Raja Ram Mohan
-
పులస చేప.. మంచి విందు!
‘‘గోదావరిపై చాలా సినిమాలొచ్చాయి. సత్యం, ఇళయరాజా వంటి గొప్ప గొప్ప సంగీత దర్శకులు గోదావరిపై మంచి పాటలు స్వరపరిచారు. ఈ సినిమాలో నేను గోదావరి ఫేమస్ పులస చేపపై పాట చేశా. దానికి మంచి స్పందన వస్తోంది. వీనుల విందుగా ఉందని అందరూ అంటున్నారు. గొప్ప పాటల సరసన ఈ పాట నిలుస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు సంగీత దర్శకుడు రఘు కుంచె. రాజా రామ్మోహన్ చల్లా దర్శకత్వంలో తూము రామారావు, రాజేశ్ రంబాల, బొమ్మన సుబ్బారాయుడు నిర్మించిన సినిమా ‘కేరాఫ్ గోదావరి’. ఈ నెల 24న రిలీజవుతోన్న ఈ చిత్రానికి రఘు కుంచె సంగీత దర్శకుడు. దర్శకుడు మాట్లాడుతూ – ‘‘గోదావరి, ఆ నదిలో ప్రయాణం గురించి ఎంత చెప్పినా తక్కువే. కొత్త హీరో హీరోయిన్లతో గోదావరి నదిపై తీసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు. నిర్మాతల్లో ఒకరైన బొమ్మన సుబ్బారాయుడు సహా చిత్ర బృందం పాల్గొన్నారు. -
క్యాప్షన్‌కు పోస్టర్ పట్టదు!
రచయిత రాజా రామ్మోహన్ దర్శకునిగా మారి ‘‘c/o గోదావరి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘క్యాప్షన్ పెట్టాలంటే పోస్టర్ పట్టదండోయ్’ అన్నది ఉపశీర్షిక. రోహిత్ ఎస్, శ్రుతీవర్మ, దేదీప్య నాయుడు హీరో హీరోయిన్లు. ఉషా మూవీస్ సమర్పణలో తూము రామారావు (బాబాయ్), బొమ్మన సుబ్బారాయుడు, రాజేష్ రంబాల నిర్మించారు. రఘు కుంచె స్వరపరచిన ఈ చిత్రం పాటలు ఇటీవల విడుదలయ్యాయి. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఉంటాయి’’ అన్నారు. ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నిర్మాతలు మల్కాపురం శివకుమార్, సురేశ్, కన్నా లక్ష్మీనారాయణ, ఆకెళ్ల రాఘవేంద్ర, రవీందర్, దేవీప్రసాద్ పాల్గొన్నారు.