మీరు మారుతి రిట్జ్ ఓనరా?అయితే..
న్యూఢిల్లీ : దేశంలో అతి పెద్ద కార్ మేకర్ మారుతీ సుజుకి కీలక నిర్ణయం తీసుకుంది. పాపులర్ హ్యాచ్‌బ్యాక్ మోడల్ ‘రిట్జ్’ అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఇక రిట్జ్ కార్లను విక్రయించబోమని తెలిపింది. అయితే రాబోయే పదేళ్ల వరకు దీని విడి భాగాలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయని మారుతి సుజుకి ప్రతినిధి హామీ ఇచ్చారు. తమ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలో మార్పులు తీసుకొస్తున్న నేపథ్యంలో రిట్జ్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు తెలిపారు. తమ సక్సెస్ఫుల్ మోడల్స్ లో రిట్జ్ కూడా ఒకటని పేర్కొన్న ఆయన తమ ఉత్పత్తులను ఎప్పటికపుడు సమీక్షించి కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు.
కాంపాక్ట్ విభాగంలో కొత్త మోడల్ ఇగ్నిస్+తో పాటు స్విఫ్ట్, సెలిరియో, డిజైర్, బెలెనొ వంటి కార్లను విక్రయిస్తున్న మారుతీ సుజుకి, అమ్మకాల్లో 25.2 శాతం పెరుగుదల కనిపించిందని కంపెనీ ప్రతినిధి ప్రకటించారు. గత ఏడాది జనవరిలో 44,575 కార్లను విక్రయించగా, ఈ ఏడాది అదే నెలలో 55,817 కార్లు అమ్ముడయ్యాయన్నారు.
కాగా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో 2009 లోలాంచ్ చేసిన రిట్జ్ కారు మొత్తం 4 లక్షల యూనిట్లను విక్రయించింది. తమ హ్యాచ్‌బ్యాక్ ప్రొడక్షన్ రిట్జ్ కు ముగింపు పలకనున్నట్టు గత ఏడాది నవంబర్ లో ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లోకి అత్యంత ఆదరణ పొందిన ఈ హ్యాచ్‌బ్యాక్‌కు అప్డేట్స్ చేయకపోవడం ద్వారా రానురాను అమ్మకాలు తగ్గిపోవడతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు తక్కువ డిమాండ్ కారణంగా 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ ప్రీమియర్ క్రాస్ఓవర్ ఎస్-క్రాస్ అమ్మకాలను ఈ మార్కెట్ లీడర్ నిలిపివేసిన సంగతి తెలిసిందే.