popularity
-
బిజినెస్ సైకిల్ ఫండ్స్ భేష్..
న్యూఢిల్లీ: పెట్టుబడుల ప్రపంచంలో బిజినెస్ సైకిల్ మ్యూచువల్ ఫండ్స్‌కి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. విస్తృత మార్కెట్‌తో పోలిస్తే ఇవి మెరుగ్గా రాబడులు అందిస్తుండటం ఇందుకు కారణం. గత ఏడాది వ్యవధిలో ఈ ఫండ్స్ 56 శాతం వరకు రాబడులు ఇచ్చినట్లు పరిశ్రమ గణాంకాల్లో వెల్లడైంది. వీటి ప్రకారం హెచ్ఎస్బీసీ, మహీంద్రా మాన్యులైఫ్, క్వాంట్ మొదలైన ఫండ్ హౌస్‌ల స్కీములు 50 శాతం పైగా రాబడులు అందించాయి. ఇదే వ్యవధిలో నిఫ్టీ 500 టీఆర్ఐ సూచీ 35.11 శాతం రాబడులు అందించింది. ఈ నేపథ్యంలో బిజినెస్ సైకిల్ ఫండ్స్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతోందని ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ తెలిపారు. నిర్దిష్ట ఆర్థిక, మార్కెట్ పరిస్థితుల్లో రాణించే రంగాలకు చెందిన స్టాక్స్‌ని గుర్తించి, ఇన్వెస్ట్ చేసేందుకు బిజినెస్ సైకిల్ ఫండ్స్ ప్రయతి్నస్తాయి. ఆర్థిక వ్యవస్థలో మాంద్యం, రికవరీ తొలినాళ్లు, వృద్ధి మధ్య దశ, చివరి దశ వంటి పరిస్థితులను బట్టి వివిధ రంగాల్లో పెట్టుబడులను మారుస్తుంటాయి. ఉదాహరణకు మాంద్యం దశలో యుటిలిటీస్, ఫార్మా వంటి డిఫెన్సివ్ రంగాలు మెరుగ్గా రాణించగలవు. అయితే వృద్ధి ప్రారంభమయ్యే తొలినాళ్లలో ఆటోమొబైల్స్, ఫైనాన్షియల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాలకు చెందిన స్టాక్స్ లాభపడే అవకాశాలు ఉంటాయి. ఇలా వ్యూహాత్మకంగా వివిధ రంగాల్లో పెట్టుబడులను అటూ–ఇటూ మారుస్తుండటమనేది ఇన్వెస్టర్లకు లాభాలను పంచుతోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్వల్ప సమయంలో అధిక రాబడులు అందిస్తుండటంతో బిజినెస్ సైకిల్ ఫండ్స్‌పై ఆసక్తి పెరుగుతోందని ఎప్సిలాన్ గ్రూప్‌లో భాగమైన మల్టీ ఆర్క్ వెల్త్ ఏవీపీ సిద్ధార్థ్ ఆలోక్ తెలిపారు. పరిస్థితులను బట్టి వివిధ సెక్టోరల్ ఫండ్స్‌కి మారేందుకు, ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్లను పట్టుకునేందుకు వ్యక్తిగతంగా పరిశోధిస్తూ, అవకాశాల కోసం ఎదురుచూస్తూ కూర్చునే భారాన్ని ఈ ఫండ్స్ తగ్గిస్తాయని విస్డమ్ ఎడ్జ్ ఇన్వెస్ట్మెంట్స్ వ్యవస్థాపకుడు భావేష్ దమానియా తెలిపారు. అయితే, సాధారణంగా థీమ్యాటిక్ ఫండ్స్ పనితీరును లెక్కగట్టేందుకు కనీసం అయిదేళ్ల పాటైనా కార్యకలాపాలు ఉండాలని, ఇవన్నీ ఈ మధ్యే వచ్చాయి కాబట్టి ఇటీవలి కాలంలో పనితీరుపైనే ఆధారపడటం సరికాకపోవచ్చని ఆయన పేర్కొన్నారు.16 ఫండ్స్..ప్రస్తుతం దేశీయంగా 16 బిజినెస్ సైకిల్ ఫండ్స్ ఉండగా, 10 ఫండ్స్‌కి ఏడాది పైగా ట్రాక్ రికార్డు ఉంది. వీటిలో ఒక్కటి మినహా మిగతా అన్నీ కూడా గత 12 నెలల్లో నిఫ్టీ 500 టీఆర్ఐకి మించిన రాబడులు అందించాయి. పరిశ్రమ డేటా ప్రకారం 10 ఫండ్స్ సగటున 42 శాతం రాబడి అందించాయి. గత ఏడాది వ్యవధిలో అక్టోబర్ 17 వరకు.. హెచ్ఎస్బీసీ బిజినెస్ సైకిల్స్ ఫండ్ 56.3 శాతం, మహీంద్రా మాన్యులైఫ్ బిజినెస్ సైకిల్ ఫండ్ 56.17 శాతం, క్వాంట్ బిజినెస్ సైకిల్ ఫండ్ 50.8 శాతం రాబడులు అందించాయి.మరిన్ని విశేషాలు..అధిక రాబడులు అందించిన వాటిలో బరోడా బీఎన్పీ పారిబా బిజినెస్ సైకిల్ ఫండ్ (44.58 శాతం రాబడి), ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ (42.27 శాతం), టాటా బిజినెస్ సైకిల్ ఫండ్ (41.26 శాతం), కోటక్ బిజినెస్ సైకిల్ ఫండ్ (40.03 శాతం), యాక్సిస్ బిజినెస్ సైకిల్ ఫండ్ (39.02 శాతం), ఆదిత్య బిర్లా సన్ లైఫ్ బిజినెస్ సైకిల్ ఫండ్ (36.33 శాతం), హెచ్డీఎఫ్సీ బిజినెస్ సైకిల్ ఫండ్ (31.97 శాతం) ఉన్నాయి. →గత ఆరు నెలల వ్యవధిలో హెచ్ఎస్బీసీ బిజినెస్ సైకిల్స్ ఫండ్ 26.72 శాతం, మహీంద్రా మాన్యులైఫ్ బిజినెస్ సైకిల్ ఫండ్ 20.88 శాతం, క్వాంట్ బిజినెస్ సైకిల్ ఫండ్ 17.7 శాతం రిటర్న్‌లు ఇచ్చాయి. ఇదే వ్యవధిలో నిఫ్టీ 500 టీఆర్ఐ ఇండెక్స్ 15.2 శాతమే రాబడినిచి్చంది. మిగతా ఏడు ఫండ్స్ 13 శాతం నుంచి 23 శాతం వరకు రిటర్నులు ఇచ్చాయి. -
దేశీ విమాన ప్రయాణికుల్లో వృద్ధి
ముంబై: విమానయాన సేవలకు ఆదరణ కొనసాగుతోంది. మే నెలలో దేశీ విమాన ప్రయాణికుల్లో 4.4 శాతం వృద్ధి కనిపించింది. మొత్తం 1.37 కోట్ల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది మే నెలలో ప్రయాణికుల సంఖ్య 1.32 కోట్లుగా ఉంది. ఇక ఈ ఏడాది మే వరకు మొదటి ఐదు నెలల్లో 6.61 కోట్ల మంది ప్రయాణించారు. క్రితం ఏడాది ఇదే ఐదు నెలలో విమాన ప్రయాణికుల రద్దీ 6.36 కోట్లుగా ఉన్నట్టు (3.99 శాతం వృద్ధికి సమానం) పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) ప్రకటించింది. సకాలంలో విమాన సేవలను నిర్వహించడంలో ఆకాశ ఎయిర్ మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం మీద 85.9 శాతం మేర సకాలంలో సేవలు అందించింది. ఆ తర్వాత 81.9 శాతంతో విస్తారా, 74.9 శాతంతో ఏఐఎక్స్ కనెక్ట్ (ఎయిరేíÙయా), 72.8 శాతంతో ఇండిగో, 68.4 శాతంతో ఎయిర్ ఇండియా, 60.7 శాతంతో స్పైస్‌జెట్ వరుస స్థానాలో ఉన్నాయి. దేశీ మార్గాల్లో ఇండిగో మార్కెట్ వాటా 61.6 శాతానికి చేరింది. ఎయిర్ ఇండియా వాటా క్రితం నెలలో ఉన్న 14.2 శాతం నుంచి 13.7 శాతానికి క్షీణించింది. విస్తారా మార్కెట్ వాటా 9.2 శాతంగా ఉంది. ఏఐఎక్స్ కనెక్ట్ వాటా 5.4 శాతం నుంచి 5.1 శాతానికి పరిమితమైంది. ఎయిర్ ఇండియా, విస్తారా, ఏఐఎక్స్ కనెక్ట్ టాటా గ్రూపు సంస్థలే. ఆకాశ ఎయిర్ వాటా 4.4 శాతం నుంచి 4.8 శాతానికి పెరిగింది. స్పైస్‌జెట్ మార్కెట్ వాటా 4.7 శాతం నుంచి 4 శాతానికి క్షీణించింది. -
అత్యంత ప్రజాదరణ కలిగిన నేత మోదీ
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో ఘనత సాధించారు. అమెరికాకు చెందిన ‘మారి్నంగ్ కన్సల్ట్’ అనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ దాకా ఈ సర్వే నిర్వహించారు. దేశాధినేతలకు వారి సొంత దేశాల్లో ప్రజాదరణ ఏ స్థాయిలో ఉందో గుర్తించారు. ‘మారి్నంగ్ కన్సల్ట్’ వెబ్సైట్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. నరేంద్ర మోదీకి సొంత దేశం భారత్‌లో 78 శాతం జనాదరణ ఉన్నట్లు తేలింది. అంటే దేశ జనాభాలో 78 శాతం మంది మోదీని నాయకత్వాన్ని ఆమోదిస్తున్నట్లు తేలింది. మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్‌గా ఆయన తొలి స్థానం దక్కించుకున్నారు. మరో విశేషం ఏమిటంటే.. గత ఏడాది డిసెంబర్ నిర్వహించిన ఇదే సర్వేలో నరేంద్ర మోదీకి 76 శాతం ప్రజాదరణ లభించింది. అంటే నెల రోజుల్లో మరో 2 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ తదితరులు మోదీ కంటే వెనుకబడి ఉన్నారు. మెక్సికో అధ్యక్షుడు అండ్రూస్ మాన్యుల్ లోపెజ్ ఒబ్రాడర్ రెండవ స్థానంలో నిలిచారు. -
అత్యంత ప్రజాదారణ కలిగిన సీఎం ఎవరో తెలుసా?
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రజాదారణ(పాపులారిటీ) కలిగిన ముఖ్యమంత్రిగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచినట్లు ఓ మీడియా సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వే నివేదికలో పేర్కొంది. సుమారు రెండు దశాబ్దాలకు పైగా సీఎంగా కొనసాగుతున్న నవీన్ పట్నాయక్.. దేశంలోనే అత్యంత ప్రజాధారణ కలిగిన ముఖ్యమంత్రిగా నిలవటం విశేషం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలిచారు. అనూహ్యంగా త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ప్రజాదరణలో ఐదో స్థానంలో నిలిచారు. నవీన్ పట్నాయక్: 2000 సంవత్సరం నుంచి అధికారంలో ఉన్న 77 ఏళ్ల నవీన్ పట్నాయన్ సర్వే నివేదికలో మొదటి స్థానంలో నిలిచారు. సర్వే ప్రకారం 52.7 శాతం ప్రజాదరణతో టాప్‌లో ఉన్నారు. బిజూ జనతా దళ్ పార్టీ చీఫ్ అయిన నవీన్ పట్నాయక్.. దేశంలో ఎక్కువ కాలం సీఎం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో ఒకరు. యోగి అదిత్యనాథ్: 2017 నుంచి అధికారంలో ఉన్న ఉత్తప్రదేశ్ 21వ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్వేలో అత్యంత ప్రజాదారణ పొందిన సీఎంలలో రెండో స్థానంతో నిలిచారు. యోగి 51.3 శాతం పాపులారిటిని కలిగి ఉన్నారు. సుమారు ఆయన ఏడేళ్లగా సీఎం సేవలు అందిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఎక్కవ కాలం సీఎంగా ఉన్న పేరు యోగికి ఉండటం విశేషం. హిమంత బిశ్వ శర్వ : అస్సాం(అసోం) సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రజాదరణ పొందిన మూడో సీఎంగా నిలిచారు. 48. 6 శాతం ప్రజాదారణ కలిగి ఉన్నారు. గతంలో కాంగ్రెస్ నేతగా ఉన్న హిమంత.. 2015తో బీజేపీలో చేరారు. 2021 నుంచి ఆయన అస్సాంకు 15వ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. భూపేంద్ర పటేల్: గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రజాదారణలో నాలుగో స్థానంలో నిలిచారు. 42. 6 శాతం పజాదారణను భూపేంద్ర పటేల్ కలిగి ఉండటం గమనార్హం. సెప్టెంబర్, 2021 నుంచి భూపేంద్ర పటేల్ సీఎం కొనసాగుతున్నారు. గుజరాత్ 17 వ సీఎం భూపేంద్ర పటేల్. మాణిక్ సాహా: ఈశాన్య రాష్ట్రమైన మాణిక్ సాహా అత్యంత ప్రజాదాన విషయంలో టాప్ 5లో చోటు దక్కించుకున్నారు. 41.4 శాతం ప్రజాదారణను మాణిక్ షా కలిగి ఉన్నారు. గతంలో కాంగ్రెస్ నేతగా ఉన్న మాణిక్ షా... 2016లో బీజేపీలో చేరారు. మే, 2022లో మాణిక్ షా.. రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. -
తైవాన్ అధ్యక్ష రేసులో..టెర్రీ గౌ
ఐ ఫోన్ తయారీ సంస్థ ఫౌండర్, అపర కుబేరుడు టెర్రీ గౌ కూడా తైవాన్ అధ్యక్ష రేసులో నిలిచారు. కుచేలుడి నుంచి కుబేరుని స్థాయికి ఎదిగిన ఆసక్తికర నేపథ్యం టెర్రీది. కనుక ఆయనకున్న ప్రజాదరణ నేపథ్యంలో ఒక్కడే గనక బరిలో ఉంటే పాలక డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కి గట్టి పోటీ ఇవ్వడం కూడా ఖాయమేనని అంటున్నారు. కానీ విపక్షాల తరఫున ఇప్పటికే ఇద్దరు రంగంలోకి దిగారు.ఈ నేపథ్యంలో టెర్రీ పోటీ విపక్ష ఓటును మూడుగా చీల్చి చివరికి 2024 జనవరిలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో అధికార పక్షం నెత్తిన పాలు పోసేలా కనిపిస్తోందన్నది పరిశీలకుల విశ్లేషణ... తైవాన్‌కు చెందిన 72 ఏళ్ల టెర్రీ అపర కుబేరుడు. ఐ ఫోన్ తయారీ సంస్థ ఫాక్స్ కాన్ వ్యవస్థాపకుడు.వ్యాపారవేత్తగా దేశ ప్రజల్లో ఆయనకున్న చరిష్మా అంతా ఇంతా కాదు. అధికార పక్షంతో ఇప్పటికే రెండు విపక్షాలు తలపడుతుండగా మూడో శక్తిగా ఆయన కూడా రంగంలోకి దిగి అధ్యక్ష ఎన్నికల రేసును ఆసక్తికర మలుపు తిప్పారు. బరిలో ఆ ముగ్గురు... అధ్యక్షుడు సై ఇంగ్ వెన్కు ఇది రెండో టర్మ్. అంతకు మించి పదవిలో కొనసాగేందుకు తైవాన్ నిబంధనలు అనుమతించవు. దాంతో ఈసారి అధికార డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) తరఫున విలియం లై చింగ్ తే బరిలో దిగుతున్నారు. ప్రధాన విపక్షమైన జాతీయవాద కోయిమిన్ టాంగ్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్గా చాన్స్ దక్కించుకునేందుకు టెర్రీ ఎంతగానో ప్రయత్నించి విఫలమయ్యారు. ఆయనకు బదులుగా హొవ్ యూ ఇయ్కు పార్టీ అవకాశం ఇచ్చింది. మరో విపక్షం టీపీపీ తరఫున దేశ ప్రజల్లో అత్యంత ఆదరణ ఉన్న కో వెన్ జే పోటీ పడుతున్నారు. రాజధాని తాయ్ పీ సిటీ మేయర్‌గా చేసిన అనుభవం ఆయన సొంతం. పైగా యువ ఓటర్లు ఆయనను వేలం వెర్రిగా అభిమానిస్తారు. ప్రస్తుతం రేసులో రెండో స్థానంతో వెన్ దూసుకుపోతున్నారు. ఎంత ప్రయత్నించినా ప్రధాన విపక్షం డీపీపీ నుంచి అవకాశం దక్కకపోవడంతో టెర్రీ స్వతంత్ర హోదాలో పోటీకి దిగారు. అంతులేని సంపద, వ్యాపార విజయాలతో పాటు చైనాతో దీర్ఘకాలం పాటు విజయవంతంగా కలిసి పని చేసిన విశేషానుభవం టెర్రీకి మరింతగా కలిసొచ్చే అంశం.– నేషనల్ డెస్క్, సాక్షి తైవాన్ ఇంజనీరింగ్ ప్రతిభకు మానవ వనరులను కలగలిపి ఫాక్స్ కాన్ (హాన్ హై ఇండస్ట్రీస్)ను ప్రపంచంలోనే అతి పెద్ద ఎల్రక్టానిక్స్ తయారీదారుగా తీర్చిదిద్దారు టెర్రీ. 1980, 90ల్లో దక్షిణ చైనాలో అతి పెద్ద తయారీ సంస్థలను నెలకొల్పి చైనీయులకు వేలాదిగా ఉపాధి కల్పించారు. ఈ మోడల్ సూపర్ సక్సెస్ అయింది. ఎంతగా అంటే, యాపిల్ తన మాక్ బుక్స్, ఐ ఫోన్ల తయారీని ఫాక్స్ కాన్కే అప్పగించేలా ఒప్పించగలిగారు టెర్రీ. దాంతో ఫాక్స్ కాన్ అతి పెద్ద కంపెనీగా, టెర్రీ దేశంలోనే అతి సంపన్నుల్లో ఒకరిగా ఎదగడం సాధ్యపడింది. తైవాన్ సారబౌమత్వాన్ని కాపాడేందుకు చైనాతో తనకున్న సంబంధాలన్నింటిన్నీ ఉపయోగిస్తానని, దేశాభివృద్ధి కోసం తన అనుభవం మొత్తాన్నీ రంగరిస్తానని చెబుతున్నారు టెర్రీ. తైవాన్ను ఎలాగైనా పూర్తిగా తనలో కలిపేసుకోవాలని చైనా ప్రయత్నిస్తుండటం, ఇటీవల ఆ దిశగా దూకుడు పెంచడం, అది తైవాన్ కు కొమ్ము కాస్తున్న అమెరికాతో ఘర్షణ దాకా వెళ్లడం తెలిసిందే పాలక డీపీపీ అసమర్థ, అసంబద్ధ, దుందుడుకు విధానాలే ఈ దుస్థితికి కారణమని టెర్రీ ఆరోపిస్తున్నారు. కానీ తైవాన్ ప్రజల్లో అత్యధికులు ఈ వాదనను విశ్వసించడం లేదు. త్రిముఖ ఓటుతో ఇప్పటికే అవకాశాలు సన్నగిల్లేలా కనిపిస్తున్న టెర్రీకి ఇది మరింత ప్రతికూలంగా మారేలా ఉంది. 40 శాతానికి పైగా ఓటర్లు పాలక పక్షానికి గట్టిగా మద్దతిస్తున్నట్టు ఇటీవలి సర్వేలు కూడా తేల్చాయి. ఈ పరిస్థితుల్లో విపక్షాలన్నీ ఒక్కటై ఉమ్మడిగా ఒకే అభ్యర్ని నిలిపితేనే అధికార పార్టీ కి కాస్తో కూస్తో పోటీ ఇవ్వడం సాధ్యపడేలా కనిపిస్తోంది. కానీ అందుకు రెండు విపక్షాల్లో ఏదీ సిద్ధంగా లేదు. దాంతో సర్వేలు చెబుతున్నట్టు అధికార డీపీపీకి కేవలం 40 శాతం ఓట్లు మాత్రమే వచ్చినా అది అధికారం నిలుపుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. -
యూట్యూబ్ సెన్సేషన్.. ఈ మిస్టరీ గర్ల్ ఇన్నాళ్లకు దొరికింది
కొందరికి ఎంత కష్టపడ్డా స్టార్డమ్ అంత ఈజీగా రాదు. మరికొందరికేమో ఓవర్ నైట్‌లోనే పాపులారిటీ వస్తుంది. మీకు గుర్తుందా? యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తరచూ ఓ యాడ్‌లో ఓ అమ్మాయి వెనక్కి తిరిగి నవ్వుతున్న ఫోటో ఒకటి కనిపించేది. కేవలం ఆ ఒక్క యాడ్‌లోనే కనిపించిన ఆ అమ్మాయి ఎప్పుడు ఎక్కడ ఉంది? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది హీరోయిన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మొదట మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రకటనల్లో నటించి వచ్చిన గుర్తింపుతో అవకాశాలను సంపాదించుకుంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోయిన్లు కెరీర్ ప్రారంభంలో ఏదో ఒక యాడ్‌లో నటించే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం కేవలం ప్రకటనలకే పరిమితం అవుతుంటారు. ఇలాంటి కోవలోకే వస్తుంది నుపుర్ చాబ్రా. అప్పట్లో యూట్యూబ్‌లో ఏ లింక్ ఓపెన్ చేసినా మొదట యాడ్‌లో ఓ అమ్మాయి ఫోటో కనిపించేది. ట్రెడిషనల్ డ్రెస్‌లో ఓ అందమైన అమ్మాయి స్మైల్ ఇస్తూ కనిపించేది. కానీ ఈ యాడ్ తర్వాత ఆ అమ్మాయి మరే ఇతర ప్రకటనల్లోనూ కనిపించలేదు. ఈ మిస్టరీ గర్ల్ బ్యాక్‌గ్రౌండ్ గురించి ఆరాతీస్తే ఈ మధ్యే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూట్యూబ్‌లో కనిపించే ఈ పాపులర్ అమ్మాయి పేరు నుపుర్ చాబ్రా. ఇండియాకు చెందిన నుపుర్ కుటుంబం చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడింది. శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా యూనివర్సిటీలో మార్కెటింగ్ బ్యాచలర్ డిగ్రీని అందుకున్న నుపుర్ ఫేస్బుక్ సంస్థలో టెక్నికల్ రిక్రూటర్, మార్కెటింగ్ మీడియా మేనేజర్‌గా పనిచేసింది. ఆ సమయంలోనే ఆమెకు ఓ యాడ్‌లో నటించేందుకు ఆఫర్ వచ్చింది. పేదరికంలో ఉన్న చిన్నపిల్లలకు సహాయం చేసే స్వచ్చంద సంస్థకు చెందిన ప్రకటన అది. ఆరేళ్ల క్రితమే నుపుర్ ఈ యాడ్‌లో నటించింది. ఇక 2020లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సాహిల్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరు శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నారు. కేరింగ్ హ్యాండ్స్ ఫర్ చిల్డ్రన్ అనే సంస్థకు డైరెక్టర్‌గా కొనసాగుతూనే, లెట్స్ హాంగిన్ అనే మరో సంస్థకు కూడా కో ఫౌండర్‌గా ఉన్నారు నుపూర్. -
సౌత్ వర్సెస్ బాలీవుడ్.. ఐశ్వర్యరాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘ఓ సినిమాను నేనెప్పుడూ దక్షిణాది, ఉత్తరాది అని విభజించి చూడలేదు. ఏ సినిమా అయినా అది భారతీయ సినిమాగానే భావిస్తాను’’ అన్నారు ఐశ్వర్యా రాయ్. ‘ఈ మధ్య కాలంలో బాలీవుడ్ కంటే దక్షిణాది సినిమాల పాపులారిటీ ఎక్కువగా ఉందనీ, ఉత్తరాదిపై దక్షిణాది చిత్ర పరిశ్రమ ఆధిపత్యం చలాయిస్తుందనీ కొందరు అనుకుంటున్నారు. వీటిని మీరు అంగీకరిస్తారా?’ అనే ప్రశ్నలు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్యకి ఎదురయ్యాయి. దీనిపై ఐశ్వర్యా రాయ్ స్పందిస్తూ– ‘‘ఏ రంగంలో అయినా పోటీ ఉన్నట్లే చిత్ర పరిశ్రమలోనూ ఒక ఇండస్ట్రీకి మరొక ఇండస్ట్రీకి మధ్య పోటీ ఉంటుంది. అయితే కళాకారుల మధ్య అలాంటి భేదాలుండవు. నేనెప్పుడూ దక్షిణాది, ఉత్తరాది అని విడిగా చూడలేదు. ఏ సినిమా అయినా భారతీయ చిత్రంగానే భావిస్తాను. ఒకదానిపై మరొకటి ఆధిపత్యం చలాయిస్తుందనే అభిప్రాయాన్ని అంగీకరించను. ఒకచోట అవకాశాలు రాకపోతే మరొక చోట ప్రయత్నించవచ్చు. అక్కడ కూడా రాకపోతే వేరే ఇండస్ట్రీలోకి వెళ్లొచ్చు. కళకు, కళాకారులకు ఎక్కడైనా గౌరవం ఉంటుంది. పని చేసే ప్రతి సినిమా నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవచ్చు. దక్షిణాదిలో మణిరత్నంగారు, శంకర్‌గారు.. వంటి పెద్ద దర్శకులతో మంచి సినిమాలు చేసే అవకాశం నాకు వచ్చింది’’ అన్నారు ఐశ్వర్య. -
సిప్.. సిప్.. హుర్రే!
న్యూఢిల్లీ: సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (క్రమానుగత పెట్టుబడులు/సిప్)కు ఆదరణ పెరుగుతోంది. ఈ మార్గంలో ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా సిప్ రూపంలో ప్రతి నెలా వచ్చే పెట్టుబడుల మొత్తం పెరుగుతోంది. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరానికి సిప్ రూపంలో వచ్చిన పెట్టుబడులు రూ.1.24 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇవి అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020–21)లో వచ్చిన రూ.96,080 కోట్లతో పోలిస్తే ఏడాదిలో 30 శాతం వృద్ధి నమోదైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు గత ఆర్థిక సంవత్సరం గణాంకాలను మ్యూచువల్ ఫండ్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. 2016–17 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద సిప్ రూపంలో ఫండ్స్ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.43,921 కోట్లుగా ఉన్నాయి. అంటే గత ఐదేళ్లలో రెండు రెట్లు మేర పెరిగినట్టు తెలుస్తుంది. సిప్‌కు ఆదరణ ఎంతో వేగంగా పెరుగుతుందనడానికి ఇదే నిదర్శం. 2021 మార్చి నెలకు సిప్ రూపంలో వచ్చిన పెట్టుబడులు రూ.9,182 కోట్లుగా ఉంటే.. 2022 మార్చి నెలలో ఇవి రూ.12,328 కోట్లకు వృద్ధి చెందాయి. ఏడాదిలో 34 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఇన్వెస్టర్లలో విశ్వాసానికి నిదర్శనం.. సిప్ బుక్ పరిమాణం పెరగడం.. ఈక్విటీల్లో పెట్టుబడులకు మెరుగైన సాధనంగా ఇన్వెస్టర్లలో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శమని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. ఇక మ్యూచువల్ ఫండ్స్ సంస్థల వద్ద సిప్ రూపంలోని నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) 2022 మార్చి నాటికి రూ.5.76 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. గతేడాది మార్చి చివరికి నాటికి ఇవి రూ.4.28 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఐదేళ్లలో సిప్ ఏయూఎం ఏటా 30 శాతం చొప్పున వృద్ధి చెందుతూ వస్తోంది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ సంస్థల వద్ద 5.39 కోట్ల సిప్ ఖాతాలు ఉన్నాయి. వీటి ద్వారా ఇన్వెస్టర్లు ప్రతి నెలా ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. మంచి పరిష్కారం.. సిప్, సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) ద్వారా ఒక క్రమపద్ధతిలో పెట్టుబడుల విధానాన్ని అనుసరించడం మార్కెట్లలో దిద్దుబాట్లు, అనిశ్చిత పరిస్థితులను అధిగమించేందుకు చక్కని పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల పెట్టుబడుల సగటు వ్యయం తగ్గుతుందని, బుల్ ర్యాలీ కొనసాగినా ఇన్వెస్టర్లు పెట్టుబడుల అవకాశాలు నష్టపోకుండా ఉండొచ్చని పేర్కొన్నారు. సిప్ రూపంలో ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకున్న పథకాల్లో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని నిర్ణయించుకున్న తేదీన వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అదే ఎస్టీపీ అన్నది డెట్‌లో ఒకే విడత పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేసుకుని.. అక్కడి నుంచి ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఈక్విటీ పథకాల్లోకి బదిలీ చేసుకునేందుకు ఉపకరిస్తుంది. మార్కెట్లలో ఆటుపోట్లు ఉన్నప్పుడు, లేదంటే అధిక వ్యాల్యూషన్లకు చేరినప్పుడు ఏకమొత్తంలో పెట్టడం రిస్క్ అవుతుంది. అందుకని ఎస్టీపీ మార్గాన్ని అనుసరించొచ్చు. మార్కెట్లలో అస్థిరతలు, కరెక్షన్ల గురించి ఆందోళన చెందకుండా పెట్టుబడులు పెట్టుకునే చక్కని మార్గమే సిప్ అని యాంఫి సైతం పేర్కొంది. ఇటీవలి కాలంలో విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో విక్రయాలు చేస్తున్నా.. మన మార్కెట్లు బలంగా ఉండడానికి సిప్ రూపంలో వస్తున్న పెట్టుబడులు కూడా దోహదపడుతున్నాయి. -
Putin: మొండి పుతిన్‌కు పెరిగిన మద్దతు.. ఆదరణ!
