పెంబర్తి వరకు పచ్చదనమే...
సాక్షి, సిటీబ్యూరో: వరంగల్ జాతీయ రహదారి (163)పై పెంబర్తి వరకు ‘మల్టీలేయర్ ప్లాంటేషన్ గ్రీనరీ’ని పొడిగించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ సన్నాహాలు చేపట్టింది. ప్రస్తుతం రాయగిరి వరకు ఉన్న గ్రీనరీని సుమారు రూ.5 కోట్ల వ్యయంతో పెంబర్తి వరకు మల్టీ లేయర్ ప్లాంటేషన్ పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఔటర్‌రింగ్‌రోడ్డు, వరంగల్ హైవే వెంట పెంచిన ప్లాంటేషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. హెచ్ఎండీఏ గ్రీనరీపై ఇటీవల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సైతం అధ్యయనం చేసింది.
♦యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ్మస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్న నేపధ్యంలో వరంగల్ హైవే మార్గంలో గ్రీనరీ పెంపుదలకు సహకరించాలని ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కానీ కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో సీఎం గ్రీనరీ పెంపుదలకు చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు సూచించారు.
♦ఈ మేరకు ఘట్ కేసర్ నుంచి రాయగిరి వరకు గతంలో నేషనల్ హైవే సెంట్రల్ మిడెన్ గ్రీనరీ బ్యూటిఫికేషన్ పనులను రూ.5.5 కోట్ల అంచనాలతో, 30 కిలోమీటర్ల పొడవున పూర్తి చేశారు.
♦దీంతో ఈ మార్గం ఆకుపచ్చ అందాలతో కనువిందు చేస్తోంది. ఈ గ్రీనరీని తాజాగా పెంబర్తి వరకు పొడిగించనున్నారు. మరోవైపు హెచ్ఎండీఏ చేపట్టిన గ్రీనరీపైన నేషనల్ హైవే జాయింట్ అడ్వయిజర్ (ప్లాంటేషన్) ఎ.కె.మౌర్య ప్రత్యేకంగా అధ్యయనం చేయడం గమనార్హం.