పథకం ప్రకారమే.. భార్యను హత్య చేశా !
చిక్కడపల్లి/ ముషీరాబాద్, న్యూస్‌లైన్: బాగ్‌లింగంపల్లి అచ్చయ్యనగర్‌లో శనివారం జరిగిన రజని హత్య కేసును పోలీసులు ఛేదించారు. పథకం ప్రకారమే భర్తే ఆమెను కడతేర్చాడని తేల్చారు. మద్యంలో నిద్రమాత్రలు కలిపి తాగించి.. గాఢ నిద్రలో ఉండగా కర్కశంగా కత్తితో గొంతులో పొడిచి చంపినట్టు నిర్ధారించారు. ఈ కేసులో భార్త, అత్తమామలతో పాటు మొత్తం ఆరుగురిని అరె స్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.
చిక్కడపల్లి ఏసీపీ అమర్‌కాంత్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీధర్, డీఐ సుబ్బరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... అచ్చయ్యనగర్‌లో ఉండే కాంగ్రెస్ నాయకుడు చిత్తరంజన్ కొడుకు బాలకృష్ణ బంజరాహిల్స్‌లోని కార్వే సంస్థలో బిజినెస్ మేనేజర్. ఇతనికి రజనితో 2004లో పెళ్లైంది. వీరికి కూతురు నిరుపమకృష్ణ (6) సంతానం. పెళ్లైనప్పటి నుంచి రజనికి అత్తమామలు, భర్తతో గొడవలు జరుగుతున్నాయి.
సహోద్యోగినితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భావించిన రజని భర్తతో తరచూ ఘర్షణకు దిగేది. దీనికి తోడు మామ చిత్తరంజన్ తన కోరిక తీర్చమని ఆమెను వేధిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో వేరే చోట కాపురముందామని రజని పట్టుపట్టగా భర్త ససేమిరా అనేవాడు. ఓ సందర్భంలో విడాకులిచ్చేందుకు బాలకృష్ణ సిద్ధంకాగా.. రజని నిరాకరించింది. ఈనేపథ్యంలోనే ఆమె అడ్డుతొలగించుకోవాలని భర్తతో పాటు అతని కుటుంబసభ్యులు పథకం పన్నారు.
కత్తి, మద్యం, నిద్రమాత్రలు కొని...
భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్న బాలకృష్ణ శనివారం విధులు ముగించుకొని అమీర్‌పేట వెళ్లాడు. అక్కడ కత్తి, పూజా సామగ్రి కొన్నాడు. అనారోగ్యం కారణంగా అతని చెల్లెలు ప్రమీల నిద్రమాత్ర లు వాడేది. ఆ మందుల చీటీ చూపించి నాలుగు నిద్రమాత్రలు కొన్నాడు. ఇంటికి వస్తూ మార్గంమధ్యలో మద్యం బాటిల్ కొన్నాడు. ఇంటికి వచ్చిన వెంటనే కూతుర్ని తన చెల్లెలు ఇంటికి పంపేశాడు. గతంలో బాలకృష్ణ, రజనిలు కలిసి మద్యం తాగేవారు. అదే మాదిరిగా మద్యం తాగుదామని భార్యను పిలిచాడు. ఇద్దరూ తాగారు. ఆమెకు తెలియకుండా ఆమె గ్యాస్‌లో నిద్రమాత్రల పొడిని వేశాడు. అది తాగిన రజని గాఢనిద్రలోకి వెళ్లగా.. అర్ధరాత్రి సమయంలో గొంతుపై కత్తితో బలంగా పొడవడంతో ప్రాణం విడిచింది. పక్క గదిలో ఉన్న అత్తమామలు ఈ దారుణాన్ని చూస్తూ ఉన్నారు.
క్షుద్ర పూజల డ్రామా..
క్షుద్ర పూజల నాటకమాడి హత్య కేసు నుంచి తప్పించుకోవాలని బాలకృష్ణ ప్రయ త్నించాడు. బాల్కనీలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉంచాడు. ముంబైలో ఉండే రజని బంధువు రోగాలు, ఇతర సమస్యలతో బాధపడే వారికి పూజలు చేసి బాగు చేసేవాడని, రజని కూడా అలాంటి పూజ చేస్తుండగా అడ్డుకోబోగా కత్తి తగిలి చనిపోయిందని పోలీసులకు చెప్పాడు. అయితే, ఆమె బొట్టు, కాళ్లపై ఉన్న పసుపు, కుంకుమ చెదిరిపోకుండా ఉండటంతో హత్య చేసిన తర్వాతే వాటిని చల్లారని పోలీసులు గుర్తించారు.
నేనే చంపేశా...
నేనే నా భార్యను హత్య చేశా. ఇంత జరుగుతుందని అనుకోలేదు. హత్య చేశాక డబ్బు ఖర్చు చేసి తేలిగ్గా కేసునుంచి బయటపడవచ్చని భావించా.. నా కూతురును బాగా చదివించాలనుకున్నా.. ఇలా కేసులో పూర్తిగా ఇరుక్కుపోతానని ఊహించలేదు.
- బాలకృష్ణ, నిందితుడు
దాడి చేస్తారని నిందితులను ప్రవేశపెట్టలేదు...
సంచలనం సృష్టించిన రజనిని హత్య కేసులో నిందితులను ప్రవేశ పెడుతున్నారని తెలిసి మీడియం పెద్ద ఎత్తున చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు చేరుకుంది. అయితే పోలీసులు నిందితులను ప్రవేశ పెట్టలేదు. దీనిపై మీడియా ఏసీపీని వివరణ కోరగా... బాధితులు వారిపై దాడి చేస్తారనే భయంతోనే ప్రవేశ పెట్టలేదని చెప్పారు.