1.11 కోట్లు, న్యూయార్క్ యూనివర్సిటీలో ఎంఎస్ రూ.1.09 కోట్లు, ఇన్సీడ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఫ్రాన్స్‌లో ఎంబీఏ రూ.88 లక్షలు, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఏంబీఏ రూ.68.86 లక్షలు, ఎంఐటీలో స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో రూ.67 లక్షలు, యూసీ బర్క్లీలో ఎంఎస్ రూ.61 లక్షల నుంచి రూ.2.06 కోట్ల వరకూ ఫీజులున్నాయి. ఉదాహరణగా పది మంచి విద్యాసంస్ధలు గురించి చెప్పాను. ప్రపంచాన్ని శాసించే లీడర్లు కావాలని.. ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాత కాలేజీలలో మన పిల్లలకు ఎవరికైనా సీట్లు వచ్చినా సామాన్యులు, పేదరికం కారణంగా అంత ఫీజులు కట్టి చదవడం సాధ్యమేనా? అన్నది మొట్టమొదట ఈ పథకం గురించి ఆలోచించినప్పుడు నాకు తట్టిన ఆలోచన. ఇలాంటి కాలేజీలలో మన పిల్లలు చదివి బయటకు వస్తేనే రేపొద్దున ప్రపంచాన్ని శాసించే విధంగా టాప్ మోస్ట్ కంపెనీలలో సీఈవోలుగా రాణించే స్థాయికి చేరుకుంటారు. పెద్ద స్ధాయిలోకి వెళ్లే అవకాశం వస్తుంది. అందుకే అలాంటి కాలేజీలలో సీట్లు సాధించిన మన పిల్లలను సపోర్టు చేయాలని నిర్ణయించుకున్నాం. అలా చేయకపోతే ఏ రకంగా మన పిల్లలను, మన రాష్ట్రాన్ని లీడర్లుగా చూడగలుగుతాం అన్నది ఈ ఆలోచనలకు ప్రేరణ. నాడు.. ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా గత ప్రభుత్వంలో పరిస్థితి చూస్తే కేవలం రూ.10 లక్షలు.. ఎస్సీ ఎస్టీలకు అయితే రూ.15 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. ఈ అమౌంట్ ఎక్కడ? మనమిస్తున్న రూ.1.02 కోట్లు, రూ.1.16 కోట్లు, రూ.1.09 కోట్లు, రూ.87 లక్షలు, రూ.70 లక్షలు, రూ.1.32 కోట్లు ఫీజు ఎక్కడ? గతంలో ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఇచ్చారు. అక్కడ కూడా ప్రతిదానిలో కోత పెట్టేవారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ దొరికేది కాదు. శాచ్యురేషన్ విధానం లేదు. సిఫార్సులతో ఇచ్చేవారు. అది కూడా సక్రమంగా ఇవ్వకుండా 2016–17 నుంచి దాదాపు రూ.318 కోట్లు బకాయిలు పెట్టి ఈ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. నేడు అర్హులందరికీ.. ఈరోజు పథకంలో పూర్తి మార్పులు తీసుకొచ్చి శాచ్యురేషన్ విధానంలో అమలు చేస్తున్నాం. అర్హత కలిగి ఉండి టాప్ 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీలలో దాదాపు 320 కాలేజీల్లో సీట్లు ఎవరికి వచ్చినా వర్తింప చేస్తున్నాం. గతంలో ఆదాయ పరిమితి రూ.6 లక్షలు ఉంటే ఇప్పుడు రూ.8 లక్షల వరకూ పెంచాం. అర్హత ఉంటే చాలు.. రూపాయి లంచం లేకుండా, వివక్షకు తావు ఇవ్వకుండా, పార్టీలతో సంబంధం లేకుండా అత్యంత పారదర్శకంగా మన పిల్లలకు తోడుగా ఉండేలా అడుగులు వేస్తున్నాం. ఏకైక రాష్ట్రం ఏపీ ఇదో విప్లవాత్మకమైన అడుగు. రాబోయే రోజుల్లో భావితరాలు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని గుర్తుంచుకునేలా ఇంత సపోర్టు చేస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. టాప్ 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీలలో దాదాపు 320 కాలేజీలలో ఎవరికి సీటు వచ్చినా పారదర్శకంగా సపోర్టు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇదొక విప్లవాత్మకమైన అడుగుగా చరిత్రలో మిగిలిపోతుంది. ఈ పిల్లలు గొప్పగా ఎదిగి పెద్ద కంపెనీల్లో సీఈవోలుగా, ఉన్నత స్థాయిలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాలుగు విడతలుగా స్కాలర్షిప్.. ఈ స్కాలర్షిప్ పథకాన్ని నాలుగు విడతలుగా అమలు చేస్తున్నాం. ఇమ్మిగ్రేషన్ కార్డు పొందిన విద్యార్ధులకు వెంటనే తొలివిడత ఇస్తాం. ఫస్ట్ సెమిస్టర్ ఫలితాల అనంతరం రెండో విడత, రెండో సెమిస్టర్ టెర్మ్ ఫలితాలు విడుదలైనప్పుడు మూడో విడత, విజయవంతంగా నాలుగో సెమిస్టర్ పూర్తి చేసి మార్క్స్ షీటు అప్లోడ్ చేయగానే చివరి విడతను విద్యార్థులకు అందించేలా పథకాన్ని డిజైన్ చేశాం. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ పిల్లలందరికీ ఈ టాప్–50 కాలేజీలలో, 21 ఫ్యాకల్టీలలో ఎక్కడ సీటు వచ్చినా దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. తోడుగా ఉంటామని భరోసా ఇస్తున్నా. మన రాష్ట్ర ఖ్యాతిని పెంచాలి మన పిల్లలకు అంతా మంచి జరగాలి. తల్లిదండ్రుల మీద ఎటువంటి భారం పడకూడదు. అప్పుల పాలవుతామనే భయం లేకుండా పిల్లలను గొప్ప చదువులకు పంపించాలి. పిల్లలకు కూడా తమ తల్లిదండ్రులు అప్పులు చేసి పంపారనే బాధ ఎక్కడా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించాం. పిల్లలు అక్కడకు (విదేశాలకు) వెళ్లి గొప్పగా చదివి మన రాష్ట్ర ఖ్యాతిని ఇంకా పెంచాలన్న మంచి సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నా. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు.. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పీడిక రాజన్నదొర, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ జి.అనంతరాము, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బి.జయలక్ష్మి, ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఇంతియాజ్, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ కె.విజయ, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ జె.వెంకటమురళి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు జగనన్న విదేశీ విద్యా దీవెన అమలు
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్యసించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి. సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతరులకు రూ. కోటి వరకు 100% ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుంది. ఈ విడతలో అర్హులైన 357 మంది విద్యార్థులు రూ.45.53 కోట్లు అందుకోనున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో.. గత చంద్రబాబు ప్రభుత్వంలో విదేశాలకు వెళ్లి చదువుకొనే విద్యార్థులకు చేసిన ఆర్థిక సాయం అరకొరే. ఎస్సీ, ఎస్టీలకు కేవలం రూ.15 లక్షలు, ఇతరులకు రూ. 10 లక్షలు మాత్రమే ఇచ్చారు. కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి రూ. 6 లక్షలుగా నిర్ణయించడంతో కొద్ది మందికే ప్రయోజనం కలిగింది. లబ్ధిదారుల ఎంపికలోనూ అవినీతి, సిఫార్సులకే పెద్దపీట వేశారు. ఈ కాస్త ఫీజునూ చెల్లించకుండా చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులకు ఎగనామం పెట్టింది. 2016 – 17 సంవత్సరం నుండి 3,326 విద్యార్థులకు రూ.318 కోట్ల ఫీజులు ఎగ్గొట్టి, ఆ తర్వాత పథకాన్నే ఎత్తివేసింది. ప్రమాణాలు లేని, పేలవమైన ర్యాంకులున్న సంస్థలను ఎంపిక చేయడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని దుస్థితి నెలకొంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో.. సీఎం వైఎస్ జగన్ సంతృప్త స్థాయిలో అర్హులైన విద్యార్థులందరికీ పూర్తి ఫీజులు అందేలా ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకాన్ని తీర్చిదిద్దారు. ప్రతి ఏడాది 2 సీజన్లలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు పొందిన వారికి లబ్ధి చేకూరుస్తున్నారు. సంబంధిత శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీల నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీ ద్వారా పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా నగదును నేరుగా లబ్ధిదారులైన విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. నాణ్యమైన విద్యకు పట్టం కడుతూ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఎంపిక చేసిన 21 కోర్సుల్లో టాప్ 50 యూనివర్శిటీలకు ఎంపికైన విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకునేలా వారి చదువులు ఒక్కో మెట్టూ ఎక్కేకొద్దీ 4 వాయిదాల్లో స్కాలర్షిప్స్ మంజూరు చేస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ కార్డు (ఐ–94) పొందాక తొలి వాయిదా, మొదటి సెమిస్టర్ ఫలితాల తర్వాత 2వ వాయిదా, 2వ సెమిస్టర్ ఫలితాల తర్వాత 3వ వాయిదా, 4వ సెమిస్టర్ విజయవంతంగా పూర్తి చేసి మార్క్ షీట్ ఆన్లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేశాక చివరి వాయిదా చెల్లిస్తున్నారు. కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ. 8 లక్షలకు పెంచడం ద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుస్తున్నారు. ఈ పథకం పూర్తి వివరాలను https://jnanabhumi.ap.gov.in వెబ్సైట్లో ఉంచారు. పథకానికి సంబంధించి సహాయం, ఫిర్యాదుల కోసం ‘జగనన్నకు చెబుదాం (1902 టోల్ ఫ్రీ నంబర్)’లోనూ సంప్రదించవచ్చు. ఇదీ పథకం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం తదితర 21 ఫ్యాకల్టీల్లో టాప్ 50 ర్యాంకుల్లోని విదేశీ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. దీని ద్వారా ప్రపంచంలోని 320కి పైగా ఉత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకొనేందుకు మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కలుగుతుంది. గడచిన 6 నెలల్లో ‘జగనన్న విదేశీ విద్యా దీవెన‘ కింద అందించిన ఆర్థిక సాయం రూ.65.48 కోట్లు. -
పేద విద్యార్థులకు కూడా పెద్ద చదువులు
-
పేదలకు పెద్ద చదువులే లక్ష్యంగా..
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులను కూడా పెద్ద చదువులు చదివించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా జన వరి–ఫిబ్రవరి–మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిధులను బుధవారం సీఎం లబ్ధిదారులకు జమచేయనున్నారు. ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తోంది. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో జనవరి–మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరుస్తూ రూ.703 కోట్లను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సందర్భంగా కొవ్వూరులో జరగనున్న బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. పేద విద్యార్థులకు వైఎస్ జగన్ సర్కారు చేస్తున్న మేలును ఒకసారి పరిశీలిస్తే.. ‘జగనన్న విద్యా దీవెన’.. పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలన్న ఆశయంతో.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చేలా, వారి తల్లుల ఖాతాల్లో జగనన్న ప్రభుత్వం నేరుగా జమచేస్తోంది. ‘జగనన్న వసతి దీవెన’.. అలాగే, ఉన్నత చదువులు చదివే ఈ పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బందిపడకుండా ఉండేందుకు వీలుగా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు అయితే రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ.. వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో ప్రభుత్వం నేరుగా జమచేస్తోంది. అలాగే.. ► ఇప్పటివరకు 26,98,728 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యాదీవెన కింద రూ.10,636.67 కోట్లను ప్రభుత్వం జమచేసింది. ► గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చే ఫీజుల్లో సైతం బకాయిలు పెట్టింది. ఇలా 2017 నుంచి పెట్టిన బాకీలు రూ.1,778 కోట్లతో కలిపి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన కింద ఇప్పటివరకు జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,912.43 కోట్లు. ► ఇలా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 47 నెలల కాలంలో విద్యారంగం మీద చేసిన ఖర్చు మొత్తం అక్షరాల రూ.59,331.22 కోట్లు. ఉన్నత విద్యకు ప్రోత్సాహం ఇలా.. ► నిజానికి.. పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ (విద్యా దీవెన)తో పాటు భోజన, వసతి సౌకర్యాల (వసతి దీవెన) కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ► ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు కరిక్యులమ్‌లో మార్పులు చేసి జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్‌తో నాలుగేళ్ల హానర్స్ కోర్సులు.. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచి వారు వెంటనే ఉపాధి పొందేలా 30 శాతం నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రవేశపెట్టారు. ► ఇందులో భాగంగా విద్యార్థులు తాము చదువుతున్న కోర్సులతో పాటు తమకు అవసరమైన ఇతర నైపుణ్యాలను ఆన్లైన్లో నేర్చుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ► కరిక్యులమ్‌లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్‌షిప్ పెట్టడం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. ► 40 రకాల నైపుణ్యాలలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే 1.20 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలో, అదే విధంగా సేల్స్‌ఫోర్స్‌లో 33,000, ఏడబ్ల్యూఎస్‌లో 23,000, నాస్కామ్‌లో 20,000, పాలో ఆల్టోలో 10,000, ఆల్టెరిక్స్ డేటా అనలిటిక్స్‌లో 7,000 మందికి శిక్షణ పూర్తిచేసి సర్టిఫికెట్లు అందించారు. ఇలా దేశంలో ఒకే ఏడాది రెండు లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్స్ సాధించిన ఏకైక రాష్ట్రం మనదే. సత్ఫలితాలిస్తున్న సంస్కరణలు.. ► ఇంటర్ పాసై పై చదువులకు దూరమైన విద్యార్థుల సంఖ్య 2018–19లో 81,813 కాగా.. జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా దీవెన, వసతి దీవెన కారణంగా ఈ సంఖ్య 2022–23 నాటికి 22,387కు తగ్గింది. అంతేకాక.. 2022–23 నాటికి ఇంటర్ పాసై పై చదువులకు పోలేని విద్యార్థుల జాతీయ సగటు 27శాతం అయితే, మన రాష్ట్రంలో ఇది కేవలం 6.62 శాతం మాత్రమే. ► 2018–19లో 32.4గా ఉన్న స్థూల నమోదు నిష్పత్తి 2020–21 నాటికి 94కు పెరిగింది. ► అలాగే, 2018–19లో 37,000గా ఉన్న క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ 2021–22 నాటికి 85,000కు పెరిగాయి. ఇక ఈ ఏడాది ఇప్పటికే 80వేల మందికి ప్లేస్‌మెంట్స్ వచ్చాయి. ఆగస్టు ముగిసేనాటికి ఇది మరింతగా పెరిగే అవకాశముంది. డిజిటల్ విద్య దిశగా అడుగులు.. ► మరోవైపు.. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌లు.. నాడు–నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ధి చేసిన పాఠశాలల్లో 6వ తరగతి పైన ప్రతి క్లాస్‌రూమ్‌లో ఉండేలా 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, 10,038.. ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు ప్రవేశపెట్టింది. అసలు, ప్రభుత్వ బడులు కార్పొరేట్ బడులతో పోటీపడటం కాదు.. కార్పొరేట్ బడులే ప్రభుత్వ బడులతో పోటీపడాలి అన్న లక్ష్యంతో జగనన్న ప్రభుత్వం విద్యావ్యవస్థలో ఈ తరహా విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టింది. -
చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన కూలీ బిడ్డ..
హుజూర్నగర్/మంచిర్యాల అర్బన్/సాక్షి, హైదరాబాద్: రెక్కాడితే గానీ కడుపునిండని పేదరికం. అయినా వారి చదువుకు పేదరికం అడ్డుకాలేదు. కష్టాలను దిగమింగి మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఇంటరీ్మడియట్ పరీక్షల్లో సత్తా చాటారు. సంపదకు, సరస్వతీ కటాక్షానికి సంబంధం లేదని నిరూపించారు. ప్రభుత్వ కాలేజీలో చదివి ప్రతిభాపాటవాలను కనబర్చిన ఈ విద్యార్థులను పలువురు అభినందించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిరుపేద కుటుంబానికి చెందిన సీఎస్వీ వైష్ణవిదేవి ఎంపీసీలో 1000 మార్కులకు 991 మార్కులు సాధించి ఔరా అనిపించింది. వైష్ణవి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివింది. వైష్ణవి తండ్రి సీఎస్ సురేంద్ర కుమార్ పెయింటర్ కాగా, తల్లి రాజమణి గృహిణి. ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమని ఆమె చెప్పింది. కూలీ బిడ్డ... మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా క్రిష్ణాకాలనీలో ఓ చిన్న గదిలో ఆకుల లక్ష్మీ.. కుతూరు శిరీష, కుమారుడు శివసాయికుమార్‌తో కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. శిరీష మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్‌లో మల్టీ పర్పస్‌హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ) కోర్సులో చేరింది. ఇంకోవైపు బ్రిడ్జి కోర్సు బైపీసీ కూడా చదువుతుంది. ఇంటర్ ఫలితాల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూలో 500 మార్కులకుగాను 495 సాధించింది. బైపీసీ తర్వాత బీకాం చేసి సీఏ కావాలన్నదే లక్ష్యమని శిరీష తెలిపింది. అత్యధికం 994! ఇంటర్లో 994 మార్కులు టాప్‌ర్యాంక్‌గా నమోదైనట్టు తెలిసింది. బాన్సువాడకు చెందిన అక్రమహబీన్ అనే విద్యార్థిని 994 మార్కులు సాధించింది. ఎంపీసీలో వరంగల్‌కు చెందిన పూజా, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోల్‌కు చెందిన పి.రాజేశ్ కూడా 994 మార్కులు సాధించాడు. వీరు ప్రైవేటు కాలేజీల్లో చదివారు. ఈసారి ఇంటర్ బోర్డ్ కేవలం ప్రభుత్వ కాలేజీల్లో అత్యధిక మార్కులు సాధించిన టాపర్ల జాబితాను మాత్రమే విడుదల చేసింది. ప్రైవేటు కాలేజీలతో కలుపుకుని రాష్ట్రంలో టాపర్లు ఎవరన్నది ప్రకటించలేదు. ► నిజామాబాద్‌కు చెందిన ఆరెపల్లి దీక్షిత ఎంపీసీలో 992 మార్కులు సాధించింది. ఆమె తల్లిదండ్రులు రమేశ్, భాగ్య ముంబైలో రజక వృత్తిలో ఉండగా, దీక్షిత స్థానికంగా బంధువుల వద్ద ఉంటూ చదుకుంటోంది. ► జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పాటిల్ వర్ష (బైపీసీ), సీహెచ్ రష్మిత (ఎంపీసీ) 992 మార్కులు సాధించారు. ► ఖమ్మంలోని ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ చదువుతున్న తప్పేట రోహిణి 990 మార్కులు సాధించింది. ► సత్తుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ ద్వితీయ సంవత్సరం హెచ్ఈసీ విద్యారి్థని దాసరి సిరి వెయ్యి మార్కులకు గాను 972 మార్కులు సాధించింది. ఆమె తండ్రి దాసరి ధర్మయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తల్లి స్వప్న గృహిణి. ► నిర్మల్ జిల్లా భైంసా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉర్దూ మీడియం విద్యారి్థనులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. సెకండియర్ ఎంపీసీలో జవేరియా ఫిర్దోస్ నబా 990/1000 మార్కులు సాధించగా, ఫస్టియర్‌కు చెందిన అదీబానాజ్ 462/470 మార్కులు సాధించింది. చదవండి: అమ్మాయిలదే హవా -
హాస్టల్ విద్యార్థులకు శుభవార్త
సాక్షి, భీమవరం: రాష్ట్రంలో విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల్లో చదువుకునే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు అండగా నిలుస్తోంది. తాజాగా హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఇచ్చే డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంపుదల చేస్తూ జీఓలను విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 1 నుంచి పెంచిన చార్జీలు అమలులోకి వస్తాయి. ఇందుకోసం అదనంగా డైట్ చార్జీలకు రూ.132 కోట్లు, కాస్మోటిక్ చార్జీలకు రూ.48 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, తదితర సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం 2012లో మెస్ చార్జీలను పెంచింది. గత ఎన్నికలకు ముందు (2018) టీడీపీ ప్రభుత్వం హడావుడిగా నామమాత్రంగా డైట్ చార్జీలను పెంచినా అవి అమల్లోకి రాలేదు. నాటి నుంచి ఇప్పటివరకూ హాస్టల్ విద్యార్థులకు పాత చార్జీలనే అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. 67 హాస్టళ్లు.. 2,500 మంది విద్యార్థులు జిల్లాలో 38 ఎస్సీ, 29 బీసీ హాస్టళ్లలో సుమారు 2,500 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఎస్సీ హాస్టళ్లలో 1,251 మంది, బీసీ హాస్టళ్లలో 1,321 మంది ఉన్నారు. వీరందరికీ చార్జీల పెంపు వల్ల ప్రయోజనం కలుగుతుంది. అలాగే హాస్టళ్లలో చేరేందుకు పేద విద్యార్థులు మరింత ఆసక్తి చూపుతారని అధికారులు అంటున్నారు. పేదల చదువులకు అన్నివిధాలా అండగా ఉంటున్న సీఎం జగన్‌కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది హాస్టళ్లలో విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలను ప్రభుత్వం పెంచడం ద్వారా రానున్న విద్యాసంవత్సరం నుంచి వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం పెంచిన చార్జీలు వచ్చే జూన్ నుంచి అమలులోకి రానున్నాయి. –జీవీఆర్‌కేఎస్‌ఎస్ గణపతిరావు, జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారి, భీమవరం -
పేద పిల్లలకు ట్యాబ్‌లిస్తే భరించలేరా? ‘ఈనాడుకు ఎందుకీ కడుపుమంటా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు అందిస్తున్న ట్యాబ్‌లపై ‘ఈనాడు’, తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారంపై పాఠశాల విద్యాశాఖ తీవ్రంగా మండిపడింది. పేద పిల్లలకు కార్పొరేట్ పాఠశాలలతో సమానంగా సాంకేతిక విద్యను ట్యాబ్‌ల ద్వారా అందిస్తుంటే భరించలేక అవి అడ్డుకుంటున్నాయని ఆక్షేపించింది. వాళ్లు సాంకేతిక విద్య ద్వారా రాణిస్తే మీకు కడుపుమంటా అని ప్రశ్నించింది. వాస్తవాలను కప్పిపుచ్చి అసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు రాయడం, ఆరోపణలు చేయడాన్ని ఖండించింది. పనికిమాలిన తప్పుడు అంశాలతో దుష్ప్రచారం చేస్తున్నారంటూ వాస్తవాలు ఏమిటో ప్రజల ముందుంచింది. విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్‌లకు సంబంధించి ‘8.7 అంగుళాల తెరపై వివాదాలు’ అంటూ ‘ఈనాడు’లో వచ్చిన కథనం, ‘సీఎం జగన్‌కు రూ.221 కోట్ల కానుక’ అంటూ తెలుగుదేశం చేసిన ఆరోపణలను కొట్టిపారేసింది. అంతేకాక.. టెండర్ల ప్రక్రియలో ఎవరైనా పాల్గొనే అవకాశమున్నప్పటికీ మీరెందుకు పాల్గొనలేదని విద్యాశాఖ వాటిని సూటిగా ప్రశ్నించింది. నిజానికి.. ప్రభుత్వం ఇస్తున్న ట్యాబ్‌లకు మూడేళ్ల వారంటీతోపాటు పలు ఫీచర్లు ఉన్నాయని తెలిపింది. అలాగే, టెండర్లలో శాంసంగ్ పాల్గొని ఎల్–1గా నిలిచింది కాబట్టి టెండర్‌ను ఆ సంస్థకు అప్పగించామని స్పష్టంచేసింది. ఇక వచ్చే ఏడాది కూడా ఐదు లక్షలకు పైగా ట్యాబ్‌లు అవసరమవుతాయని.. ఇవే స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఉన్న ట్యాబ్‌లను మూడేళ్ల వారంటీతో రూ.12వేలకు ఈనాడు, తెలుగుదేశం పార్టీలు ఇస్తే కాంట్రాక్టును వారికే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యాశాఖ సవాల్ చేసింది. రివర్స్ టెండరింగ్‌తో రూ.187 కోట్లు ఆదా ఇక ట్యాబ్‌లకు నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో నాలుగు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పాల్గొన్నాయి. రివర్స్ టెండరింగ్‌తో ప్రభుత్వం రూ.187 కోట్లు ఆదా చేసింది. నిజానికి.. ప్రభుత్వం కొనుగోలు చేసిన ట్యాబ్‌లలోని స్పెసిఫికేషన్లు, అదనపు సదుపాయాలు అమెజాన్ లాంటి సంస్థలు అందించే ట్యాబ్‌లలో లేవు. రూ.12,843 ధరతో ప్రభుత్వం కొనుగోలు చేసిన ఈ ట్యాబ్‌లలోని స్పెసిఫికేషన్లు, అదనపు సదుపాయాలతో అమెజాన్ లాంటి సంస్థలు ఇచ్చే ట్యాబ్ ధర రూ.3,603 ఎక్కువగా (22 శాతం) ఉంది. అలాగే, ప్రభుత్వం కొనుగోలు చేసిన ధరలోనే మండల పాయింట్ల వరకు వాటిని చేర్చేందుకు అయ్యే ఖర్చు కూడా కలిపి ఉంది. ఆరోపణ–1: 8వ తరగతి విద్యార్థులకు అందించిన పీసీ ట్యాబ్ ఖరీదు రూ.11,999. ఆన్లైన్లో ఇదే పరికరాన్ని బల్క్‌గా కొనుగోలుచేస్తే రూ.9వేలే. ఈ లెక్కన ట్యాబ్‌ల పంపిణీలో రూ.221 కోట్లు స్వాహా చేశారు. వాస్తవం ఇదీ: ఈ ఆరోపణ నిజం కాదు. ఆన్లైన్ పోర్టళ్లు కూడా బల్క్‌లో నేరుగా ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్ (ఓఈఎం) నుంచి కొనుగోలుచేసి తక్కువ మార్జిన్‌కు అమ్ముతుంటాయి. అందువల్ల ఆన్లైన్ ధరలు తక్కువగా ఉంటాయనడం నిజంకాదు. అంతేకాక.. రాష్ట్ర ప్రభుత్వం ఈ పీసీ ట్యాబ్‌లను అదనపు ఫీచర్లు ఇతర ఐటెమ్‌లతో కలిపి కొనుగోలు చేసింది. ఇవేవీ ఆన్లైన్ కొనుగోళ్లలో కవర్ కావు. ఆయా వస్తువులు మార్కెట్ ధరకన్నా ఎంతో తక్కువకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ వివరాలు.. ఆరోపణ–2: ట్యాబ్ డిస్ప్లే సైజు శ్యామ్‌సంగ్ కంపెనీకి తగ్గట్లుగా 8.7 అంగుళాల సైజును టెండర్లలో పెట్టారు. 8 అంగుళాలు ఆపైన డిస్ప్లే సైజు ఉండాలనేలా నిబంధనను మార్పు చేయాలని ఇతర కంపెనీలు కోరినా పట్టించుకోలేదు. వారిని పోటీ నుంచి తప్పించేందుకే ఇలా చేశారు. వాస్తవం ఇదీ: ఈ ఆరోపణ కూడా నిజం కాదు. టెండర్ డాక్యుమెంటు పత్రాల్లో స్పెసిఫికేషన్లలో డిస్ప్లే సైజు 8.7 అంగుళాలు లేదా ఆపై, 1,280 800 రిజల్యూషన్‌లో, టచ్‌స్క్రీన్ ఉండాలని పేర్కొన్నారు. ఏ ట్యాబ్ అయినా 8.7 అంగుళాల స్క్రీన్‌సైజు లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నవి ఆమోదయోగ్యమని స్పష్టంగా ఉంది. ఒరిజినల్ ఎక్విప్మెంటు మాన్యుఫాక్చరర్ల నుంచి 10 అంగుళాల పీసీ ట్యాబ్‌కు కూడా బిడ్లు స్వీకరించారు. బిడ్ల ఇవాల్యుయేషన్‌లో టెండర్ కండిషన్లను అనుసరించి ఉన్న వాటిని ఆమోదించారు.. అని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది. -
పేద విద్యార్థులకు డిజిటల్ విద్య
-
మదనపల్లె: జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల
సాక్షి, అమరావతి: జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు జూలై–సెప్టెంబర్ త్రైమాసికం నిధులను సీఎం వైఎస్ జగన్ బుధవారం విడుదల చేయనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేస్తారు. దీనివల్ల మొత్తం 11.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. మొత్తం మీద ఇప్పటివరకు ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద రూ.12,401 కోట్లు విడుదల చేసింది. ఆర్థికస్తోమత లేక ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదని జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును అమలు చేస్తోంది. తల్లిదండ్రులపై భారం పడకుండా కాలేజీలకు ఎంత మొత్తం ఫీజు ఉన్నా ఆ మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తోంది. ఈ ఫీజులను ప్రతి త్రైమాసికం క్యాలెండర్ ప్రకారం విడుదల చేయడంతో కాలేజీల యాజమాన్యాలకూ ప్రయోజనం చేకూరుతోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పులపాలైన తల్లిదండ్రులు.. గత ప్రభుత్వం హయాంలో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేయలేదు. కాలేజీల్లో ఫీజు రూ.లక్షల్లో ఉన్నా కేవలం రూ.35,000 మాత్రమే ఇచ్చి అప్పటి టీడీపీ ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది. పైగా ఆ అరకొర మొత్తాన్ని కూడా సకాలంలో చెల్లించేది కాదు. దీంతో తల్లిదండ్రులు అప్పుల పాలయ్యారు. అనేకమంది విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇలా గత ప్రభుత్వం 2017 నుంచి పెట్టిన బకాయిలు దాదాపు రూ.1,778 కోట్లతో కలిపి జగనన్న విద్యా దీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ. 3,349 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది. ఈ నిధులతో కలిపి ఇప్పటివరకు ఈ రెండు పథకాల కింద రూ.12,401 కోట్లు సాయమందించింది. ఇంత పెద్దమొత్తంలో పేద విద్యార్థుల చదువుల కోసం వెచ్చించిన మరో ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేకపోవడం గమనార్హం. పేద విద్యార్థులు ఉన్నత చదువులు నిరాటంకంగా అభ్యసించేందుకు ఎలాంటి పరిమితులు విధించకుండా ఈ పథకాలను అందిస్తుండటం విశేషం. ఎప్పటి నిధులు అప్పుడే జమ.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నారు. పేద విద్యార్థులు భోజనం, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా జగనన్న వసతి దీవెన పథకం కింద ఏటా 2 వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించేవారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. -
గురుభ్యోనమః.. నిరుపేద విద్యార్థుల కోసం షూ పాలీష్ చేస్తున్న ప్రొఫెసర్
తిరువళ్లూరు (చెన్నై): పేద, నిరాశ్రయ విద్యార్థుల చదువు కోసం నిధుల సేకరణలో భాగంగా తమిళ ప్రొఫెసర్ సెల్వకుమార్ పళవేర్కాడులో చెప్పులు, షూలకు పాలీష్ చేసి నిధులను సేకరించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పాడియనల్లూరుకు చెందిన ప్రొఫెసర్ సెల్వకుమార్. అదే ప్రాంతంలో ఓ ప్రైవేటు కళాశాలలో తమిళ్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. 2004లో మదర్ థెరిసా పాఠశాలను ఏర్పాటు చేసి 19 ఏళ్లుగా పేద, అనాథ విద్యార్థులకు విద్యను అందిస్తున్నాడు. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో పాఠశాల నిర్వాహణ కష్టంగా మారడంతో వినూత్న రీతిలో నిధులను సేకరిస్తున్నాడు. కళాశాలకు సెలవు ఉన్న సమయంలో ప్రముఖ ప్రాంతాలకు వెళ్లి.. నేను మీ చెప్పులను తుడుస్తా. మీరు నావద్ద ఉన్న పిల్లల కన్నీటిని తుడవాలని కోరుతున్నారు. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చెప్పులు తుడవడం, షూలకు పాలీష్ చేసి తద్వారా వచ్చే నిధులను పాఠశాల నిర్వహణ కోసం ఉపయోగిస్తున్నాడు. ఇతడి ప్రయాణం ఇప్పటికే తమిళనాడు, ఆంధ్ర, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో సాగింది. తాజాగా తిరువళ్లూరు జిల్లా పళవేర్కాడులోని కామరాజర్, అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం చెప్పులు తుడవడం, షూలకు పాలీష్ చేసి నిధులను సేకరించారు. కోటైకుప్పం పంచాయతీ అధ్యక్షుడు సంపత్, మీంజూరు ధామోదరన్, పళవేర్కాడు సంజయ్‌గాంధీ సాయం అందించారు. -
Jagananna Vidya Deevena: విద్యార్థులకు రూ.11,715 కోట్ల లబ్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేద కుటుంబాల్లోని విద్యార్థులంతా ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉన్నత చదువులు అభ్యసించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును అమలు చేస్తూ ప్రవేశపెట్టిన జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థులకు రూ.11,715 కోట్లు అందించింది. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులకు అండగా నిలుస్తోంది. కాలేజీలకు వారు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. విద్యార్థులకు వసతి, భోజన ఖర్చుల కోసం అదనంగా రూ.20 వేల వరకు ప్రభుత్వం ఇస్తోంది. ఈ నేపథ్యంలో 2022 ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రూ.694 కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. బాపట్లలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్లో బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు. తద్వారా 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. -
ప్రైవేట్ స్కూళ్లలో పేదల పిల్లలకు 25 % సీట్లు
సాక్షి, అమరావతి: పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం సీట్లలో ప్రవేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేయనుంది. ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి 25 శాతం సీట్లను పేద వర్గాల పిల్లలతో భర్తీ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ, అనాధ, దివ్యాంగ, హెచ్ఐవీ బాధిత పిల్లలకు రిజర్వేషన్ల వారీగా సీట్ల కేటాయింపు చేపడతారు. ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ మైనారిటీ, ఓసీలకు 6 శాతం, అనాథ, దివ్యాంగ, హెచ్ఐవీ బాధిత పిల్లలకు 5 శాతం సీట్లు కేటాయించనున్నారు. ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షికాదాయం రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.40 లక్షలు ప్రాతిపదికగా నిర్ణయించారు. ఉచిత నిర్బంధ విద్యకు సంబంధించి బాలల హక్కుల చట్టం–2009 జీవో 20ని సవరిస్తూ జీవో 129లో సవివర మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నారు. మిగిలిపోయిన సీట్లలో ప్రవేశాల కోసం రెండో జాబితా విడుదల చేయనున్నారు. 16 నుంచి దరఖాస్తు ప్రక్రియ 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లలో పేద విద్యార్థులకు ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ఈనెల 16వ తేదీనుంచి ప్రారంభం అవుతుందని కమిషనర్ తెలిపారు. ఆగస్టు 26వ తేదీ వరకు http://cse.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 1వ తరగతిలో ప్రవేశాలు, జీవో సవరణ వివరాలను వెబ్సైట్లో పొందుపరిచినట్లు వివరించారు. -
పేదల చదువుకు చంద్రబాబే అడ్డంకి
సాక్షి, అమరావతి: పేద విద్యార్థుల చదువుకు చంద్రబాబే ప్రధాన అడ్డంకి అని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తూ.. ప్రభుత్వ స్కూళ్లను చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం జగన్ కృషి చేస్తుంటే.. చంద్రబాబు, టీడీపీ నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి మీడియాతో మాట్లాడారు. ధనవంతులకే సొంతమైన ‘ఎడ్యు టెక్’ను ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకూ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బైజూస్‌తో ఒప్పందం చేసుకుందన్నారు. ఇది విద్యలో ఒక గేమ్ చేంజర్ అని.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గొప్ప అవకాశమన్నారు. ఒక్కో విద్యార్థి బైజూస్ కంటెంట్‌ను కొనాలంటే రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చవుతుందని చెప్పారు. అలాంటిది సీఎం జగన్ చొరవ వల్ల ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఉచితంగా తమ కంటెంట్ అందించేందుకు బైజూస్ సీఈవో రవీంద్రన్ ముందుకు వచ్చారన్నారు. నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడంలో ప్రపంచవ్యాప్తంగా బైజూస్‌కు మంచి పేరుందన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం వద్దన్న చంద్రబాబు.. ఇప్పుడు బైజూస్ పైనా తన అక్కసును వెళ్లగక్కుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ‘జూస్’ అంటూ అవహేళన చేస్తున్నారన్నారు. నారాయణ, చైతన్య తదితర కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. -
కార్పొరేట్ స్కూళ్లలోనూ 'కోటా'
సాక్షి, అమరావతి: పేద విద్యార్ధులకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించేలా చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 2022 – 23 విద్యాసంవత్సరం నుంచి దీన్ని పక్కాగా అమలు చేసేలా పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ రూపొందించింది. తద్వారా వీటిల్లో ఏటా లక్ష సీట్లు పేద విద్యార్ధులకు అందుబాటులోకి రానున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం పేద పిల్లలందరికీ కార్పొరేట్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పించేలా ‘ఇండస్ యాక్షన్’ అనే సంస్థతో పాఠశాల విద్యాశాఖ ఎంవోయూ కూడా కుదుర్చుకుంది. గవర్నెన్స్, టెక్నాలజీ సపోర్టు తదితర అంశాల్లో సంస్థ ప్రభుత్వానికి సహకారం అందించనుంది. ఈ సంస్థ ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఆర్టీఈ చట్టం అమలుకు తోడ్పాటునిచ్చి లక్షల మంది పేద విద్యార్ధులకు మేలు చేకూర్చింది. ఆర్టీఈపై న్యాయ వివాదాలు.. దేశంలో 6 నుంచి 14 ఏళ్ల వయసు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యకోసం కేంద్ర ప్రభుత్వం 2009లో జాతీయ విద్యాహక్కు చట్టాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టంలోని సెక్షన్ 12 (1సి) ప్రకారం ప్రైవేట్, అన్ ఎయిడెడ్, నాన్ మైనారిటీ, గుర్తింపు పొందిన ప్రతి పాఠశాల యాజమాన్యాలు నర్సరీ, ఎల్కేజీ, లేదా ఒకటో తరగతి నుంచి సామాజికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లను కేటాయించాలి. చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించి దశాబ్దం దాటినా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమలవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2010లోనే ఆర్టీఈ చట్టాన్ని నోటిఫై చేసినా విధానపరమైన కారణాలతో పాటు కోర్టు స్టే ఉత్తర్వుల కారణంగా పేద విద్యార్ధులకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25 శాతం కోటా అమలుకు నోచుకోలేదు. సీఎం ఆదేశాలతో కోటాపై కదలిక వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీఈ చట్టం అమలుపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద పిల్లలకు 25 శాతం కోటా ప్రకారం సీట్లు కేటాయించేలా చర్యలు చేపట్టారు. వరుసగా రెండేళ్లు కరోనా కారణంగా పాఠశాలలు మూతబడిన నేపథ్యంలో కొంత జాప్యం జరిగింది. తాజాగా ఈ ఏడాది నుంచి కోటా అమలుకు సన్నద్ధమైంది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని, త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ తెలిపారు. ఫీజులపై నిర్ణయానికి కమిటీ అందరికీ సమాన విద్యావకాశాలు కల్పించేందుకు 25 శాతం కోటా తోడ్పడనుంది. ఆర్థిక స్థోమత లేక కార్పొరేట్ స్కూళ్లలో విద్యను పేద విద్యార్థులు అందుకోలేకపోతున్నారు. ఆర్టీఈ చట్టాన్ని అమలు చేయడం ద్వారా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో 25 శాతం కోటా కింద సీట్లను కేటాయించి ఫీజులను ప్రభుత్వమే యాజమాన్యాలకు చెల్లిస్తుంది. స్కూళ్లు, తరగతుల వారీగా చెల్లించాల్సిన ఫీజులపై పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే కమిటీని నియమించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆయా తరగతుల నిర్వహణకు అయ్యే వ్యయాన్ని అనుసరించి ప్రైవేట్ స్కూళ్లకు ఫీజులను చెల్లించనున్నారు. ఏటా లక్ష మందికి అవకాశం ఆర్టీఈ చట్టం ప్రకారం 25 శాతం కోటా అమలుతో రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో దాదాపు లక్ష సీట్లు పేద పిల్లలకు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాది లెక్కల ప్రకారం 9,500 స్కూళ్లలో 35 వేల సీట్లు ఈ విద్యాసంవత్సరంలో పేద పిల్లలకు అందనున్నాయి. -
Scholarships: విద్యార్థులకు అలర్ట్.. ఇది మీ కోసమే..
సాక్షి, అమరావతి: చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విద్యాధాన్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇన్ఫోసిస్ కో–ఫౌండర్ ఎస్డీ శిబులాల్, కుమారి శిబులాల్ సామాజిక బాధ్యతలో భాగంగా సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ ద్వారా ఈ స్కాలర్షిప్లను 15 రాష్ట్రాల్లో అందజేస్తున్నారు. చదవండి: చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. వార్షికాదాయం రూ.రెండు లక్షల్లోపు ఉండి 2022 విద్యా సంవత్సరంలో పదో తరగతి 90 శాతం లేదా 9 సీజీపీఏ మార్కులు సాధించిన విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుకు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థి ప్రతిభ ఆధారంగా వారు ఎంచుకున్న చదువుల నిమిత్తం రూ.10,000 నుంచి రూ.60,000 వరకు స్కాలర్షిప్లను ఇవ్వనున్నట్లు విద్యాధాన్ పేర్కొంది. జూన్ 7 నుంచి జూలై 10 వరకు విద్యార్థులు నేరుగా ఆన్లైన్ ద్వారా ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం www. vidyadhan.org అనే వెబ్సైట్ లేదా 8367751309 నంబర్లో సంప్రదించవచ్చు. -
పేద విద్యార్థులపై ట్రోల్స్ చేస్తే తాట తీస్తాం
గుడివాడ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ గుక్క తిప్పుకోకుండా ఇంగ్లిష్ మాట్లాడుతున్న బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై సోషల్ మీడియాలో ట్రోల్స్ పెడుతున్న వారి తాటతీస్తామని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) హెచ్చరించారు. కృష్ణా జిల్లా గుడివాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులు చక్కగా చదువుకుంటూ విదేశీ భాష అయిన ఇంగ్లిష్‌ని సైతం అనర్గళంగా మాట్లాడుతున్నారని చెప్పారు. అందరికీ ఆదర్శంగా నిలవడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థులను స్వయంగా సీఎం కార్యాలయానికి రప్పించి అభినందించారని వివరించారు. అందరూ వీరిని ఆదర్శంగా తీసుకుని చక్కగా చదువుకోవాలని సీఎం పిలుపునిచ్చారని గుర్తుచేశారు. అటువంటి విద్యార్థులపై కొంతమంది ఇటీవల విడుదల అయిన పదో తరగతి ఫలితాల ఆధారంగా విమర్శిస్తూ పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేస్తున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరుపేద విద్యార్థులు అంటే అంత అలుసా అని ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. ట్రోల్స్ పెట్టే వారి తాట తీస్తామని హెచ్చరించారు. దమ్ము ధైర్యం ఉంటే మాతో పోరాడండి, పేదవాళ్ల మీద జోకులు వేస్తూ అవహేళనగా ప్రవర్తిస్తే అడిగే వాళ్లు లేరనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిదని లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. -
నాడు–నేడుతో విద్యావ్యవస్థలో మహాయజ్ఞం
మంగళగిరి: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యావ్యవస్థలో నాడు–నేడుతో మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళగిరి– తెనాలి రోడ్డులోని ఆత్మకూరు వద్ద అక్షయపాత్ర ఫాండేషన్‌కు దాతలు అందజేసిన మధ్యాహ్న భోజన రవాణా వాహనాలను గురువారం ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, జంగా కృష్ణమూర్తితో కలిసి ఆయన ప్రారంభించారు. వంటశాలను భోజనం తయారీ నాణ్యతను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన పోషకాహారాన్ని అందించేందుకు జగనన్న గోరుముద్ద పథకంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించడంలో అక్షయపాత్ర అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ వైస్‌ప్రెసిడెంట్ వంశీధరదాసు మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో అక్షయపాత్రకు ప్రభుత్వంతో పాటు దాతలు అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమన్నారు. దాతలు ఫ్రీడమ్ ఆయిల్, హెచ్‌పీ గ్యాస్, గ్లాండ్ ఫార్మా లిమిటెడ్, యూనియన్ బ్యాంక్ సహకారంతో వాహనాలను అందించారు. అక్షయపాత్ర కో–ఆర్డినేటర్ విలాస విగ్రహదాస, ఐటీ చైర్మన్ చల్లా మధుసూధనరెడ్డి, అగవతరప్పాడు సర్పంచ్ మురళీకృష్ణారెడ్డి అక్షయపాత్ర సిబ్బంది, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.