‘స్వచ్ఛత’ అవార్డులు ప్రదానం చేసిన కేంద్రం
ఉత్తమ గ్రామాల రూపకల్పనలో కలెక్టర్లు అమ్రపాలి, భారతీలకు అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా స్వచ్ఛతా అభియాన్‌ను పెంచేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రణాళికలు చేస్తోంది. స్వచ్ఛత పాటిం చడంలో ప్రతిభ చూపిన వివిధ విద్యా సంస్థలకు, జిల్లాల్లో మోడల్ గ్రామాలను తయారు చేసిన జిల్లా కలెక్టర్లకు అవార్డులు ప్రదానం చేసింది. జిల్లాల్లో స్వచ్ఛతకు పెద్దపీటవేస్తూ ఆదర్శ గ్రామాలను రూపొందించినందుకుగానూ వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి, మెదక్ జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరి వరుసగా మూడు, నాలుగు ర్యాంకులతో అవార్డులు అందుకున్నారు.
గురువారం ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వీరికి అవార్డులు ప్రదానం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని శంభునిపల్లి, మెదక్ జిల్లాలో ముజ్రంపేట గ్రామాలను స్వచ్ఛత విషయంలో ఆదర్శంగా తీర్చిదిద్దినందుకు కలెక్టర్లకు ఈ అవార్డులు దక్కాయి. అలాగే సాంకేతిక విద్యాసంస్థల విభాగంలో గుంటూరు కేఎల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగం రెండో ర్యాంకు సాధించి అవార్డు అందుకుంది. వర్సిటీ తరఫున డీన్ కె.శరత్‌కుమార్ కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.