రూ.49,595 కోట్లకు ఫైనల్
‘పాలమూరు–రంగారెడ్డి’ తుది అంచనాలకు స్టాండింగ్ కమిటీ ఓకే
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన ‘పాలమూరు– రంగారెడ్డి’ ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం మరోమారు పెరుగుతోంది. ప్రాజెక్టు పరిధి లో జరిగిన మార్పులు, కొత్తగా చేరిన పనుల అనంతరం తుది అంచనా వ్యయం రూ.49,595 కోట్లకు చేరుతోంది. తొలి అంచనా వ్యయం రూ.35,200 కోట్లతో పోలిస్తే.. ఏకంగా రూ.14,395 కోట్లు అదనపు భారం పడుతోంది. ఈ మేరకు పెరిగిన అంచనా వ్యయాలకు నీటి పారుదల శాఖ రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ (ఎస్ఎల్ఎస్ఎసీ) ఆమోదం తెలిపింది. దీనిపై ప్రభుత్వ ఆమోదం దక్కిన వెంటనే అధికారిక ఉత్తర్వులు రానున్నాయి.
అన్ని అంచనాలూ పెరిగాయి
పాలమూరు పథకం తొలి ప్రతిపాదన మేరకు శ్రీశైలం నుంచి 90 రోజుల పాటు రోజుకు 1.5 టీఎంసీల చొప్పున నీటిని తీసుకుని.. పాత మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. ఇందుకు రూ.35,200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అనంతరం శ్రీశైలం నుంచి 60 రోజుల పాటు రోజుకు 2 టీఎంసీల చొప్పున 120 టీఎంసీలు తీసుకుని.. మరో 2.30 లక్షల ఎకరాలకు అదనంగా నీరివ్వాలని ప్రతిపాదించారు. దీంతో పంపులు, విద్యుత్, కాల్వల అవసరాలు పెరిగా యి.
తొలి ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్)లో 3,445 మెగావాట్ల విద్యుత్ అవసర మని, ఇందుకు రూ.10,335 కోట్లు ఖర్చవుతుందని లెక్కలేయగా... తాజా అంచనాల ప్రకారం 4,705 మెగావాట్ల విద్యుత్అవసరం, రూ.13,973.86 కోట్ల ఖర్చు అంచనా వేశారు. ఇక ఆయకట్టును పెంచిన మేరకు కాల్వలు పెరిగి.. వ్యయం అదనంగా రూ.736 కోట్లు పెరిగింది. ఇక ప్రాజెక్టులోని 5 పంపింగ్ స్టేషన్లకు అవసరమయ్యే విద్యుత్ వ్యవస్థ (సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్ల) నిర్మాణం కోసం మొదట రూ.1,674.64 కోట్లు వ్యయం లెక్కగట్టారు. కానీ ట్రాన్స్కో సూచనల మేరకు చేసిన మార్పులతో వ్యయం ఏకంగా రూ.3,300.51 కోట్లకు పెరిగిపోవడం విశేషం. ఇక ఉద్ధండాపూర్ రిజర్వాయర్ సామర్థ్యం పెంపు, లిఫ్టుల పరిధిలో టన్నెళ్ల పొడవు పెంపుతో వ్యయం పెరిగింది.