శివం శంకరం శ్రీముఖం
పుణ్యతీర్థం
కాశీలో శివలింగ దర్శనం, శ్రీశైలంలో శిఖర దర్శనం, శ్రీముఖలింగంలో స్వామి ముఖదర్శనం మోక్షప్రదాయకాలని పురాణాలు చెబుతున్నాయి. దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన శ్రీముఖలింగం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో వంశధార తీరాన ఉంది. మిగిలిన శైవక్షేత్రాల్లో శివుడు లింగాకృతిలో పూజలందుకుంటూ ఉంటే, ఇక్కడ మాత్రం ముఖాకృతిలో పూజలందుకోవడం విశేషం. అందుకే ఈ క్షేత్రానికి శ్రీముఖలింగం అని పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో వెలసిన పరమశివుడిని ముఖలింగేశ్వరుడని పిలుస్తారు. ఈ క్షేత్రంలో సదాశివుడు కృతయుగంలో గోవిందేశ్వరుడనే పేరుతో కనకాకృతిలో, త్రేతాయుగంలో మధుకేశ్వరుడనే పేరుతో రజతాకృతిలో, ద్వాపరయుగంలో జయంతేశ్వరుడనే పేరుతో కాంస్యాకృతిలో పూజలందుకున్నాడని, కలియుగంలో శిలాకృతిలో ముఖలింగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడని ప్రతీతి.
ఇదీ చరిత్ర
శ్రీముఖలింగం ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన నగరం. కళింగ రాజ్యాన్ని పరిపాలించిన తూర్పు గంగవంశపు రాజులకు ఇది రాజధానిగా ఉండేది. శ్రీముఖలింగంలోని ఆలయాన్ని క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దిలో రెండవ కామార్ణవుడు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత పర్లాకిమిడి మహారాజు విష్ణువర్ధన మధుకర్ణ గజపతి దీనిని పునరుద్ధరించాడు. వంశధార నదీతీరంలో వెలసిన ఈ ఆలయ పరిసరాలు ఆహ్లాదభరితంగా ఉంటాయి. ప్రాచీన శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నిలిచిన శ్రీముఖలింగ క్షేత్రంలో గర్భాలయాన్ని రెండువందల అడుగుల ఎత్తున నల్లరాతితో నిర్మించారు. ఇరవైనాలుగు రాతి స్తంభాలపై అడుగడుగునా శిల్పకళా విన్యాసం సందర్శకులను అబ్బురపరుస్తుంది. ముఖద్వారంలో రాతిపై నిశితంగా తీర్చిదిద్దిన లతలు నాటి శిల్పుల నైపుణ్యానికి అద్దంపడతాయి. ఆలయ ప్రాంగణంలో శివతాండవం, పార్వతీ పరమేశ్వరుల జూదం, గంగావతరణం, అంధకాసుర వధ వంటి పురాణ ఘట్టాలకు చెందిన శిల్పాలు, ఉగ్రనరసింహుడు, ఆది వరాహమూర్తి, ఆదిశక్తి, కుమారస్వామి, దత్తాత్రేయుడు, కాలభైరవుడు వంటి దేవతా విగ్రహాలు చూపరులకు కనువిందు చేస్తాయి. పర్వదినాల్లో శ్రీముఖలింగేశ్వరుడు నందివాహనం, సింహవాహనం, ఐరావత వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తాడు. ఏటా కార్తీకమాసంలో, మహాశివరాత్రి పర్వదినాన పెద్దసంఖ్యలో భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటూ ఉంటారు.
