ప్రొఫెసర్ దూషించారని.. ఆత్మహత్యాయత్నం
విజయవాడ లయోలా కాలేజీకి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. బెల్టు పెట్టుకోలేదన్న కారణంతో వినీల్ అనే విద్యార్థిని ప్రొఫెసర్ దూషించారని, దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన వినీల్.. చెయ్యి కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడని తోటి విద్యార్థులు తెలిపారు. ఈ సంఘటనలో ప్రొఫెసర్ తీరుకు నిరసనగా మాచవరం పోలీసు స్టేషన్ వద్ద లయోలా కాలేజి విద్యార్థులు ఆందోళన చేశారు.
చిన్న చిన్న విషయాలకు కూడా విద్యార్థులను దూషించడం వల్ల వాళ్ల మనోభావాలు దెబ్బతింటున్నాయని, దాంతో సున్నిత మనస్కులైన విద్యార్థులు ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారని వాళ్లు వాపోయారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు.