ప్రజల వద్దకే ప్రభుత్వ యంత్రాంగం
సిద్దవటం:
జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ యంత్రాంగం ప్రజల వద్దకే వచ్చిందని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కడపాయపల్లె, లింగంపల్లె గ్రామ పంచాయతీలకు సంబంధించి మంగళ వాండ్లపల్లె పాఠశాల వద్ద శనివారం జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాలకు ఆయా గ్రామాల సర్పంచులు ఆర్.లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా మేడా మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం పింఛన్ల పెంపు, డ్వాక్రా, రైతుల రుణమాఫీ, ఎన్టీఆర్ ఆరోగ్యసేవ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.2.50లక్షలు వరకు ఉచిత కార్పొరేట్ వైద్యం వంటి పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. కడపాయపల్లెలో ఎమ్మెల్యే, ఆర్డీఓ ప్రభాకర్పిళ్లై చౌకదుకాణాన్ని ప్రారంభించారు. అలాగే ఐసీడీఎస్ సీడీపీఓ నిర్మల, సూపర్వైజర్లు నిర్వహించిన సీమంతం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం గర్భవతులకు పసుపు, కుంకుమ, జాకెట్, పూలు, పండ్లుతో పాటు అంగన్వాడీల ద్వారా ఇచ్చే బియ్యం, కందిపప్పు, గుడ్లు, ఆయిల్ వంటి వస్తువులు వారికి అందజేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య, మండల పర్యవేక్షణాధికారి సుబ్బారావు, ఎంపీడీఓ పద్మావతి, ప్రత్యేక డిప్యూటీ తహశీల్దార్ శ్రీధర్‌రావు, ఎంపీపీ నరసింహరెడ్డి, టక్కోలి ఎంపీటీసీ నాగమునిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు జగదీష్ కుమార్‌రెడ్డి, టీడీపీ నేతలు సంజీవరెడ్డి, దశరథ రామనాయుడు, గోపాల్, జవహర్ బాషా, ఓబులయ్య, రాజేశ్వర్‌రెడ్డి, పాలకొండయ్య, అధికారులు పాల్గొన్నారు.