శిక్ష పూర్తయినా వీడని ‘చెర’
గుర్తింపు చూపకపోవడంతో పాకిస్తాన్ జైల్లోనే మగ్గుతున్న భారత ఖైదీలు
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నో ఏళ్ల క్రితం పాకిస్తాన్‌కు వెళ్లి వివిధ కేసుల్లో అరెస్టయి జైల్లో మగ్గుతున్న ఖైదీలు శిక్ష పూర్తయినా చెరసాలను వీడే అవకాశం రావడం లేదు. తమ జాతీయతను నిరూపించే గుర్తింపు పత్రాలను చూపని కారణంగా అక్కడి అధికారులు వారిని జైళ్ల నుంచి విడుదల చేయడం లేదు. ఇందుకు సంబంధించి పాకిస్తాన్ జైల్లో శిక్ష పూర్తి చేసుకున్న 22 మంది ఖైదీల చిత్రాలను ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ కార్యాలయ అధికారులు న్యూఢిల్లీలోని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపించారు.
వీరు శిక్ష పూర్తి చేసుకున్నా...జాతీయతను గుర్తించని కారణంగా ఇంకా జైల్లోనే ఉంటున్నారని పేర్కొన్నారు. కాగా ఖైదీల ఫొటోలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు హైదరాబాద్‌కు కూడా పంపించారు. ఈ ఫొటోల ఆధారంగా ఎవరైనా తమవారు ఉన్నారని భావిస్తే, అందుకు సంబంధించిన ఆధారాలతో పురానాహవేలిలోని ఓల్డ్ కమిషనర్ ఆఫీసులోని స్పెషల్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసును కలవాలని స్పెషల్ బ్రాంచ్ అడిషనల్ పోలీసు కమిషనర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.