Pulse Club
-
మృత్యువుతో పోరాడాను..
ఆర్లెండో కాల్పుల బాధితుడి వెల్లడి - ఆరు బుల్లెట్లతో 3 గంటలు నరకయాతన: ఏంజెల్ కలోన్ ఆర్లెండో: ఈనెల 12న అమెరికాలోని ఆర్లెండో ‘పల్స్’ నైట్ క్లబ్లో జరిగిన కాల్పుల షాక్ నుంచి బాధితులు ఇంకా తేరుకోలేదు. ఆ ఘోరాన్ని జ్ఞప్తి చేసుకుంటూ చికిత్స పొందుతున్న బాధితులు ఒకరొకరే మీడియా ముందుకొస్తున్నారు. కాల్పుల ఘటనలో మృత్యువు అంచు వరకూ వెళ్లి ప్రాణాల్తో బయటపడ్డాడు ఏంజెల్ కలోన్ అనే యువకుడు. ఆర్లెండో రీజినల్ మెడికల్ సెంటర్లో చికిత్స పొందుతున్న కలొన్ చెప్పిన వివరాలు హృదయవిదారకంగా ఉన్నాయి. ‘అప్పటికే కాలిలో మూడు బుల్లెట్లు దిగడంతో నొప్పి భరించలేకపోతున్నా... కింద పడిపోయా. లేవడానికి ప్రయత్నించినా జనం కాలిపై నుంచి పరుగెట్టడంతో ఎక్కడికీ కదలేకపోయా. దుండగుడు మరోసారి మా వైపే వస్తున్నాడు. కాల్పులు చాలా దగ్గరగా విన్పిస్తున్నాయి. తల పెకైత్తి చూశా... పక్కనే ఉన్న ఒకమ్మాయిపై కాల్పులు జరుపుతున్నాడు. కదలకుండా పడుకుని ఉన్నా. తర్వాత నేనే... చనిపోవడం ఖాయం అనుకునే లోపే హంతకుడు నా తలపైకి కాల్చాడు. అదృష్టవశాత్తూ రెండు బుల్లెట్లు చేతుల్లోకి దూసుకుపోయాయి. మళ్లీ కాల్పులు... బుల్లెట్ ఈ సారి తొడ భాగంలోకి దూసుకెళ్లింది. బాధతో గొంతు చించుకుని అరవాలనుకున్నా... బతికున్నానని దుండగుడికి తెలియకుండా చచ్చిన వాడిలా పడుకున్నా’ అని కన్నీటి పర్యంతమవుతూ చెప్పాడు. తెల్లవారుజాము 5 గంటలకు పోలీసు వచ్చే వరకూ శరీరంలో ఆరు బుల్లెట్ల బాధను ఓర్చుకుంటూ మృత్యువుతో పోరాడానని అన్నాడు. 70 మందిని కాపాడిన బౌన్సర్ పల్స్ క్లబ్ లో బౌన్సర్‌గా పనిచేస్తున్న ఇమ్రాన్ యూసుఫ్ ప్రాణాలకు తెగించి 70 మందిని కాపాడి హీరోగా నిలిచాడు. గతంలో అమెరికా మెరైన్ విభాగంలో పనిచేసిన అనుభవం కాల్పుల సమయంలో చాకచక్యంగా వ్యవహరించేందుకు ఉపయోగపడింది. ‘నేను క్లబ్ వెనుక వైపు ఉన్నా... మూడు నాలుగు కాల్పుల శబ్దాలు వినిపించాయి. అందరూ భయాందోళనలతో హాలు వెనుక వైపుగా పరుగెట్టడం చూశా. అక్కడ ఉన్న వీధి తలుపు గుండా బయటపడదామని అందరూ అటువైపు వచ్చారు. కానీ తలుపు వేసి ఉండడంతో ఎవరూ తీసేందుకు సాహసించలేదు. తలుపు తెరవండి అంటూ అరిచినా.. భయంతో అందరూ నిలబడిపోయారు. అక్కడే ఉంటే మేమంతా చనిపోవడం ఖాయం... అందుకే పరుగెత్తి వెళ్లి తలుపు గడియ తెరిచా... దాంతో అందరూ క్లబ్ బయటకు పరుగెత్తాం’ అంటూ భీతి గొలిపే సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. దాదాపు 70 మందిని ఆ తలుపు గుండా తప్పించి ప్రశంసలు అందుకున్నాడు. -
మతీన్ కూడా స్వలింగసంపర్కుడే!
- మతీన్ ఫోన్లో ‘గే యాప్’ ఉందన్న ఎఫ్‌బీఐ - చాలాసార్లు క్లబ్‌కు వచ్చాడన్న ‘పల్స్’ న్యూయార్క్: ఆర్లెండో కాల్పులకు పాల్పడిన ఉగ్రవాది మతీన్‌కు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నిన్నటి వరకు స్వలింగ సంపర్కులంటే(గే) నచ్చకే.. ఉగ్రవాద ఆలోచనలతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని భావిస్తుండగా.. తాజా విచారణలో మతీన్ కూడా గే అని తేలింది. అతను గే అయి ఉండొచ్చని.. కోపం, సిగ్గు కారణంగా ఈ వాస్తవాన్ని దాచిపెట్టి ఉంటాడని మతీన్ మాజీ భార్య సితోరా యుసుఫ్రీ వెల్లడించారు. 2008లో ఆన్లైన్లో కలుసుకున్నామని.. 2009లో వివాహంచేసుకున్నామని అప్పుడే తనకు క్లబ్‌లకు వెళ్లే అలవాటున్న విషయాన్ని మతీన్ చెప్పడన్నారు. అయితే అవి గే క్లబ్‌లా కాదా అని మాత్రం చెప్పలేదన్నారు. ఎఫ్‌బీఐ ప్రాథమిక విచారణలోనూ మతీన్ ‘గే యాప్స్’ను వినియోగించేవాడని తెలిసింది. 2013లో తోటి ఉద్యోగులతో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు, 2014లో సిరియాలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన మొహ్మద్ అబుసల్హాతో సంబంధాలున్నాయనే కారణంతో రెండుసార్లు విచారించినట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది. అల్ కాయిదా, హిజ్బుల్లా సంస్థలతో తనకు సంబంధాలున్నట్లు పలుమార్లు సన్నిహితులతో చెప్పాడని ఎఫ్‌బీఐ డెరైక్టర్ జేమ్స్ కోమీ తెలిపారు. మరోవైపు, ఆదివారం నాటి దురదృష్టకర సంఘటనకు సాక్షంగా నిలిచిన పల్స్ క్లబ్ నిర్వాహకులు కూడా మతీన్ చాలాసార్లు తమ క్లబ్‌కు వచ్చాడని వెల్లడించారు. కొన్ని సార్లు క్లబ్లో ఓ మూలన కూర్చుని తాగి వెళ్లేవాడని.. మరికొన్నిసార్లు తాగి గట్టిగా అరుస్తూ రచ్చ చేసేవాడన్నారు. ఈ క్లబ్‌కు వచ్చేవారు కూడా మతీన్‌ను చాలాసార్లు కలిసినట్లు తెలస్తోంది. ఆర్లెండోను సందర్శించనున్న ఒబామా మలీన్ కాల్పుల్లో చనిపోయిన 49 మంది పల్స్క్లబ్ మృతులకు అమెరికా అధ్యక్షుడు ఒబామా గురువారం నివాళులర్పించనున్నారు. సాధ్యమైన కారణాల అన్వేషణ ఆర్లెండో ఘటనకు సాధ్యమైన కారణాలను ఎఫ్‌బీఐ అన్వేషిస్తోంది. అమెరికన్ ముస్లిం అయిన మతీన్ స్వదేశీ ప్రేరేపిత ఉగ్రవాద ఉన్మాదేనని.. ఇతనికి ఐసిస్, ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాల్లేవని శ్వేతసౌధం, ఎఫ్‌బీఐ సంయుక్తంగా వెల్లడించాయి. ఇతని మానసిక స్థితి సరిగా లేదని మాజీ భార్య చెప్పటంపైనా, స్వలింగ సంపర్కులకు వ్యతిరేకమన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. లైంగిక ప్రవృత్తిపై ఎటూ తేల్చుకోలేక పోవటం కూడా ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఆర్లెండో కాల్పలును ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఖండించింది. లైంగిక ధోరణి ఆధారంగా వ్యక్తులపై కాల్పులకు దిగటం దారుణమంది.