రూ.2.45 లక్షలు గోల్మాల్
కమిషనర్‌కు నోట్ పెట్టిన మేనేజర్
ఇప్పుడు నీటిపన్ను బాగోతం
రామచంద్రపురం : రామచంద్రపురం మున్సిపాలిటీని కుదిపేసిన ఆస్తిపన్నుల అవినీతి బాగోతాన్ని మరువక ముందే.. ఇదే మున్సిపాలిటీలో నీటిపన్నుల రూపేణా వసూలు చేసిన సొమ్ము మాయమైన వ్యవహారం వెలుగుచూసింది. కార్యాలయంలో బిల్లు కలెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఆస్తి, నీటి పన్నుల వసూలు సొమ్మును స్వాహా చేశారని అధికారులే స్పష్టం చేస్తున్నారు. అయితే ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మున్సిపాలిటీలోని నీటి పన్నుల వసూళ్లలో జరిగిన అవినీతిపై మున్సిపల్ మేనేజర్ జి.రాధాకృష్ణ మే నెలలో కమిషనర్‌కు నోట్ పెట్టారు. మొత్తం 243 నీటి పన్నుల రసీదులకు సంబంధించి రూ.2.45 లక్షలు గోల్మాల్ అయినట్టు తెలిసింది.
సంబంధిత కంప్యూటర్ ఆపరేటర్, రెవెన్యూ వసూళ్ల విభాగం సిబ్బంది కలిసి ఆన్లైన్లో 243 నీటి పన్నుల రసీదులను రద్దు చేసి, వాటి సొమ్మును కార్యాలయ చిట్టాల నుంచి తొలగించినట్టు సమాచారం. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండా, ఆన్లైన్లో కంప్యూటర్ పాస్‌వర్డ్‌ను సిబ్బంది దుర్వినియోగం చేసినట్టు తెలుస్తోంది. రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సహా సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్లు ఈ బాగోతాన్ని నడిపించినట్టు సమాచారం. ఓ ఉన్నతాధికారి పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తి స్థాయిలో ఆడిట్ చేయాలని మేనేజర్ తన లేఖలో పేర్కొన్నా, చర్యల్లేవు.
ఆస్తిపన్ను బాగోతంపై నిర్లక్ష్యం
మున్సిపాలిటీలో జరిగిన రూ.48 లక్షల ఆస్తిపన్ను బాగోతం వెలుగులోకి వచ్చి 15 రోజులు గడుస్తున్నా.. ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపలేదు. ఈ నెల 15న ‘సాక్షి’లో ‘ఇంటిదొంగల టాలెంట్’ శీర్షికన కథనం వెలువడిన సంగతి విదితమే. దీనిపై కల్టెక్టర్ స్పందించి బాధ్యులపై క్రిమినల్ కేసు లు నమోదు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. 21న ము న్సిపల్ కార్యాలయానికి ఆదేశాలు చేరుకున్నా, ఇప్పటివరకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోలేదు.