ఈతకు దిగి ఒకరు.. రక్షించబోయి మరొకరు..
మోపిదేవి, న్యూస్‌లైన్ : ఈత సరదా ఓ బాలుడి ప్రాణాలను బలి తీసుకోగా, అతడిని రక్షించాలన్న ఆతృతలో ఓ యువకుడు నీట మునిగి చనిపోయాడు.. మోపిదేవి మండలం మక్తాలంకలో చెరువులో మునిగి ఇద్దరు మరణించిన సంఘటన ఈ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఓ కుటుంబంలో అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు మృత్యువాత పడగా, మరో కుటుంబంలో ఒక్కగానొక్క కుమారుడు మరణించాడు. ఈ ఘటన రెండు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిలింది.
ప్రాణాలు తీసిన సరదా..
మక్తాలంకకు చెందిన మిత్రులు శ్యాంబాబు, రాయన బాబి(10) సరదాగా గ్రామంలోని కరకట్ట పక్కనున్న చెరువులో ఆదివారం ఈతకు దిగారు. తొలుత గట్టు పక్కన ఆటలాడుకున్నారు. అనంతరం లోనికి వెళ్లి గోతిలో మునిగిపోయారు. ఇది గమనించిన మరో మిత్రుడు మురళి కేకలు వేయటంతో సమీపంలో ఉన్న దాసరి లక్ష్మీనారాయణ(19) చెరువులోకి దూకి తొలుత శ్యాంబాబును రక్షించాడు. అనంతరం బాబిని రక్షించే యత్నంలో అతడూ గోతిలో మునిగి చనిపోయాడు.
కొడుకు.. భర్త... కొడుకు..
రాయన వెంకటేశ్వరమ్మ పెద్ద కుమారుడు ఐదేళ్ల క్రితం మరణించాడు. భర్త అంకిరాజు మూడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. దీంతో రెండో కుమారుడు బాబిని ఆమె అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. స్థానిక ఎంపీపీ పాఠశాలలో ఇతడు ఐదో తరగతి చదువుతున్నాడు. బాబి కూడా ఆకస్మికంగా మరణిం చడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. వరుసగా పెద్ద కుమారుడు, భర్త, రెండో కొడుకు చనిపోవడంతో ఆమె ఒంటరిదయింది.
రక్షించబోయి ప్రాణాలు కోల్పోయాడు...
దాసరి వెంకటేశ్వరరావు, ధనలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు లక్ష్మీనారాయణ ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. కుమారుడిని గారాబంగా పెంచుకుంటున్నారు. లక్ష్మీనారాయణ గతంలో పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. తరువాత కొంతకాలం ఖాళీగా ఉన్నాడు. ఈ ఏడాది పాలిటెక్నిక్ చదివేందుకు సిద్ధపడ్డాడు. లక్ష్మీనారాయణకు ఈత రాదు. అయినప్పటికీ చెరువులో మునిగిన శ్యాంబాబును అందులోకి దిగి రక్షించాడు. బాబిని కూడా రక్షించే యత్నంలో గోతిలో మునిగి చనిపోయాడు. కుమార్తెల తర్వాత పుట్టిన లక్ష్మీనారాయణ ఆకస్మికంగా మరణించటంతో అతడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చెరువులో పొక్లెయిన్‌తో లోతుగా మట్టిని తవ్వడం వల్ల పెద్ద గోతులు ఏర్పడ్డాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అవనిగడ్డ డీఎస్పీ కె.హరిరాజేంద్రబాబు, అవనిగడ్డ సీఐ రమణమూర్తి, ఎస్సై శ్రీనివాస్ ఘటనాస్థలికి వచ్చి, ప్రమాద వివరాలను అడి గి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు.