ఆగని రీసైక్లింగ్ దందా
రేషన్ బియ్యంతో పట్టుపడిన లారీ
మానకొండూర్ : మండలంలోని ముంజంపల్లి శివారులోని వైష్ణవి రైస్‌మిల్లులో రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా ఆగడం లేదు. నెల రోజుల వ్యవధిలోనే మళ్లీ రేషన్ బియ్యం లారీ ఆదివారం పట్టుబడింది. గత నెల 20న వరంగల్ జిల్లా హసన్‌పర్తి నుంచి రేషన్ బియ్యంతో వచ్చిన లారీని విజిలెన్సు అండ్ ఎన్ఫ్ఫోర్సమెంటు అధికారులు పట్టుకుని 801 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ఆదివారం రేషన్ బియ్యంతో ఓ లారీ వస్తుందని ఉన్నతాధికారుల ఇచ్చిన సమాచారంతో స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు వైష్ణవి రైస్ మిల్లుపై దాడిచేసి బియ్యంలోడు తో వచ్చిన ఓ లారీని పట్టుకున్నారు.
అనంతరం రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఆర్ఐలు భగవంతరావు, నాగార్జున వీఆర్వో నవీన్‌రావు, వీఆర్ఏ జగదీశ్ రైస్‌మిల్లు వద్దకు చేరుకుని, లారీలోని బియ్యంతోపాటు, రైస్‌మిల్లును పరిశీలించారు. రైస్‌మిల్లులో కూడా రేషన్ బి య్యం ఉన్నట్లు గుర్తించి, సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సివిల్ సప్లై డెప్యూటీ తహశీల్దార్లు రమేశ్, హరికిరణ్, ఫుడ్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ రైస్‌మిల్లు వద్దకు చేరుకుని లారీలో, రైస్‌మిల్లులో ఉన్న బి య్యం రేషన్ బియ్యమేనని గుర్తించారు.
అనంతరం లారీ ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రైస్‌మిల్లులోని రేషన్‌బియ్యం వద్ద రాత్రి రెవెన్యూ సిబ్బందిని కాపలా ఉంచారు. లారీలోని బియ్యంతోపాటు, రైస్‌మిల్లులో సుమారు 500 క్వింటాళ్ల వరకు బియ్యం ఉన్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. సోమవారం పంచానామా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి క స్టం మిల్లింగు పెట్టకపోవడంతో 2013లోనే ఈ రైస్‌మిల్లును సీజ్ చేశారు. సీజ్ చేసిన రైస్‌మిల్లులోకి రేషన్ బియ్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తూ, రీ సైక్లింగ్ చేస్తున్నారు.