ఉక్రెయిన్ ఆక్రమణ విషయంలో పాశ్చాత్య దేశాల పాలిట రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక విలన్. కానీ, అదే పుతిన్ పాపులారిటీ వీరలెవల్లో పెరగడానికి ఒక కారణం అయ్యింది. అంతేకాదు ఆయన తీసుకున్న నిర్ణయానికి స్వదేశంలో మద్ధతు నానాటికీ పెరిగిపోతోంది కూడా. రష్యాకు చెందిన ఇండిపెండెంట్ మీడియా ఏజెన్సీ లెవద సెంటర్.. తాజాగా విడుదల చేసిన రిపోర్ట్‌లో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అందులో 80 శాతంపైగా రష్యా ప్రజలు పుతిన్ చర్యలను సమర్థిస్తున్నారట. ఉక్రెయిన్‌పై ఆక్రమణ మొదలయ్యాక రష్యాలోనూ కొంత ప్రతికూలత పుతిన్‌కు ఎదురయ్యింది. కానీ.. ఈ నెల రోజుల పరిణామాలు.. ప్రత్యేకించి పాశ్చాత్య దేశాలు రష్యా పట్ల వ్యవహరిస్తున్న తీరు అక్కడి ప్రజల్లో విపరీతమైన మార్పును తీసుకొచ్చిందని లెవద సెంటర్ వివరించింది. యుద్ధం మొదలైన మొదట్లో 27 శాతం రష్యా జనాభా పుతిన్చర్యలను వ్యతిరేకించారని, ఇప్పుడది 15 శాతానికి పడిపోయిందని ప్రత్యేకంగా పేర్కొంది. అంతేకాదు పుతిన్ పాపులారిటీ గ్లోబల్ వైడ్‌గా(పాశ్చాత్య దేశాలను మినహాయించి) పెరిగడానికి ఉక్రెయిన్ యుద్ధం ఒక కారణమైందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది లెవద సెంటర్ నిర్వహించిన ప్రముఖ సర్వే ఇదే కావడం విశేషం. రష్యా బలగాల గురించి, యుద్ధ పరిణామాల గురించి తప్పుడు వార్తలు, కథనాలు ప్రచురించే వాళ్లపై క్రిమినల్ కేసులు పెడుతోంది అక్కడి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో.. స్వతంత్ర్య మీడియా ఏజెన్సీగా పేరున్న లెవద సెంటర్ ఈ తరహా రిపోర్ట్ వెల్లడించడం గమనార్హం. -
ఫలించిన పాజిటివ్ మంత్రం
ఉత్తరప్రదేశ్ ఓటర్లు చరిత్ర సృష్టించారు. యోగి ఆదిత్యనాథ్ పాలనకు జై కొట్టారు. మూడున్నర దశాబ్దాల ఆనవాయితీని తిరగరాస్తూ అధికార పార్టీ బీజేపీకి రెండోసారి అధికారం కట్టబెట్టారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఒంటరి పోరాటం ఫలించలేదు. బీఎస్పీ పూర్తిగా చతికిలపడటం, కాంగ్రెస్ కనుమరుగవడం, బీజేపీ హిందూత్వ ప్రచారం, పాజిటివ్ మంత్రం తదితరాలు అఖిలేశ్ సారథ్యంలోని ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమిని దెబ్బతీశాయి. శాంతిభద్రతలు, మోదీ ప్రజాదరణ, ఉచిత రేషన్, అభివృద్ధి వంటి సానుకూలాంశాలు యోగిని గట్టెక్కించాయి. సవ్యమైన శాంతిభద్రతలు యోగి పాలనలో సైతం గత ఐదేళ్లలో యూపీలో దారుణమైన నేరాలు అనేకం జరిగాయి. కానీ వాటికి పాల్పడ్డ వారిని యోగి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచేసిన తీరు ప్రజలకు నచ్చింది. నేరాలకు పాల్పడిన మాఫియా నేతలను ఎన్కౌంటర్లలో మట్టుపెట్టిన యోగి ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారు. ‘యోగి వల్ల మేం రాత్రి 12 గంటలకు కూడా రోడ్డుపై తిరగగలుగుతున్నాం. అంతకంటే మాకేం కావాలి?’ అని లక్నోకు చెందిన సురేఖ రాణి ప్రశ్నించారు. నేరస్తుల పట్ల యోగి అత్యంత కఠినంగా వ్యవహరించారని ప్రజలు విశ్వసించారు. గతంతో పోలిస్తే యూపీలో హత్యలు, అత్యాచారాలు తగ్గాయని రాయ్‌బరేలీకి చెందిన కిషన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ‘నేను యూపీలో విస్తృతంగా పర్యటించాను. యోగి ప్రభుత్వం పట్ల మహిళల్లో మంచి ఆదరణ కన్పించింది. దానికి మరో అవకాశం ఇవ్వాలన్న పట్టుదల చాలామందిలో గమనించా’ అని ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ విశ్లేషించారు. బీజేపీ మళ్లీ అధికారంలో రావడానికి మహిళల మద్దతు ప్రధాన కారణమని ఆయనన్నారు. అవినీతి నియంత్రణ యోగి తన ఐదేళ్ల పాలనలో అవినీతిని కొంతమేరకు నియంత్రించగలిగారు. ఇది కూడా ఆయనను మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి దోహదపడిందని రాజకీయ విళ్లేషకులు అంటున్నారు. ‘మరీ ముఖ్యంగా పై స్థాయిలో అవినీతిని యోగి బాగా నియంత్రించారని ప్రజలు నమ్మారు. మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని అదుపు చేయడంలో యోగి సఫలమయ్యారు. ఏ నియోజకవర్గంలో నేరాలు జరిగినా సంబంధిత ఎమ్మెల్యేదే బాధ్యత అన్న యోగి హెచ్చరికలు కూడా ప్రజలకు నచ్చాయి’ అని సెంటర్ ఫర్ పొలిటికల్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు ప్రవీణ్ వర్మ అన్నారు. ‘కిందిస్థాయిలో అవినీతి ఉన్నా ప్రజలను ఇబ్బంది పెట్టేంతగా లేదని ప్రజలు విశ్వసించారు. మరోసారి యోగి గెలిస్తే అవినీతి మరింత తగ్గుతుందని కూడా నమ్మారు’ అని ప్రముఖ సెఫాలజిస్ట్ ప్రదీప్ గుప్తా విశ్లేషించారు. పన్నులు పెంచినా వృద్ధీ ఉంది యోగి హయాంలో పన్నులు బాగా పెంచారన్న అసంతృప్తి ప్రజల్లో లేకపోలేదు. కానీ అభివృద్ధి జరగాలంటే నిధులు కావాలి కదా అని సర్దుకుపోయే ధోరణిలో మాట్లాడుతున్న వాళ్లే ఎక్కువ. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల పనితీరు కూడా ఐదేళ్లలో బాగానే మెరుగుపడిందని ప్రజలు బహిరంగంగా చెపుతున్నారు. యోగికి మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వడానికి ఇవీ కారణాలేనన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. సమాజ్‌వాదీ ఓటమికి కారణాలెన్నో.. అఖిలేశ్‌ను ఎలాగైనా మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలంటూ ముస్లింలలో వచ్చిన పెద్ద మార్పు యూపీలో హిందువుల పోలరైజేషన్‌కు ఉపయోగపడింది. బహుశా ఇదే బీజేపీని గెలిపించినట్టు కన్పిస్తోందని ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యాదవులకు వ్యతిరేకంగా ఓబీసీలు బీజేపీ వైపు ర్యాలీ అయ్యారని ఆయన విశ్లేషించారు. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజకీయంగా దాదాపుగా కనుమరుగు కావడం కూడా అఖిలేశ్‌కు అతి పెద్ద మైనస్‌గా మారిందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో ఆమె పెద్దగా ప్రచారం కూడా చేయలేదు. మాయావతి అనాసక్తిని కనిపెట్టిన కొందరు దళితులు బీజేపీ పంచన చేరారు. మరికొందరు ఎస్పీకి వ్యతిరేకంగా పని చేశారు. నిజానికి ఈసారి ముస్లింలు, యాదవులు అఖిలేశ్‌కు ఏకమొత్తంగా మద్దతు పలికారు. అలా చూస్తే ఆయన పోరాటం నేరుగా 24 శాతం ఓట్లతో మొదలైంది! 2013 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఇది ఏకంగా 4 శాతం అధికం. మరో 16 శాతానికి అటూఇటుగా ఓట్లు తెచ్చుకోగలిగి ఉంటే అధికారం ఆయన సొంతమయ్యేదే. కానీ అది చెప్పినంత తేలిక కాదు. యూపీ రాజకీయాల్లో బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువే. వారు ఏ పార్టీకి మద్దతిస్తే వారి తరపున జోరుగా ప్రచారం చేస్తారు. పైగా మరో విశేషమేమంటే ఆ వర్గానికి చెందిన వారు కనీసం 90 శాతం దాకా కచ్చితంగా ఓటు వేస్తారు. ఇది ఈసారి అఖిలేశ్‌కు బాగా మైనస్‌గా మారింది. గత ఐదేళ్లలో అఖిలేశ్ పార్టీని పటిష్టపరచుకోగలిగారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పెద్దగా పోరాటాలు చేయలేదన్న అపవాదుంది. ప్రజలను చైతన్యవంతులను చేసే ప్రయత్నంలో కూడా విఫలమయ్యారన్న విమర్శలు ఎక్కువయ్యాయి. అలాగే యాదవులు, ముస్లింలు మినహా మిగతా వర్గాలను అఖిలేశ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఆయనకు ప్రజల్లో మంచి ఆదరణే ఉంది. కానీ, దాన్ని ఓట్లుగా మలుచుకోలేకపోయారు. అందుకు కావాల్సిన యంత్రాంగం, దాన్ని ముందుండి నడిపే వనరుల లేమి కూడా మైనస్ అయింది. బీజేపీ ఈ ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. మోదీ మంత్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల యూపీ ప్రజలకున్న విశ్వాసం ఏమాత్రం సడలకపోవడం కూడా యోగికి ఈసారి పెద్ద వరమైంది. ‘యోగి కంటే మోదీకే యూపీలో ఎక్కువ పాపులారిటీ ఉంది. ఆయనపై ప్రజలకున్న తిరుగులేని విశ్వాసం కూడా అఖిలేశ్‌కు బాగా మైనస్ అయింది’ అని సెఫాలజిస్ట్ యశ్వంత్ దేశ్‌ముఖ్ అన్నారు. వీటికి తోడు రాష్ట్రంలో కాంగ్రెస్ దాదాపుగా తుడిచిపెట్టుకుపోవడం కూడా అఖిలేశ్‌కు మరో పెద్ద మైనస్‌గా మారింది. ఎక్కడా కాంగ్రెస్ కనీసం ఐదు శాతం ఓట్లు కూడా చీల్చే పరిస్థితి కన్పించలేదు. దాంతో అధికార బీజేపీ ఓట్లు చీలలేదు. – (సాక్షి ప్రత్యేక ప్రతినిధి కంచర్ల యాదగిరిరెడ్డి) -
జన్ ఆశీర్వాద యాత్రతో ప్రతిపక్షాల్లో వణుకు
న్యూఢిల్లీ: 39 మంది కేంద్ర మంత్రులు నిర్వహించిన జన్ ఆశీర్వాద యాత్రకు దేశవ్యాప్తంగా లభించిన జనాదరణను చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోయాయని, ఆయా పార్టీల్లో వణుకు పుట్టిందని బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డా అన్నారు. విజయవంతంగా సాగుతున్న ఈ యాత్రకు ఆటంకాలు సృష్టించేందుకు ప్రతిపక్ష నాయకులు కుటిల యత్నాలు చేశారని మండిపడ్డారు. ఈ మేరకు నడ్డా శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి దేశ ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ప్రజామోదం నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాల కుట్రలు సాగడం లేదన్నారు. కేంద్ర మంత్రి నారాయణ రాణే పట్ల మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నడ్డా తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో ఉన్న కేంద్ర మంత్రిని అరెస్టు చేయడం అంటే మన ప్రజాస్వామ్యం వ్యవస్థపై నేరుగా దాడి చేసినట్లేనని ఉద్ఘాటించారు. ప్రతిపక్షాల ప్రతికూల రాజకీయ అజెండాను ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారని, అభివృద్ధి రాజకీయాలే వారు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. జన్ ఆశీర్వాద యాత్ర స్వాతంత్య్రోత్సవ దినం సందర్భంగా ఆగస్టు 15న మొదలయ్యింది. ఆగస్టు 28న ముగిసింది. కేంద్ర మంత్రులు 14 రోజుల్లో 24 వేల కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగించారు. 5 వేలకుపైగా సభల్లో మాట్లాడారు. యాత్రతోపాటు ఈ సభలన్నీ పూర్తిస్థాయిలో విజయవంతం అయ్యాయని జె.పి.నడ్డా వెల్లడించారు. ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని గుర్తుచేశారు. మోదీ నాయకత్వంలో జరుగుతున్న సర్వతోముఖా భివృద్ధిని ప్రజలు ప్రశంసిస్తున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం వినూత్న పథకాలు, కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలకు చేరువవుతోందని అన్నారు. దేశ భద్రతను పటిష్టం చేసేందుకు కేంద్ర ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. సమాజంలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం, బీజేపీ కట్టుబడి ఉన్నాయని వివరించారు. అభివృద్ధి విషయంలో వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. -
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏకు 321 సీట్లు!
న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల్లో చైనా, ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు, దేశవ్యాప్తంగా కరోనా, అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థ.. ఇలా అసాధారణ వరుస సవాళ్లను ఎదుర్కొన్న ఏ ప్రభుత్వ ప్రజాదరణ అయినా సహజంగానే తగ్గుముఖం పడుతుంది. కానీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ ప్రజాదరణ మాత్రం ఈ అసాధారణ సవాళ్లలోనూ చెక్కు చెదరలేదని, ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఎన్డీఏ ఘన విజయం సాధిస్తుందని ‘ఇండియా టుడే –కార్వీ’ జరిపిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్(ఎంఓటీఎన్)’ సర్వే తేల్చింది. మెజారిటీ మార్క్‌ను దాటి 43% ఓట్లతో 321 స్థానాలను సునాయాసంగా గెలుచుకుంటుందని తేల్చింది. గత సంవత్సరం ఆగస్ట్ నెలలో జరిపిన సర్వేలో ఎన్డీఏ 316 సీట్లు గెలుచుకుంటుందని తేలగా, దానిపై మరో ఐదు స్థానాలు అధికంగానే గెలుస్తుందని ప్రస్తుత సర్వే పేర్కొనడం విశేషం. అయితే, 2019 ఎన్నికల్లో ఎన్డీఏ గెల్చుకున్న 357 సీట్ల కన్నా ఈ నెంబర్ తక్కువగానే ఉండటం గమనార్హం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే విపక్ష యూపీఏ కూటమి 93 సీట్లు గెల్చుకుంటుందని ఈ ఎంఓటీఎన్ సర్వే పేర్కొంది. ప్రాంతాల వారీగా తీసుకుంటే, హిందీ, హిందుత్వ రాజకీయాలు బలంగా ఉన్న ఉత్తర భారతదేశంలో ఎన్డీఏ అత్యధికంగా 104 సీట్లను, పశ్చిమ భారతదేశంలో 85 సీట్లను, తెలివైన పొత్తులతో తూర్పు భారతంలో 100 స్థానాలను గెల్చుకుంటుందని ఈ సర్వే తేల్చింది. దక్షిణ భారత్‌లో మాత్రం ఆశించిన ఫలితాలను సాధించలేదని, అక్కడ 32 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది. పార్టీల వారీగా చూస్తే బీజేపీ మరొకసారి సొంతంగా మెజారిటీ సాధిస్తుందని, మెజారిటీ మార్క్ అయిన 272ని దాటి 291 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ 51 సీట్లు మాత్రమే సాధిస్తుందంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లు గెల్చుకున్న విషయం తెలిసిందే. మోదీపై విశ్వాసం కరోనాపై పోరుకు అనూహ్య లాక్డౌన్ ప్రకటన, కరోనా కేసుల్లో ప్రపంచంలో రెండోస్థానంలో నిలవడం, వలస కూలీల సంక్షోభం, కనిష్ట స్థాయికి జీడీపీ, ప్రబలిన నిరుద్యోగం, లద్దాఖ్ సరిహద్దుల్లో చైనా దూకుడు.. తదితర అంశాల్లో విమర్శలు వచ్చినప్పటికీ.. ప్రధాని మోదీపై ప్రజల విశ్వాసం సడలలేదని సర్వేలో తేలింది. ఎంఓటీఎన్ సర్వేలో పాల్గొన్నవారిలో 74% మంది మోదీ ప్రధానిగా అత్యుత్తమ పనితీరు చూపారని ప్రశంసించారు. వరుసగా ఏడో సంవత్సరం అధికారంలో ఉన్న నేతకు ఈ స్థాయిలో ప్రజాదరణ లభించడం అరుదైన విషయమే. అలాగే, ఎన్డీఏ ప్రభుత్వ పనితీరుపై 66% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అత్యుత్తమ ప్రధాని రేసులోనూ మోదీ చాలా ముందున్నారు. దేశ అత్యుత్తమ ప్రధానిగా 38% రేటింగ్‌తో మోదీ తొలి స్థానంలో నిలిచారు. తరువాతి స్థానాల్లో వరుసగా అటల్ బిహారీ వాజ్‌పేయి(18%), ఇందిరాగాంధీ(11%), జవహర్లాల్ నెహ్రూ(8%), మన్మోహన్ సింగ్(7%) ఉన్నారు. అయితే, దక్షిణ భారత్‌లో మోదీ హవా, బీజేపీ ప్రభావం అంతగా కనిపించలేదు. ప్రధానిగా మోదీ పాపులారిటీ దక్షిణ భారతదేశంలో 63 శాతం ఉంది. ముస్లింలలో 38% మోదీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం సాధించిన రెండు గొప్ప విజయాలుగా సర్వే తేల్చినవి ఆరెస్సెస్ అజెండాకే సంబంధించినవి కావడం విశేషం. -
సోషల్ మీడియా కింగ్ మోదీ.. రెండో స్థానంలో సీఎం జగన్
న్యూఢిల్లీ: అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతగా సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవా కొనసాగుతోంది. ట్విటర్, గూగుల్ సెర్చ్, యూట్యూబ్ ప్లాట్‌ఫామ్స్‌ల్లో అత్యధిక ట్రెండ్స్ మోదీ పేరుపైననే ఉన్నాయి. ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు సోషల్ మీడియా టాప్ ట్రెండ్స్‌ను ‘చెక్‌బ్రాండ్స్’ సంస్థ నివేదిక రూపంలో వెల్లడించింది. ఈ మూడు నెలల కాలంలో 95 మంది టాప్ పొలటికల్ లీడర్లు, 500 మంది అత్యున్నత ప్రభావశీలురకు సంబంధించిన ట్రెండ్స్‌ను చెక్‌బ్రాండ్స్ విశ్లేషించింది. దాదాపు 10 కోట్ల ఆన్లైన్ ఇంప్రెషన్స్ ఆధారంగా ఈ తొలి నివేదికను వెలువరించింది. ట్విటర్, గూగుల్ సెర్చ్, వికీ, యూట్యూబ్‌ల్లో అత్యధిక ట్రెండ్స్ ప్రధాని మోదీ పేరుపైననే ఉన్నాయని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. 2,171 ట్రెండ్స్‌తో మోదీ తొలి స్థానంలో నిలవగా.. మోదీకి అత్యంత సమీపంగా 2,137 ట్రెండ్స్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. తదుపరి స్థానాల్లో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారు. బ్రాండ్ స్కోర్ విషయంలోనూ 70 స్కోర్‌తో మోదీ తొలి స్థానంలో ఉన్నారు. సోషల్‌మీడియా వేదికలపై ఫాలోవర్స్, ట్రెండ్స్, సెంటిమెంట్స్, ఎంగేజ్మెంట్, మెన్షన్స్.. ఆధారంగా బ్రాండ్ స్కోర్‌ను నిర్ధారిస్తారు. ఈ స్కోర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 36.43 స్కోర్‌తో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తరువాత స్థానాల్లో, సోమవారం మరణించిన అస్సాం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ (31.89), అరుణాచల్ సీఎం పెమా ఖండూ (31.89), యూపీ సీఎం ఆదిత్యనాథ్(27.03) ఉన్నారు. బ్రాండ్ వ్యాల్యూ విషయంలోనూ మోదీనే తొలి స్థానంలో ఉన్నారు. ఆయన బ్రాండ్ వాల్యూ రూ. 336 కోట్లు. ఆ తరువాతి స్థానాల్లో అమిత్ షా(రూ. 335 కోట్లు), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(రూ. 328 కోట్లు) ఉన్నారు. బ్రాండ్ వాల్యూని ఫాలోవర్లు, ఎంగేజ్మెంట్స్, ట్రెండ్స్ ఆధారంగా నిర్ధారిస్తారు. అనంతరం ఆ వాల్యూ నుంచి వ్యతిరేక కామెంట్ల, వ్యతిరేక సెంటిమెంట్ల వాల్యూని తగ్గిస్తారు. ‘ప్రధాని మోదీపై 25% వ్యతిరేక సెంటిమెంట్ ఉన్నప్పటికీ.. ఎంపిక చేసిన 95 మంది రాజకీయ నేతల్లో ఆయన బ్రాండ్ వాల్యూనే అత్యధికంగా ఉంది’ అని ‘చెక్‌బ్రాండ్’ మేనేజింగ్ డైరెక్టర్ అనూజ్ సాయల్ తెలిపారు. -
డిబేట్ తర్వాత పెరిగిన బైడెన్ ఆధిక్యం!
వాషింగ్టన్: తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ అనంతరం ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే ప్రత్యర్థి జోబైడెన్ పాపులారిటీ 14 పర్సంటేజ్ పాయింట్ల మేర పెరిగిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ సర్వే తెలిపింది. అధ్యక్ష రేసులోకి దిగిన తర్వాత బైడెన్‌కు ఇంత ఆధిపత్యం రావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం సర్వేలో బైడెన్‌కు 53 శాతం మద్దతు లభించగా, ట్రంప్‌నకు 39 శాతం మద్దతు దక్కింది. సెప్టెంబర్ 20 సర్వేతో పోలిస్తే బైడెన్‌కు 6 పాయింట్ల ఆధిపత్యం పెరిగింది. ట్రంప్‌నకు కరోనా నిర్థారణ ప్రకటనకు ముందు ఈ సర్వే నిర్వహించారు. డిబేట్లో బైడెన్ అదరగొట్టాడని సర్వేలో 50 శాతం మంది అభిప్రాయపడ్డారు. 24 శాతం మంది ట్రంప్‌దే హవా అని పేర్కొనగా 17 శాతం మంది ఇద్దరిలో ఎవరూ ఆధిపత్యం ప్రదర్శించలేదని అన్నారు. ఓటింగ్‌లో తమపై డిబేట్ ప్రభావం ఉండదని సర్వేలో 73 శాతం మంది చెప్పారు. ఎప్పటిలాగే ట్రంప్ ప్రత్యర్ధిని బెదిరించారని ఎక్కువమంది భావించారు. -
ప్రధానిగా మోదీకి డిస్టింక్షన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తిరుగులేని ప్రజాదరణ ఉందని మరోసారి తేలింది. ప్రధానిగా మోదీనే అత్యుత్తమం అని ‘ఇండియా టుడే – కార్వీ ఇన్సైట్స్ మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే తాజాగా తేల్చింది. ప్రధానిగా మోదీ పనితీరు అద్భుతంగా ఉందని సర్వేలో పాల్గొన్నవారిలో 30% మంది, బావుందని 48%, సాధారణంగా ఉందని 17% అభిప్రాయపడ్డారు. 5% మాత్రం మోదీ పనితీరు బాగాలేదన్నారు. ఒకవైపు, దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా, మరోవైపు, దేశ ఆర్థిక రంగ కుంగుబాటు, ఇంకోవైపు చైనాతో తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు నెలకొన్న క్లిష్ట సమయంలో జరిగిన ఈ సర్వేలో.. దేశ ప్రజలు మోదీపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేయడం గమనార్హం. ఫిబ్రవరి 2016 – ఆగస్టు 2020 మధ్య నిర్వహించిన 10 సర్వేలను పోలిస్తే.. మోదీకి ప్రజాదరణ గణనీయంగా పెరగడం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానమంత్రిగా మోదీని ప్రజలు డిస్టింక్షన్లో పాస్ చేసినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి çఏడాదైన విషయం తెలిసిందే. మోదీ ప్రజాదరణ గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో అత్యధికంగా(4 పాయింట్ స్కేల్‌పై 3.14గా) ఉంది. ప్రాంతాల వారీగా చూస్తే ఉత్తర భారతంలో 4 పాయింట్ స్కేల్‌పై 3.01గా, తూర్పు భారత్‌లో 3.02గా, దక్షిణ భారతంలో 2.99గా ఉంది. మతాల వారీగా చూస్తే హిందువుల్లో 3.13, ముస్లింల్లో 2.33 గా మోదీపై ప్రజాదరణ ఉంది. కులాలవారీగా మోదీ ఓబీసీ, ఎంబీసీల్లో అత్యధికంగా 3.08, దళితుల్లో 3.01, అగ్రవర్ణాల్లో 2.99 స్కోరు సాధించడం గమనార్హం. ప్రతిపక్షంగా కాంగ్రెస్ పనితీరు చాలా బావుందని కేవలం 9% మంది అభిప్రాయపడగా, బావుందని 35%, సాధారణమని 32%, బాగాలేదని 21% మంది తెలిపారు. కాంగ్రెస్‌కు పునర్వైభవం తీసుకురాగలిగే నేత రాహుల్ గాంధీయేనని 23% మంది పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రియాంకాగాంధీకి 14%, మన్మోహన్ సింగ్‌కు 18%, సోనియా గాంధీకి 14% మంది ఓటేశారు. సర్వే లోని ఇతర ముఖ్యాంశాలు.. ► కరోనా తమను తీవ్రంగా దెబ్బతీసిందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. ఆదాయం పూర్తిగా పడిపోయిందని 63%, ఉద్యోగం/వ్యాపారం పోయిందని 22%, పెద్దగా మార్పేమీ లేదన్న వారు 15%. ► ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ కూటమికి 316 సీట్లు..కాంగ్రెస్ కూటమికి 93, ఇతరులకు 134 సీట్లు వస్తాయి. ► మోదీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారు పనితీరు చాలా బావుందని 24%, బావుందని 48%, సంతృప్తి కానీ, అసంతృప్తి కానీ లేదని 19%, అసంతృప్తి అని 8%, ఏమీ చెప్పలేమని 1% చెప్పారు. ► మోదీ ప్రభుత్వ అతిపెద్ద విజయం జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు అని 16%, రామ మందిర నిర్మాణంపై సుప్రీంకోర్టు తీర్పు అని 13% అభిప్రాయం వ్యక్తం చేశారు. అవినీతిరహిత పాలన అని 9%, మౌలిక వసతుల వృద్ధి అని 11% అభిప్రాయపడ్డారు. ► కరోనాను సరిగ్గా నియంత్రించలేకపోవడం మోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యమని 25%, నిరుద్యోగమని 23%, వలస కార్మికుల సంక్షోభమని 14% మంది తెలిపారు. ► ఆర్థిక రంగ పునరుత్తేజానికి కేంద్రం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజీ తమ ఆర్థిక స్థితిగతులను మారుస్తుందని 55% మంది విశ్వాసం వ్యక్తం చేయడం విశేషం. ► లాక్‌డౌన్‌తో ప్రభుత్వం చెప్పినట్లు లక్షలాది ప్రాణాలు నిలిచాయన్నది వాస్తవమని 34% మంది తెలిపారు. ఆర్థిక తిరోగమనానికి దారి తీసిందని 25%..ఆర్థిక తిరోగమనానికి దారితీసినా ఎక్కువ ప్రాణాలు కాపాడిందని 38% మంది చెప్పారు. ► వలస కార్మికుల దుస్థితికి బాధ్యులు.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అని 43%, రాష్ట్ర ప్రభుత్వాలు అని 14%, యాజమాన్యాలు అని 13%, సరైన సమాచారం లేకపోవడం అని 12%, కేంద్రం అని 10%, చెప్పలేమని 8% మంది చెప్పారు. ► తూర్పు లద్దాఖ్‌లో చైనాకు సరైన గుణపాఠం చెప్పిందని 69%, సరిగ్గా వ్యవహరించలేదని 15%, ప్రభుత్వం సమాచారం దాచి పెట్టిందని 10% తెలిపారు. ► చైనా వస్తువుల బహిష్కరణకు 90 శాతం మంది మద్దతు పలికారు. 7 శాతం మంది నో అన్నారు. చైనా యాప్స్‌ను నిషేధించడం, కాంట్రాక్టులు రద్దు చేయడం సరైన విధానమేనని 91% స్పష్టం చేశారు. ► కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ పనితీరు అత్యుత్తమంగా ఉందని 8%, బావుందని 33%, యావరేజ్ అని 35%, బాగాలేదని 20% మంది చెప్పారు. ► పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతిస్తామని 50% మంది స్పష్టం చేశారు. బెస్ట్ పీఎం మోదీయే.. అత్యుత్తమ భారత ప్రధాని ఎవరన్న ప్రశ్నకు.. 44% మోదీకి, 14% వాజ్‌పేయికి, 12% ఇందిరా గాంధీకి, 7% నెహ్రూకి, 7% మంది మన్మోహన్‌కు ఓటేశారు. తదుపరి ప్రధానిగా 66% మోదీనే ఎన్నుకున్నారు. 8% రాహుల్‌కి, 5% సోనియాకి, 4% అమిత్‌షాకు ఓటేశారు. -
దేశీ యాప్స్ హుషారు..
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన 59 యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో దేశీ యాప్స్‌కి ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. షేర్‌చాట్, రొపొసొ, చింగారీ మొదలైన యాప్స్ డౌన్లోడ్లు, యూజర్ సైన్ అప్స్ పెరిగాయి. గడిచిన రెండు రోజుల్లో భారీ వృద్ధి నమోదు చేసినట్లు ప్రాంతీయ భాషల్లోని సోషల్ మీడియా ప్లాట్‌ఫాం షేర్‌చాట్ వెల్లడించింది. నిషేధం విధించిన సోమవారం సాయంత్రం నుంచి గంటకు 5 లక్షల డౌన్లోడ్స్ చొప్పున 1.5 కోటి పైచిలుకు డౌన్లోడ్స్ నమోదయ్యాయని వివరించింది. షేర్‌చాట్ ఉపయోగాల గురించి యూజర్లు విస్తృతంగా తెలుసుకుంటున్నారని, ఇది తమకు మరింత ఊతమివ్వగలదని సంస్థ సహ వ్యవస్థాపకుడు ఫరీద్ ఎహ్సాన్ తెలిపారు. చైనా యాప్స్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ ఒక లక్ష పైగా పోస్టులు, వాటికి పది లక్షల మందికి పైగా యూజర్ల నుంచి లైక్‌లు వచ్చినట్లు పేర్కొన్నారు. 15 ప్రాంతీయ భాషల్లో షేర్‌చాట్‌కు 15 కోట్ల మంది పైగా రిజిస్టర్డ్ యూజర్లు, 6 కోట్ల మంది దాకా నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. రాకింగ్ రొపొసొ... ఇక, టిక్‌టాక్ యూజర్లలో చాలా మంది తమ యాప్‌వైపు మళ్లుతున్నట్లు షార్ట్ వీడియో యాప్ రొపొసొ వెల్లడించింది. ఇన్మొబీ గ్రూప్‌నకు చెందిన రొపొసొ 12 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉండగా, 6.5 కోట్ల మేర డౌన్లోడ్స్ ఉన్నాయి. 1.4 కోట్ల వీడియో క్రియేటర్లు, ప్రతి నెలా 8 కోట్ల పైచిలుకు వీడియోలు తమ ప్లాట్‌ఫాంపై రూపొందుతున్నాయని రొపొసొ సహ వ్యవస్థాపకుడు మయాంక్ భంగాడియా తెలిపారు. నైపుణ్యాలున్న భారతీయులందరూ వేగంగా వృద్ధిలోకి వచ్చేందుకు తోడ్పడాలన్న ఉద్దేశంతో రొపొసొని ఏర్పాటు చేసినట్లు వివరించారు. అటు టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్న చింగారీ యాప్ వినియోగం కూడా కొద్ది వారాలుగా గణనీయంగా పెరిగింది. గడిచిన 10 రోజుల్లో డౌన్లోడ్స్ సంఖ్య 5.5 లక్షల నుంచి ఏకంగా 25 లక్షలకు పెరిగింది. బాక్స్ఎన్గేజ్కు 10 రెట్లు స్పందన.. చైనా యాప్స్‌పై నిషేధం విధించిన 24 గంటల వ్యవధిలో తమ వెబ్సైట్ యాక్టివ్ యూజర్ల సంఖ్య పది రెట్లు పెరిగిందని, ఒక లక్ష పైగా చేరుకుందని బాక్స్ఎంగేజ్డాట్కామ్ వెల్లడించింది. కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ సమయంలో ఇది ప్రారంభమైంది. వీడియో షేరింగ్, డిజిటల్ సర్వీసులు మొదలైనవి ఈ ప్లాట్‌ఫాం అందిస్తోంది. ప్రస్తుతానికి పోర్టల్‌కు మాత్రమే పరిమితమైనా, త్వరలో మొబైల్ యాప్ కూడా ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ పేర్కొంది. ఇక హ్యాప్రాంప్కు చెందిన గోసోషల్ అనే సోషల్ నెట్వర్కింగ్ సొల్యూషన్కి గడిచిన కొద్ది రోజుల్లో యూజర్ల సంఖ్య 20 శాతం ఎగిసింది. ప్రస్తుతం దీనికి 80,000 పైచిలుకు యూజర్లు ఉన్నారు. హ్యాప్రాంప్లో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇన్వెస్ట్ చేశారు. దేశీ యాప్స్ డౌన్లోడ్లు భారీగా ఎగిసినా ఇది తాత్కాలికం మాత్రమేనని, దీన్ని దీర్ఘకాలికంగా నిలబెట్టుకునేందుకు వ్యవస్థాపకులు గట్టి ప్రణాళికలు వేసుకోవాల్సి ఉంటుందని సంస్థ వ్యవస్థాపకుడు శుభేంద్ర విక్రం తెలిపారు. అటు చైనా యాప్స్‌పై నిషేధం విధించిన 24 గంటల్లో సోషల్ మీడియా యాప్ ట్రెల్ ప్లాట్‌ఫాంపై ట్రాఫిక్ 500 శాతం పెరిగింది. అటు డిజిటల్ ఆడియో ప్లాట్‌ఫాం ఖబ్రీ రోజువారీ డౌన్లోడ్స్ 80 శాతం పెరిగింది. దేశీ డెవలపర్లకు మంచి చాన్స్.. టిక్‌టాక్‌పై నిషేధంతో 20 కోట్ల మంది పైచిలుకు భారతీయ యూజర్లు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారని కన్సల్టెన్సీ సంస్థ గార్ట్నర్ సీనియర్ రీసెర్చి డైరెక్టర్ నవీన్ మిశ్రా తెలిపారు. ‘అలాంటి భారీ ప్లాట్‌ఫాం రూపొందించే దిశగా భారతీయ డెవలపర్లకు ఈ నిషేధంతో మంచి అవకాశాలు దొరికినట్లయింది. ఇలాంటి పలు యాప్స్ ప్రస్తుతం ప్రారంభ స్థాయిలో ఉన్నాయి. భారతీయ వినియోగదారులిక వీటిని మరింత ఉధృతంగా వాడే అవకాశం ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఇక లక్షలకొద్దీ యువ యూజర్లు, బ్రాండ్లను తమ ప్లాట్‌ఫామ్స్‌వైపు ఆకర్షించేందుకు దేశీ సంస్థలకు ఇది మంచి అవకాశమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అంతర్జాతీయ దిగ్గజాల్లాగే స్థానిక డెవలపర్లకు కూడా అవకాశాలు దొరుకుతాయని పేర్కొన్నాయి. -
సోనియా కంటే రాహులే పాపులర్
న్యూఢిల్లీ: ఓ వైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాపులారిటీ తగ్గుతుండగా, మరోవైపు రాహుల్ గాంధీ పాపులర్ అవుతున్నారని ఐఏఎన్ఎస్–సీఓటర్ రిపబ్లిక్ డే ‘స్టేట్ ఆఫ్ నేషన్’ సర్వే వెల్లడించింది. ఈ నెల 25 వరకూ గత 12 వారాలుగా ఈ సర్వే కొనసాగిందని నిర్వాహకులు ఆదివారం తెలిపారు. 543 పార్లమెంటు నియోజకవర్గాల్లో 30,240 మంది పౌరుల అభిప్రాయాలతో ఈ సర్వే చేపట్టారు. ఇందులో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ సంతృప్తికరంగా పని చేస్తున్నట్లు 49.5% మంది అభిప్రాయపడ్డారు. అందులో తెలంగాణాలో 50.5% మంది, కేరళలో 43.3% మంది, ఆంధ్రప్రదేశ్‌లో 37.9% మంది ఆమె పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో 14.5% మంది సంతృప్తి వ్యక్తం చేశారు. తల్లికంటే ముందంజలో తనయుడు.. కేరళలోని వయానాడ్ నుంచి ఎంపీగా గెలిచిన రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలో మంచి పాపులారిటీ దక్కించుకున్నారు. 51.9% మంది ఆయన పట్ల చాలా సంతృప్తిగా ఉన్న్టట్లు సర్వే తెలిపింది. పుదుచ్చేరిలో ఏకంగా 76% మంది చాలా సంతృప్తికంగా ఉన్నారు. మరోవైపు హరియాణాలో రాహుల్ పట్ల కేవలం 17.7%మంది సంతృప్తిగా ఉన్నారు. ప్రధానికి రాజ్యాంగం ప్రతిని పంపిన కాంగ్రెస్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీకి కాంగ్రెస్ వినూత్న బహుమతిని పంపింది. భారత రాజ్యాంగం ప్రతిని మోదీకి పంపినట్లు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సమయం దొరికినప్పుడు ఈ ప్రతిని చదవాలని ప్రధానికి సూచించింది. ‘ప్రియమైన ప్రధాని మోదీ గారికి.. కాంగ్రెస్ పార్టీ తరఫున దేశ రాజ్యాంగ ప్రతిని పంపుతున్నాము. దేశాన్ని విభజించాలనుకునే ముందు దీనిని తప్పకుండా చదవండి’అని పేర్కొంది. వీటితో పాటు అమెజాన్‌లో రాజ్యాంగ ప్రతిని కొన్న ఫొటోను కూడా ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ నేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యాంగ ప్రవేశికను చదువుతోన్న వీడియోలను సైతం కాంగ్రెస్ ట్వీట్ చేసింది. -
ఇంతకు ‘పాడ్‌క్యాస్ట్’ అంటే ఏమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : నేటి ఆధునిక సాంకేతిక రంగంలో వీడియో, ఆడియోలు విజ్ఞానంతోపాటు వినోదం ఇచ్చే అద్భుత అంశాలుగా మారిన విషయం తెల్సిందే. అందుకే ఈ రెండింటిని తోబుట్టువులుగా అభివర్ణిస్తారు. ముందుండి వీడియో రంగం దారి చూపుతుంటే వెనకాల వెన్నంటి ఆడియో రంగం అనుసరిస్తోంది. ఇంటర్నెట్ మందగమనం వల్ల కూడా అప్పుడప్పుడు ఆడియోకు అదృష్టం కలిసొస్తోంది. ఆడియో సంగీతం అలా అభివృద్ధిలోకి వచ్చిన విషయం తెల్సిందే. స్టాక్‌హోమ్ కేంద్రంగా పనిచేస్తోన్న ఓ కంపెనీ సంగీతం అందించేందుకు ‘స్పాటిఫై’ యాప్‌ను గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టగా, దానికి పోటీగా మూడు వారాల్లోనే ‘యూట్యూబ్ మ్యూజిక్’ భారత్‌లో ప్రవేశించింది. అప్పటికే రంగప్రవేశం చేసిన ఆపిల్, అమెజాన్ మ్యూజిక్, గానా, జియోసావన్, హంగామా యాప్‌ల మధ్య పోటీ తీవ్రమైంది. సరిగ్గా ఈ సమయంలోనే ‘పాడ్‌క్యాస్ట్’ ఆడియో విభాగానికి ఆదరణ పెరిగుతూ వచ్చింది. ప్రస్తుతం దేశంలో 50 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉండగా, కేవలం నాలుగు కోట్లమందే పాడ్‌క్యాస్ట్ శ్రోతలు ఉన్నారు. అయినా ఇది మంచి పెరుగుదలగానే చెప్పవచ్చు. ఒక్క 2018లోనే ఈ రంగం 60 శాతం వృద్ధి రేటును సాధించింది. ఇంతకు ‘పాడ్‌క్యాస్ట్’ అంటే ఏమిటీ? ఐప్యాడ్ ప్లస్ బ్రాడ్‌క్యాస్ట్ కలిపి ‘పాడ్‌క్యాస్ట్’ను సృష్టించారు. ఐప్యాడ్లను రూపొందించిన ఆపిల్ కంపెనీ దీనిపై పేటెంట్‌ను కోరకపోవడంతో పలు కంపెనీలు, వ్యక్తులు ‘పాడ్‌క్యాస్ట్’ పదాన్నే ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ఐప్యాడ్‌ను గుర్తుచేయడం ఇష్టంలేని వారు మాత్రం వీటిని ‘నెట్క్యాస్ట్’ అని వ్యవహరిస్తున్నారు. తొలుత డిజిటల్ ఆడియో ఫైల్స్‌తో మాత్రమే ఇవి మార్కెట్లోకి వచ్చాయి. కంపెనీల నుంచే కాకుండా ఓ వ్యక్తి నుంచి మరో వ్యక్తి లేదా యూజర్ ‘పాడ్‌క్యాస్ట్’ ద్వారా సమాచారాన్ని షేర్ చేసుకొనే అదనపు సౌకర్యం ఉంది. సైన్స్, సాంకేతిక రంగాలతోపాటు రాజకీయాల నుంచి సాంస్కృతిక, కళారంగాల వరకు, విజ్ఞానం నుంచి వినోదం వరకు సకల రంగాలకు చెందిన సమాచారాన్ని ‘పాడ్‌క్యాస్ట్’ ద్వారా గ్రహించవచ్చు. అంటే ఆయా రంగాలకు చెందిన సమాచారాన్ని ఇంతకు ముందు వ్యక్తులు, ఇప్పుడు వ్యక్తుల బృందం అందజేస్తోంది. వీటిని ప్రసారం చేయడానికి ‘యాంకర్’పాటు పలు యాప్‌లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. గూగుల్, యాపిల్ కంపెనీలు రూపొందిస్తున్న ‘పాడ్‌క్యాస్ట్’లను యాంకర్ యాప్ ద్వారానే ప్రసారం అవుతున్నాయి. 2004 సంవత్సరం నాటికి ఇంగ్లీషులో కొన్ని పాడ్క్యాస్ట్లే ఇంటర్నెట్లో అందుబాటులోకి రాగా, నేడు లక్షా యాభై వేల వరకు అందుబాటులో ఉన్నాయి. ఇతర భాషలకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు. ఇప్పుడు వీడియో పాడ్‌క్యాస్ట్‌లను ‘యూప్ట్యూబ్’ ప్రసారం చేస్తోంది. వీటిని నెట్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో ఇష్టం ఉన్నప్పుడు చూసే అవకాశం కూడా ఉంది. నచ్చే పాడ్‌క్యాస్ట్‌లను ముందుగానే ఎంపిక చేసుకుంటే ఆటోమేటిక్‌గా కూడా డౌన్లోడ్ అవుతాయి. డబ్బులు కూడా వస్తాయి ? మనుషుల అభిరుచులకు తగ్గట్టుగా విజ్ఞానం, వినోదాన్ని పంచడంతోపాటు వివిధ భాషలు, సంగీతాన్ని నేర్పే ‘పాడ్‌క్యాస్ట్’లు కూడా నేడు అందుబాటులోకి వచ్చాయి. కమేడియన్లకు కూడా ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. నేడు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రైవేటు రేడియో కంపెనీలు కూడా ఇప్పుడు ఈ రంగంలో పోటీ పడుతున్నాయి. వీటికి శ్రోతలు లేదా వీక్షకులు సబ్‌స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. సబ్స్క్రైబ్లనుబట్టి పాడ్‌క్యాస్ట్ నిర్మాతలకు యాడ్స్ రూపంలో డబ్బులు వస్తాయి. వాటిల్లో 30 శాతం రెవెన్యూను నేడు వాటి ‘ప్రసార మాద్యమాలే’ లాగేసుకుంటున్నాయి. పాడ్‌క్యాస్ట్‌ల ద్వారా యాంకర్లు కూడా సెలబ్రిటీలుగా మారుతున్నారు. సంగీతాన్ని అందించే ‘స్పాటిఫై’ ఈ రంగంలోకి ప్రవేశించి ‘లవ్ ఆజ్ కల్’ పాడ్‌క్యాస్ట్‌ను ప్రసారం చేయడంతో దాని యాంకర్లయిన ఆస్థా, అంకిత్‌లు సెలబ్రిటీలుగా మారిపోయారు. వారికి సోషల్ మీడియాలో ఫ్యాన్‌ఫాలోయింగ్ కూడా పెరిగింది. ‘ఓయో గదుల్లో సెక్స్ సురక్షితమా, కాదా ?’ లాంటి ప్రశ్నలే ఎక్కువగా వారికి వస్తుంటాయి. అది వేరే విషయం. కరన్ జోహర్, కరీనాకపూర్ అతిథేయులుగా విడుదల చేసిన పాడ్‌క్యాస్ట్‌లకు మంచి ఆదరణ ఉంది. కంపెనీల పరంగా ఆపిల్ కంపెనీ విడుదల చేస్తోన్న పాడ్‌క్యాస్ట్‌లకు 30 నుంచి 35 శాతం ఆదరణ ఉండగా, క్యాస్ట్బాక్స్ కంపెనీకి పది నుంచి పన్నెండు శాతం ప్రజాదరణ ఉంది. వీటిని వింటున్న, వీక్షిస్తున్న వారంతా 18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్య వయస్కులే. వీటిద్వారా వ్యక్తిగత టాలెంట్లు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ రంగంలో ముందుండాల్సిన మీడియానే వెనకబడింది. -
ఎండకాలం పండ్లోయ్!
వేసవి అనగానే సాధారణంగా అందరికీ గుర్తొచ్చేవి మామిడి పండ్లు. పండ్లలో రారాజుగా ప్రసిద్ధి పొందిన మామిడి మన జాతీయ ఫలం. అంతమాత్రాన వేసవిలో కేవలం మామిడి పండ్లు మాత్రమే తింటారనేం కాదు.వేసవిలో మామిడితో పాటు రకరకాల ఇతర ఫలాలూ విరివిగా దొరుకుతాయి. మామిడి పండ్లు అమిత జనాదరణ పొందినప్పటికీ, వేసవిలో విరివిగా దొరికే మిగిలిన ఫలాలను కూడా జనాలు బాగా ఆస్వాదిస్తారు. వేసవి సందర్భంగా మామిడి గురించి, మరిన్ని వేసవి ఫలాల గురించి మీ కోసం... మామిడి మామిడి పండ్లను దాదాపు ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తారు. మామిడి ఉత్పాదనలో మాత్రం మన భారతదేశానిదే అగ్రస్థానం. మామిడిలో దాదాపు వందకు పైగా రకాలు ఉన్నాయి. మామిడికి దాదాపు నాలుగువేల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. పోర్చుగీసుల ద్వారా మామిడి భారత్‌లోకి అడుగుపెట్టినట్లు కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే, మామిడి చెట్లు దాదాపు రెండున్నర కోట్ల నుంచి మూడు కోట్ల ఏళ్ల కిందటే ఉనికిలో ఉండేవని శిలాజాల ఆధారాల వల్ల తెలుస్తోంది. భారత్, బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక ప్రాంతాల్లో పురాతన కాలం నుంచే మామిడి చెట్లు ఉండేవని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. వేదాలలో, పురణాలలో మామిడి ప్రస్తావన కనిపిస్తుంది. పూజలు, ఇతర శుభకార్యాలు జరిపేటప్పుడు ఇళ్ల ముంగిళ్లకు, దేవాలయాల ద్వారాలకు మామిడాకుల తోరణాలు కట్టడం సనాతన కాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మామిడి కాయలతో ఆవకాయ, మాగాయ వంటి నిలవ పచ్చళ్లు తయారు చేసుకుని, ఏడాది పొడవునా ఉపయోగించడం శతాబ్దాలుగా భారతీయులకు అలవాటే. ఆయుర్వేద వైద్యంలోనూ మామిడికి చాలా ప్రాధాన్యం ఉంది. మామిడి కాయలు, పండ్లతో పాటు ఆకులను, బెరడును, టెంకలోని జీడిని కూడా ఆయుర్వేద చికిత్సల్లో వినియోగిస్తారు. పచ్చి మామిడిని వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. ఉత్తర భారతదేశంలో పుల్లని పచ్చిమామిడి ముక్కలను బాగా ఎండబెట్టి, పొడిగా తయారు చేసి, ఈ పొడిని (ఆమ్చూర్) వంటకాల్లో ఉపయోగిస్తారు. తూర్పు భారత ప్రాంతంలో పచ్చి మామిడి ముక్కలను ఎండబెట్టి, ఒరుగులుగా తయారు చేసి, ఏడాది పొడవునా వంటకాల్లో ఉపయోగిస్తారు. వేసవిలో మామిడి పండ్లను తినడానికి పిల్లలూ పెద్దలూ అందరూ అమితంగా ఇష్టపడతారు. భారత్ సహా ఉష్ణమండల దేశాల్లో విరివిగా పండే మామిడి ఇతర శీతల దేశాలకూ విరివిగా ఎగుమతి అవుతోంది. మామిడిలో బంగినపల్లి, రసాలు, సువర్ణరేఖ, ఆల్ఫోన్సా, గోవా, కీసర, లంగ్డా, సఫేదా, మల్గోబా వంటి రకాలు బాగా ప్రసిద్ధి పొందాయి. మామిడి పండ్ల గుజ్జుతో తాండ్ర తయారు చేస్తారు. ఏడాది పొడవునా మామిడి రుచిని ఆస్వాదించాలనుకునే వారికి తాండ్ర ఒక చక్కని ప్రత్యామ్నాయం. మామిడి పండ్ల రసాన్ని, జామ్‌ను నిల్వ ఉంచేలా సీసాల్లో నింపి విక్రయించడం కూడా గత కొన్ని దశాబ్దాలుగా బాగా వాడుకలోకి వచ్చింది. నిల్వ ఉంచే పద్ధతుల ఫలితంగా మామిడి రుచులు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటూనే ఉన్నాయి. అయినా, వేసవిలో తాజా మామిడి పండ్లను తినడంలో ఉన్న మజానే వేరు. అందుకే మామిడి రుచుల కోసం అందరూ వేసవి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మామిడిలో పోషకాలు మామిడిలో పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కొవ్వులు, ప్రొటీన్లు నామమాత్రంగా ఉంటాయి. మామిడి పండ్లలో విటమిన్–ఏ, విటమిన్–బి1, విటమిన్–బి2, విటమిన్–బి3, విటమిన్–బి5, విటమిన్–బి6, విటమిన్–బి9, విటమిన్–సి వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, జింకు వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. ఈత పండ్లు ఈత చెట్లు భారత ఉపఖండంతో పాటు మారిషస్, ప్యూయెర్టో రికో, కరీబియన్ తీరంలోని లీవార్డ్ దీవుల్లోను విరివిగా కనిపిస్తాయి. రుచిలో దాదాపు ఖర్జూరాన్ని తలపించే ఈత పండ్లు వేసవిలో విరివిగా పండుతాయి. ఖర్జూరాలలో గింజ చిన్నగా ఉండి గుజ్జు ఎక్కువగా ఉంటే, ఈత పండ్లలో గింజ పెద్దదిగా ఉండి, గుజ్జు కాస్త తక్కువగా ఉంటుంది. రుచిలో ఖర్జూరాన్ని తలపిస్తాయి కనుకనే వీటిని ‘ఇండియన్ వైల్డ్ డేట్స్’ అని అంటారు. వేసవిలో ఈతపండ్లను కాలక్షేపంగా తినడానికి పిల్లలూ పెద్దలూ ఇష్టపడతారు. ఈత పండ్ల గుజ్జుతో జెల్లీ తయారు చేసి, ఏడాది పొడవునా నిల్వ ఉంచుతారు. అలాగే, ఈతపండ్ల గుజ్జుతో వైన్ కూడా తయారు చేస్తారు. ఈత చెట్టు కాండానికి పైభాగంలో గాటు పెట్టి, దాని నుంచి కారే ద్రవాన్ని పులియబెట్టి కల్లుగా తయారు చేసి తాగుతారు. ఈ ద్రవాన్ని పులియబెట్టకుండా నేరుగా మరిగించి, దానితో ఈతబెల్లం తయారు చేస్తారు. చెరకు బెల్లం కంటే ఈత బెల్లంలో చక్కెర స్థాయి కాస్త తక్కువగా ఉంటుంది. పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌లలో ఈతబెల్లం వాడుక ఎక్కువ. ఈత చెట్లకు పుట్టినిల్లు మన భారతదేశమేనని పరిశోధకులు చెబుతున్నారు. పోషకాల కోసం ఖర్జూరంపై ఆధారపడలేని వాళ్లకు ఈతపండ్లు చౌకైన ప్రత్యామ్నాయం. ఈతపండ్లలో పోషకాలు ఈత పండ్లలో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. కొవ్వులు, ప్రొటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. ఈతపండ్లలో విటమిన్–ఎ, విటమిన్–బి1, విటమిన్–బి2, విటమిన్–బి3, విటమిన్–బి6, విటమిన్–బి9, విటమిన్–సి వంటి విటమిన్లు, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింకు వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. తాటి ముంజెలు వేసవిలో మామిడిపండ్ల తర్వాత గుర్తొచ్చేవి తాటి ముంజెలు. ఏపుగా దాదాపు ముప్పయి మీటర్ల పొడవున పెరిగే తాటి చెట్లు ఆసియా, ఆఫ్రికా దేశాల్లో విరివిగా కనిపిస్తాయి. ఏటా వేసవిలో తాటికాయలు విరివిగా కాస్తాయి. దృఢమైన తాటికాయలలోని ముంజెలు మాత్రం చాలా మెత్తగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. వేసవి తాపం నుంచి ఉపశమనానికి పిల్లలూ పెద్దలూ తాటి ముంజెలను తినడానికి ఇష్టపడతారు. తాటి ముంజెలు తక్షణ శక్తినిస్తాయి. డీహైడ్రేషన్ నుంచి రక్షణనిస్తాయి. వీటిలో తక్కువ కేలరీలు ఉండటంతో బరువును అదుపులో ఉంచుతాయి. తాటిచెట్టు కాండానికి పైభాగంలో గాటు పెట్టి, దానిని వచ్చే రసాన్ని సేకరిస్తారు. దీనిని పులియబెట్టి కల్లు తయారు చేస్తారు. పులియబెట్టకుండా, దీనిని నేరుగా మరిగించి, తాటిబెల్లాన్ని తయారు చేస్తారు. చక్కెరశాతం తక్కువగా ఉండే తాటిబెల్లం మధుమేహ రోగులకు మంచిదని చెబుతారు. పశ్చిమ బెంగాల్, కేరళ వంటి ప్రాంతాల్లో తాటిబెల్లాన్ని మిఠాయిల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఇండోనేసియాలో తాటి చక్కెరను కూడా తయారు చేస్తారు. తాటిముంజెల్లో పోషకాలు తాటి ముంజెల్లో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. చక్కెరలు, కొవ్వులు, ప్రొటీన్లు తక్కువగా ఉంటాయి. విటమిన్–ఎ, విటమిన్–బి1, విటమిన్–బి2, విటమిన్–బి3, విటమిన్–బి6, విటమిన్– బి9, విటమిన్–సి వంటి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. పనసపండ్లు పనసపండ్లు పరిమాణానికి భారీగా ఉంటాయి. పైకి గరుకుగా కనిపించే పనసపండ్లు చూడటానికి అంత ఆకర్షణీయంగా కనిపించవు. వీటిని కోసి చూస్తే మాత్రం, వీటిలోని తొనల పరిమళం గుప్పున వ్యాపించి, నోరూరిస్తుంది. పనస పండ్ల దిగుబడి సాధారణంగా వేసవి ప్రారంభం నుంచే మొదలవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇవి వేసవి మొదలుకొని వర్షాకాలం వరకు దొరుకుతాయి. రుచికి బాగా తీపిగా ఉండే పనస తొనలను తినడానికి అందరూ ఇష్టపడతారు. పనస చెట్లు ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో విరివిగా పెరుగుతాయి. పనసను తొలుత మలేసియా, జావా, బాలి ప్రాంతాలకు చెందిన వారు పెంచి ఉంటారని చరిత్రకారుల అభిప్రాయం. ఇది పోర్చుగీసుల ద్వారా భారత్‌కు చేరుకుందని కూడా చెబుతారు. భారతీయులు ఎక్కువగా పనస తొనలను నేరుగా తింటారు. కొన్ని దేశాల్లో పనస తొనలతో మిఠాయిలు, జ్యూస్, కేకులు, ఐస్‌క్రీమ్ వంటివి కూడా తయారు చేస్తారు. ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో పనస తొనలను ముక్కలుగా తరిగి, తురిమిన మంచుతో కలిపి తింటారు. దక్షిణ భారతదేశంలో పనసపొట్టు కూర చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో పనస గింజలను కూడా వంటకాల్లో వాడతారు. కేరళలో పనసతొనల తురుమును నేతిలో వేయించి, బెల్లంతో కలిపి ‘చక్కవరట్టి’ అనే జామ్‌లాంటి పదార్థాన్ని తయారు చేస్తారు. దాదాపు ఆరు నుంచి పది నెలలు నిల్వ ఉండే ఈ పదార్థంతో ‘అడ’ అనే పిండివంటకాన్ని తయారు చేస్తారు. పనసపండ్లలో పోషకాలు పనసపండ్లలో పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కొద్ది పరిమాణంలోని కొవ్వులు, ప్రొటీన్లు ఉంటాయి. విటమిన్–ఎ, విటమిన్–బి1, విటమిన్–బి2, విటమిన్–బి3, విటమిన్–బి5, విటమిన్–బి6, విటమిన్–బి9, విటమిన్–సి, విటమిన్–ఇ వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, మాంగనీస్, జింకు వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. కర్బుజాపండ్లు వేసవి తాపం నుంచి ఉపశమనానికి పుచ్చకాయల తర్వాత కర్బూజా పండ్లనే విరివిగా ఉపయోగిస్తారు. వీటి పైతోలు కొంచెం గరుకుగా, మందంగా ఉన్నా, లోపలి గుజ్జు మాత్రం చాలా మెత్తగా ఉంటుంది. కర్బూజాలోని కొన్ని రకాల్లో పైతోలు పలుచగా ఉంటుంది. కర్బూజా పండ్లు పక్వానికి వచ్చేటప్పుడు ఒకరకమైన వాసన వెదజల్లుతాయి. ఈ వాసన కస్తూరి జింక (మస్క్ డీర్) నుంచి వచ్చే వాసనను పోలి ఉండటంతో కర్బూజాకు ఇంగ్లిష్‌లో ‘మస్క్ మెలన్’ అనే పేరు వచ్చింది. దాదాపు నాలుగువేల ఏళ్ల కిందటే ఆఫ్రికాలో కర్బూజాను సాగు చేసేవారు. ప్రాచీన గ్రీకు, రోమన్ సామ్రాజ్యాల్లోనూ కర్బూజాను పండించేవారు. ఇరాన్, ఆర్మీనియా, అఫ్ఘానిస్తాన్, తుర్కుమెనిస్తాన్, వాయవ్య భారత ప్రాంతంలో కర్బూజాను విరివిగా పండిస్తారు. భారత ఉపఖండ ప్రాంతం నుంచి కర్బూజా చైనా, పర్షియా తదితర ప్రాంతాలకు విస్తరించింది. కర్బూజా ముక్కలను నేరుగా తినడంతో పాటు, కర్బూజా రసాన్ని, ఫ్రూట్ సలాడ్, ఐస్‌క్రీమ్స్ వంటి వాటిని తీసుకుంటారు. కర్బూజా పండ్లలో పోషకాలు కర్బూజా పండ్లలో ఎక్కువగా నీరు, స్వల్పంగా పిండి పదార్థాలు, చక్కెరలు ఉంటాయి. కొవ్వులు, ప్రొటీన్లు నామమాత్రంగా ఉంటాయి. కర్బూజా పండ్లలో విటమిన్–ఎ, బీటా కెరోటిన్, విటమిన్–సి పుష్కలంగా ఉంటాయి. క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. నేరేడు పండ్లు ముదురు ఊదా రంగులో నిగనిగలాడుతూ కనిపించే నేరేడు పండ్లను చాలామంది ఇష్టంగా తింటారు. కొంత తీపి, పులుపు, కాస్త వగరుగా ఉండే నేరేడు పండ్లను మధుమేహ చికిత్సలో విరివిగా వాడతారు. ఆయుర్వేద, యునానీ, చైనీస్ సంప్రదాయ వైద్య విధానాల్లో నేరేడు గింజలతోను, నేరేడు చెట్ల బెరడుతోను తయారు చేసిన ఔషధాలను ఉపయోగిస్తారు. నేరేడు భారత ఉపఖండ ప్రాంతంలో విరివిగా కనిపిస్తుంది. నేరేడు పండ్లను సాధారణంగా నేరుగానే తింటారు. కొన్ని ప్రాంతాల్లో నేరేడు గుజ్జుతో జామ్, జెల్లీ, జ్యూస్ వంటివి కూడా తయారు చేస్తారు. పోర్చుగీసు వర్తకుల ద్వారా నేరేడు విత్తనాలు దక్షిణ అమెరికాకు చేరుకున్నాయి. నేరేడు పండ్లలో పోషకాలు నేరేడు పండ్లలో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. నామమాత్రంగా కొవ్వులు ఉంటాయి. విటమిన్–బి1, విటమిన్–బి2, విటమిన్–బి3, విటమిన్–బి6, విటమిన్–సి వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయలు పుచ్చకాయలు నిజానికి ఏడాది పొడవునా దొరికినా, వేసవిలో మాత్రం వీటి వినియోగం అధికం. ఎక్కువ నీటితో ఉండే పుచ్చకాయలు తక్షణమే శక్తినిచ్చి, వేసవి తాపాన్ని తట్టుకునేలా చేస్తాయి. పరిమాణానికి ఇవి భారీగా కనిపించినా, వీటిని కోయడం చాలా తేలిక. కొయ్యగానే ఎర్రగా కనువిందు చేస్తూ, నోరూరించే పుచ్చకాయలను పిల్లలూ, పెద్దలూ అందరూ బాగా ఇష్టపడతారు. క్రీస్తుపూర్వం రెండువేల ఏళ్ల కిందట ఆఫ్రికాలో నైలునదీ తీరంలో విరివిగా పెరిగే పుచ్చకాయల మొక్కలు కాలక్రమంలో దేశదేశాలకు విస్తరించాయి. ఇవి క్రీస్తుశకం ఏడో శతాబ్దిలో భారత్‌కు, ఇక్కడి నుంచి పదో శతాబ్ది నాటికి చైనాకు చేరుకున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని ఉష్ణమండల దేశాలన్నింటిలోనూ పుచ్చకాయల సాగు విరివిగా సాగుతోంది. పుచ్చకాయల్లో దాదాపు 1200 రకాలు ఉన్నాయి. భారీగా కనిపించే పుచ్చకాయలు ఒక్కొక్కటి కనీసం కిలో నుంచి 90 కిలోల వరకు బరువు తూగుతాయి. పుచ్చకాయలను ఎక్కువగా నేరుగానే తింటారు. వీటి తాజా రసాన్ని, వీటితో తయారు చేసే శీతల పానీయాలను కూడా విరివిగా వినియోగిస్తారు. చైనాలో పుచ్చకాయల గుజ్జును ఎండబెట్టి, పిండిగా తయారు చేసి, దానిని వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. కొన్ని దేశాల్లో పుచ్చకాయ ముక్కలతో ఊరగాయలు, కూరలు కూడా చేసుకుంటారు. దక్షిణ రష్యాలో పుచ్చకాయ గుజ్జు, క్యాబేజీ తురుము కలిపి పులియబెట్టి తింటారు. పుచ్చకాయల్లో పోషకాలు పుచ్చకాయల్లో ఎక్కువగా నీరు స్వల్పంగా పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ప్రొటీన్లు, కొవ్వులు చాలా స్వల్పంగా ఉంటాయి. పుచ్చకాయల్లో విటమిన్–ఎ, విటమిన్–బి1, విటమిన్–బి2, విటమిన్–బి3, విటమిన్–బి5, విటమిన్–బి6, విటమిన్–సి వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింకు వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. సీమ చింతకాయలు సీమచింతలు వేసవి ప్రారంభంలోనే అందుబాటులోకి వస్తాయి. పిల్లలు ఎక్కువగా వీటిని కాలక్షేపం చిరుతిండిలా తినడానికి ఇష్టపడతారు. సీమచింతను ఎవరూ ప్రత్యేకంగా సాగు చేయరు. ఉష్ణమండల దేశాల్లోని అడవుల్లో, బంజరు నేలల్లో సీమచింత చెట్లు కనిపిస్తాయి. వీటి గుజ్జు సాధారణంగా తెల్లగా, అప్పుడప్పుడు గులాబిగా ఉంటుంది. చిరుతీపిగా ఉండే గుజ్జు రుచిగా ఉంటుంది. సీమచింతకాయలు చూడటానికి జిలేబీల్లా చుట్టలు చుట్టల్లా ఉంటాయి. అందుకే కాబోలు, ఉత్తరాదిలో వీటిని ‘జంగ్లీ జిలేబీ’ అంటారు. సీమచింత ఆకులను, చెట్టు బెరడును సంప్రదాయ చికిత్సల్లో ఉపయోగిస్తారు. సీమచింతకాయల్లో పోషకాలు సీమచింతకాయల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు, చక్కెరలు, పీచు పదార్థాలు ఉంటాయి. వీటిలో విటమిన్–ఎ, విటమిన్–బి1, విటమిన్–బి2, విటమిన్–బి6, విటమిన్–సి వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. లిచీ పండ్లు లిచీ పండ్లు చూడటానికి స్ట్రాబెర్రీ పండ్ల మాదిరిగా పైకి ఎర్రగా కనిపించినా, వీటి లోపలి గుజ్జు మాత్రం తాటి ముంజెల గుజ్జు మాదిరిగా మెత్తగా, తియ్యగా ఉంటుంది. వేసవిలో విరివిగా దొరికే లిచీ పండ్లు భారత ఉపఖండ ప్రాంతంతో పాటు దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా దక్షిణప్రాంత దేశాల్లో పండుతాయి. లిచీ పండ్ల గుజ్జును సాధారణంగా నేరుగానే తింటారు. ఈ గుజ్జును శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు, మిఠాయిల తయారీలో కూడా వాడతారు. లిచీ పండ్లలో పోషకాలు లిచీ పండ్లలో పిండి పదార్థాలు, చక్కెరలు, పీచు పదార్థాలు, విటమిన్–బి1, విటమిన్–బి2, విటమిన్–బి3, విటమిన్–బి6, విటమిన్–బి9, విటమిన్–సి, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. జీడిమామిడి మిగిలిన పండ్లన్నిటికీ గింజలు లోపల ఉంటే, దీనికి మాత్రం గింజ పండుకు బయట ఉంటుంది. ఆ గింజల నుంచే జీడిపప్పును సేకరిస్తారు. జీడిమామిడి గుజ్జు కొంత తియ్యగా, కొంత వగరుగా ఉంటుంది. ఏటా వేసవిలో ఉష్ణమండల తీర ప్రాంతాల్లో జీడిమామిడి విరివిగా పండుతుంది. ఇవి విరివిగా దొరికే ప్రాంతాల్లోని జనాలు ఈ పండ్లను నేరుగా తింటారు. జీడిమామిడి పండ్లలోని పోషకాలు జీడిమామిడి పండ్లలో పిండి పదార్థాలు, చక్కెరలు, విటమిన్–ఎ, విటమిన్–బి1, విటమిన్–బి2, విటమిన్–బి3, విటమిన్–బి5, విటమిన్–బి6, విటమిన్–సి వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, జింకు వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఆల్ బుకారా పండ్లు గంగ రేగు పండ్ల కంటే కాస్త పెద్దగా, యాపిల్ కంటే కొంత చిన్నగా ఎరుపు, లేత నేరేడు రంగుల్లో నిగనిగలాడుతూ కనిపించే అల్ బుకారా పండ్లు వేసవిలో విరివిగా దొరుకుతాయి. అల్ బుకారా పండ్ల గుజ్జు తియ్యగా, చిరుపులుపుతో రుచిగా ఉంటుంది. సాధారణంగా వీటి గుజ్జును నేరుగా తింటారు. వీటిని ఎండబెట్టి డ్రైఫ్రూట్స్‌గా మిఠాయిల తయారీలో ఉపయోగిస్తారు. అల్ బుకారా పండ్లలో పోషకాలు అల్ బుకారా పండ్లలో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్–ఎ, విటమిన్–బి1, బి–2, విటమిన్–బి6, విటమిన్–సి వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. -
‘గంగవ్వ’ ఎరుకనే కదా..!
సాక్షి, మల్యాల(పెద్దపల్లి): అచ్చమైన తెలంగాణభాష ఆమె సొంతం. అమాయకమైన చూపులు.. శివాలెత్తే మాటలకు కేరాఫ్‌గా నిలుస్తోంది మై విలేజ్ షో ఫేం గంగవ్వ. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ దినసరి కూలీ. తనకు రాని నటనతోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మై విలేజ్‌షో అనే ఛానల్‌తో యూ ట్యూబ్ ఐకాన్‌గా మారింది. గంగవ్వ కనపడితే చాలు ఒక్క సెల్ఫీ అంటూ యువత పోటీ పడుతున్నారు. నటనతెలియని గంగవ్వకు ఏకంగా పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్లు ఆఫర్ ఇవ్వడం ఆమె ప్రతిభకు నిదర్శనం. వ్యవసాయ కూలీనుంచి.. మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన మిల్కూరి గంగవ్వ ఉరఫ్ మై విలేజ్ షో గంగవ్వ వ్యవసాయ కూలీ. డిజిటల్ ఎలక్ట్రానిక్స్‌లో ఎంటెక్ పట్టా పొందిన అదే గ్రామానికి చెందిన శ్రీరాం శ్రీకాంత్ పల్లెటూరి సంస్కృతిని చాటిచెప్పేందుకు మై విలేజ్ షో అనే యూట్యూబ్ఛానల్ను దాదాపు ఐదేళ్లక్రితం ప్రారంభించాడు. తమ ఇంటి సమీపంలో ఉండే గంగవ్వ హుషారుతనం.. చలాకీ మాటలు.. అచ్చ తెలంగాణభాషను గుర్తించాడు. తన ఛానల్లో నటించడానికి అవకాశం ఇచ్చాడు. అలా సాగిన తన ఐదేళ్ల ప్రస్థానంలో ఇప్పుడు గంగవ్వ లేనిదే మై విలేజ్‌షో లేదు అనేంతగా ఫేమస్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు.. గంగవ్వ మై విలేజ్ షో షార్ట్ ఫిల్మ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ ఛానల్లో ఇప్పటి వరకు 100కు పైగా షార్ట్‌ఫిల్మ్‌ల్లో నటించింది. ప్రతీ వీడియోలో తన ప్రత్యేకతను చాటుకుంది. మొన్నటి సంకాంత్రికి భీమవరంలో కోడిపందాలకు పోటీలు, తరువాత వచ్చిన ఎన్నికల్లో తీరును విశ్లేషిస్తూ ‘సెటైరికల్‌గా సర్పంచ్ గంగవ్వ’, నిన్నటి శివరాత్రి మహాత్యం వివరించే శివరాత్రి జాగారణ పేరుతో యూట్యూబ్ వీడియోలు తీస్తూ తన యాస,మాట తీరుతో గుర్తింపు పొందింది. ఓ వార్తాఛానల్లోని ప్రోగ్రాంలో ఏడాదిపాటు నటించింది. మరో వార్తాఛానల్లో రెండు పండుగ ఎపిసోడ్లు చేసింది. ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో శనివారం నాడు ఏర్పాటుచేసే ‘సినీవారం’లో సత్కారం పొందింది. సినీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ సమంతను కలిసింది. వాళ్లే గంగవ్వ నటనను యూట్యూబ్‌లో చూసి ఆహ్వానించడం విశేషం. గంగవ్వతో ఒక్క సెల్ఫీ.. ఒక్కసారి నీ తిట్లతో దీవించు అంటూ గంగవ్వను వెతుక్కుంటూ వెళ్లి, గంగవ్వ మాటలు, తిట్లకు సంబరపడిపోతున్నారు యువత. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు గంగవ్వతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడుతున్నారు. పల్లెటూరి యాసతోపాటు మాటతో ఆకట్టుకుంటోంది. పల్లెటూరి నుండి పట్నం దాకా ఎక్కడికివెళ్లినా గంగవ్వ ఒక్క సెల్ఫీ అంటూ ఎగబడుతున్నారు. చెప్పింది చేసుడే తెలుసు.. వ్యవసాయ పనికి పోయేదాన్ని. పని లేనప్పుడు బీడీలు చేసేదాన్ని. శ్రీకాంత్ మా వీడియోలో నటిస్తవా అని అడిగిండు. నాకు నటించుడు రాదు..నువ్వు చెప్పింది సేత్త అన్న. శ్రీకాంత్ చెప్పింది చెప్పినట్లు చేస్త గంతే. ఎవుసం పనిచేసుకునేదాన్ని తీసుకువచ్చి ప్రపంచానికి పరిచయం చేసిండు శ్రీకాంత్. సినిమాల్లో నటించు అంటే నా ఊరిని ఇడిసి ఎక్కడికి రాను అని చెప్పిన. మొన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ నన్ను పిలిచి సినిమాల నటించుమంటే నటించుడు రాదు సారు..మీరు చెప్పింది చెప్పినట్లు సేత్తా అంటే కొద్దిసేపు ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తీసుకున్నడు. మన మీద మనకు నమ్మకం ఉంటే ఏ పనిచేసిన మంచిగనే ఉంటాం. – గంగవ్వ -
ఫోర్బ్స్ జాబితాలో విజయ్ దేవరకొండ
కెరీర్ స్టార్ట్ చేసిన అతి తక్కువ సమయంలోనే పెద్ద విజయాలు, ఊహించని పాపులారిటీని సంపాదించారు విజయ్ దేవరకొండ. యూత్‌లో ఫాలోయింగ్, సొంత దుస్తుల సంస్థ, వంద కోట్ల క్లబ్ (‘గీత గోవిందం’ సినిమా)తో 2018ని సక్సెస్‌ఫుల్‌గా ముగించారు విజయ్ దేవరకొండ. తాజాగా ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో కూడా చోటు దక్కించుకున్నారు. భారతదేశ వ్యాప్తంగా 30 ఏళ్ల వయసులోపు వివిధ రంగాల్లో సూపర్ సక్సెస్‌ను, పాపులారిటీను ఎంజాయ్ చేస్తున్న వారి పేర్లను ఓ జాబితాగా ఫోర్బ్స్ మేగజీన్ విడుదల చేస్తుంది. తాజా ఎడిషన్‌లో ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో విజయ్ దేవరకొండ చోటు సంపాదించారు. ‘‘తెలుగు సినిమాల్లో రైజింగ్ స్టార్ విజయ్. తను చాలా సింపుల్‌గా, గ్రౌండెడ్‌గా ఉంటారు. ఎటు వెళ్లాలో తనకు క్లియర్‌గా తెలుసు’’ అంటూ ఆ మేగజీన్ పేర్కొంది. -
బాబుకు తగ్గుతున్న ఆదరణ
నిజామాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆ రాష్ట్రంలో రోజు రోజుకు ప్రజాదరణ తగ్గుతోందని, అది గమనించి ప్రజలను తప్పుదోవ పట్టించే మాటలు మాట్లాడుతున్నారని ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బుధవారం నిజామాబాద్‌లో ‘ఆస్క్ కవిత’ పేరిట ప్రత్యేక రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌తో పాటు, స్థానికులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఫెడరల్ ఫ్రంట్‌తో వైఎస్సార్సీపీ జాతీయ స్థాయిలో కలసి పనిచేస్తుందని భావిస్తున్నామని చెప్పారు. దీనిలో భాగంగానే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారని పేర్కొన్నారు. ఈ విషయమై చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, కేవలం అభద్రతా భావంతోనే అలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఎవరిని ఆదరిస్తే ఎన్నికల్లో వారే విజయం సాధిస్తారని అన్నారు. అన్ని పార్టీల్లో వారసులు బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలలో వారసులు ఉన్నారని కవిత పేర్కొన్నారు. తాము తెలంగాణ కోసం సుదీర్ఘంగా ఉద్యమం చేశామ ని, దాంతో తమ కుటుంబం మొత్తం రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందన్నారు. పనిచేసే వారికే ఎన్నికల్లో ప్రజలు పట్టం గడుతారని చెప్పారు. గాంధీ, అంబేడ్కర్లలో ఎవరు గొప్పవారని అడిగిన ప్రశ్నకు.. అంబేడ్కర్ అన్నివర్గాల ప్రజల సమానత్వాన్ని కోర గా, గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చి పెట్టారన్నా రు. ఇద్దరూ గొప్పవారని, కానీ మార్గాలు వేరన్నారు. కేటీఆర్ గురించి అభిప్రాయం వ్యక్తం చేయాలని కోరగా తండ్రిగా, రాజకీయవేత్తగా, అన్నగా, భర్తగా సమర్థవంతంగా బాధ్యతలు నెరవేరుస్తున్నారని కితాబిచ్చారు. తన సొంత ఖర్చులతో నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేస్తున్నానని, ఈ విధానా న్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో అమలు చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. -
కేజ్రీవాల్‌కు ఆదరణ పెరుగుతోంది: సర్వే∙
న్యూఢిల్లీ: ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వంపై ప్రజాదరణ పెరుగుతున్నట్లు ‘ఇండియా టుడే’ చేపట్టిన పొలిటికల్ స్టాక్ ఎక్ఛ్సేంజి సర్వేలో వెల్లడైంది. గత అక్టోబర్‌లో చేపట్టినప్పటి కంటే తాజా సర్వేలో 2 శాతం వరకు ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత పెరిగిందని తేలింది. సుమారు 49% మంది ప్రజలు కేజ్రీవాల్ పాలన సంతృప్తికరంగా ఉన్నట్లు వెల్లడించారు. తదుపరి సీఎం ఎవరన్న ప్రశ్నకు కేజ్రీవాల్ వైపే అత్యధికులు మొగ్గు చూపగా, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ, మాజీ సీఎం షీలా దీక్షిత్ ఉన్నారు. ప్రధాని పదవికి మోదీకి 49% మంది, రాహుల్ 40% మంది అనుకూలంగా సమాధానమిచ్చారు. ఈ సర్వేను యాక్సిస్ మై ఇండియా సంస్థ 2018 డిసెంబర్ 27– 2019 జనవరి 3 మధ్య చేసింది. -
డేటింగ్ రూమర్స్‌పై హృతిక్ క్లారిటీ
‘‘సినిమాలో అవకాశం కావాలంటే నాతో డేటింగ్‌కు రావాలి’ అంటూ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని అగ్ర హీరో హృతిక్ రోషన్ బెదిరించాడు. ఇదే విషయమై వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. కంగనా రనౌత్‌ని వేధించినట్టే దిశాని కూడా వేధిస్తున్నాడు’’ అంటూ బాలీవుడ్‌లోని కొన్ని పత్రికల్లో వార్తలు అచ్చయ్యాయి. ఈ వార్తలకు అటు హృతిక్, ఇటు దిశా మండిపడ్డారు. హృతిక్ రోషన్, దిశా పటానీ జంటగా ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ నేపథ్యంలో వీరి గురించి పై విధంగా వార్తలొచ్చాయి. ఈ వార్తలకు హృతిక్ రోషన్ స్పందిస్తూ– ‘‘మీకు పాపులారిటీ కావాలంటే నన్నే నేరుగా అడిగితే ఏమైనా చేసి ఉండేవాణ్ణి కదా? ఇలాంటి అసభ్య, అవాస్తవ వార్తలు ప్రచురించడం ఎందుకు? నిజం ఏంటో తెలుసుకోండి’’ అని సదరు పత్రికలపై మండిపడ్డారు. దిశా పటానీ కూడా స్పందిస్తూ– ‘‘హృతిక్ సార్, నా గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నిరాధారమైన వార్తలు ఎందుకు రాస్తున్నారు?. హృతిక్ సార్‌ని నేను కలిసినప్పుడు ఎంతో మర్యాదగా మాట్లాడారు. అటువంటి గొప్ప వ్యక్తి గురించి వస్తున్న వార్తలను ఖండించాల్సిన బాధ్యత నాపై ఉంది. ఆయనతో కలిసి నటిస్తున్న సినిమా నుంచి నేను తప్పుకోవడంలేదు’’ అని స్పష్టం చేశారు. -
పాపులారిటీలో ఎల్‌పీయూకు 5వ ర్యాంకు
జలంధర్: పాపులారిటీ పరంగా దేశంలో ఢిల్లీ యూనివర్సిటీ అన్ని విద్యా సంస్థల్లోకెల్లా అగ్రస్థానంలో నిలిచింది. జలంధర్ కేంద్రంగా పనిచేస్తున్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ)కి ఐదో స్థానం దక్కింది. ప్రముఖ విద్యా సంస్థలు, వర్సిటీలకు ర్యాంకులు ప్రకటించే అంతర్జాతీయ సంస్థ ‘యూనిర్యాంక్’ 2018 ఏడాదికి తాజాగా జాబితాను విడుదల చేసింది. 878 ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులిచ్చింది. కాన్పూర్, మద్రాస్, బాంబే ఐఐటీలు వరుసగా 2, 3, 4 స్థానాలు పొందాయి. ఐఐటీ ఖరగ్‌పూర్‌కు ఆరు, ఐఐటీ ఢిల్లీకి 8వ ర్యాంకులు దక్కాయి.