అనుబంధ క్షేత్రాలు
శ్రీముఖలింగానికి చేరువలో పలు అనుబంధ క్షేత్రాలు ఉన్నాయి. తూర్పున కరకవలస గ్రామానికి చేరువలో రత్నగిరిపై పద్మనాభుడిగా వెలసిన శ్రీమహా విష్ణువు ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తాడు. ఈ ఆలయంలో కృష్ణార్జునులు కొలువుదీరి ఉండటం విశేషం. దానికి దక్షిణాన వటాద్రిపై సదాశివుడు లింగాకృతిలో పూజలందుకుంటూ ఉంటాడు. దీనికి చేరువలోనే స్వప్నేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే దుస్వప్న దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. దీనికి సమీపాన గల మధుకేశ్వర ఆలయానికి ఉత్తరాన సూర్యతీర్థం ఉంది. ఇక్కడి శివలింగాన్ని సాక్షాత్తు సూర్యభగవానుడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. అందువల్ల ఈ శివలింగాన్ని పూజిస్తే చర్మవ్యాధులు నశిస్తాయని భక్తుల విశ్వాసం. సూర్యతీర్థానికి చేరువలో కుబేరుడు యాగం చేసి శ్రీముఖలింగేశ్వరుడిని అర్చించుకున్న తర్వాత అతడికి అష్టసిద్ధులూ చేకూరినట్లు స్థలపురాణం చెబుతోంది. ఈ ప్రాంతంలో సూర్యతీర్థంతో పాటు కోటి, జంబు, సోమ, పుష్కర, కుబేర, హంస, గయ, చక్రపద్మ సరోవర, బిందు, పక్షి అక్షిణ, సంజీవని తదితర తీర్థాలు ఉన్నాయి.
భక్తులకు సౌకర్యాలు కరువు
శ్రీముఖలింగేశ్వర ఆలయ పరిరక్షణ బాధ్యతలను కేంద్ర పురాతత్వ శాఖ నిర్వహిస్తోంది. ఇక్కడ మినీ మ్యూజియం, ప్రహరీగోడ నిర్మాణం, ఇనుప గ్రిల్స్ ఏర్పాటు, పూలవనం, ఫ్లోరింగ్ వంటి పనులు జరిపించాలని దాదాపు దశాబ్దం కిందటే నిర్ణయం తీసుకుని, నిధులు కూడా కేటాయించినా, ఇంతవరకు ఎలాంటి పనులూ జరగలేదు. కనీసం భక్తుల కోసం స్నానాల గదులు, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు తదితరమైన వాటి నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదు. ఇక్కడి పరిసరాలు ఆకర్షణీయంగా ఉన్నా, పర్యాటకులు బస చేసేందుకు ఎలాంటి సౌకర్యాలూ అందుబాటులో లేవు. అందువల్ల వసతి సౌకర్యాల కోసం జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంపై ఆధారపడక తప్పదు.
- ఎస్.శాంత భాస్కరరావు,
జలుమూరు, శ్రీకాకుళం
ఫోటోలు: కె. జయశంకర్
ముక్కోణాకారంలో మూడు ఆలయాలు
శ్రీముఖలింగంలో మూడు ఆలయాలు ఉన్నాయి. ముఖలింగేశ్వరాలయం, భీమేశ్వరాలయం, సోమేశ్వరాలయం ముక్కోణాకారంలో కనిపిస్తాయి. వీటితో పాటు ఇక్కడ అనేక శివలింగాలు ఉన్నాయి. ఈ శివలింగాలు కోటికి ఒకటి తక్కువగా ఉండటం వల్ల కాశి స్థాయిని అందుకోవలసిన ఈ క్షేత్రం దక్షిణకాశిగా మాత్రమే మిగిలిపోయిందని ఇక్కడి అర్చకులు చెబుతున్నారు. ముఖలింగేశ్వరాలయం గర్భగుడిలోని గోలేన్ని ముట్టుకుని నమస్కరిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని క్షేత్రపురాణం చెబుతోంది. ముఖలింగేశ్వరాలయానికి తూర్పున భీమేశ్వరాలయం, దక్షిణాన సోమేశ్వరాలయం ఉన్నాయి.
ఇలా చేరుకోవచ్చు
దేశంలోని దాదాపు అన్ని ప్రధాన మార్గాల నుంచి శ్రీకాకుళం వరకు రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. విమాన మార్గాన్ని ఎంచుకునే వారు విశాఖపట్నంలో దిగి అక్కడి నుంచి రైలు లేదా రోడ్డు మార్గంలో శ్రీకాకుళానికి చేరుకోవాల్సి ఉంటుంది. శ్రీకాకుళం నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉండే శ్రీముఖలింగానికి దాదాపు ప్రతి అరగంటకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి.