అలా చేస్తే లావు అయిపోతారు!
లండన్ : డైటింగ్ చేసేవాళ్లు, ఆహార నియమాలను పాటించేవాళ్లు ఈ విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదట. ఎందుకంటే.. డైటింగ్ చేసేవారు వేరే పనులు చేస్తూ ఆహారాన్ని లాగించేస్తే లావు అయిపోతారట.. ఈ విషయాన్ని చెబుతున్నది ఎవరో కాదు.. తాజాగా సర్వే నిర్వహించిన రీసెర్చర్స్. నడస్తూనో, టీవీ చూస్తూనో మనం సాధారణం కంటే కాస్త ఎక్కువగా తింటామని.. దీంతో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఊబకాయులు అవుతారని ఇంగ్లండ్ లోని సర్రే విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జేన్ అగ్డేన్ తెలిపారు. పరిశోధనలు చేయడంతో పాటు ఒగ్డేన్ ఓ మంచి రచయిత.
ఈయన తాజాగా నిర్వహించిన సర్వే విషయాలను వెల్లడించారు. స్నేహితులతో మాట్లాడుతూ, టీవీ చూస్తూనో, నడక కొనసాగిస్తూనో ఉన్నవాళ్లు మామూలు కంటే కాస్త ఎక్కువగా తినే అవకాశం ఉందన్నారు. 60 మంది మహిళలపై రీసెర్చ్ చేసి ఈ ఫలితాన్ని వెల్లడించారు. మూడు వివిధ స్థితులలో ఉన్నప్పుడు వారికి భోజనం అందించి తినమని చెప్పి ఈ మార్పులను కనుగొన్నారు. అయితే వారు స్నాక్స్, చాక్లెట్లు ఎక్కువగా తిన్నారని చెప్పారు. ఆ సమయంలో వారు తమ ఆహారంపై అంతగా ఆసక్తి చూపకుండానే ఇలా చేస్తారని, కొన్ని సెకన్ల కిందటే తీసుకున్న ఐటమ్స్ ను అప్పుడే తినే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు ప్రొఫెసర్ ఒగ్డేన్. హెల్త్ సైకాలజీ అనే జర్నల్‌లోనూ సర్రే యూనివర్సిటీ సర్వే వెల్లడించిన విషయాలను ప్రచురించారు.