అందరూ ఆమెను అదో టైపు అంటున్నా..!
సిడ్నీ: ముద్దులొలికే చిన్నారులన్నా.. చిన్నారుల బొమ్మలన్నా అందరికీ ఇష్టమే. అయితే ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన సిల్వియా హెజ్టర్నియోవా(42) అనే మహిళకు మాత్రం ఈ ఇష్టం కాస్త ముదిరింది. ఎంతలా అంటే తన దగ్గర ఉన్న బొమ్మలను నిజంగానే పిల్లలుగా భావించి సినిమాలకు, పిక్నిక్లకు తిప్పేంతలా. ఆమె వ్యవహారం చూసిన వారంతా 'ఆమె కాస్త అదో టైపు' అంటున్నా సిల్వియా మాత్రం 'ఎవరేమనుకున్నా పర్వలేదు నాకు నా బొమ్మలు(పిల్లలు) ముఖ్యం' అంటోంది.
సిల్వియా దగ్గర ఇప్పుడు మొత్తం అచ్చం ప్రాణమున్న చిన్నారుల్లా కనిపించే 35 'రీబార్న్' బొమ్మలు ఉన్నాయి. సిల్వియాకు ఈ బొమ్మలపై ఇంత లవ్ ఎలా స్టార్ట్ అయిందంటే.. సిల్వియా ఇద్దరు కూతుళ్లు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఓ రిబార్న్ బొమ్మను గిఫ్ట్‌గా ఇచ్చారట. అంతే.. కూతుళ్లపై కన్నా ఎక్కువగా బొమ్మలపై ఆమెకు ప్రేమ పెరిగిపోయింది. ఆ బొమ్మ తనను మరోసారి తనను తల్లిని చేసిందని సిల్వియా చెబుతోంది. అలాంటి అందమైన బొమ్మలు ఎక్కడ కనిపించినా డబ్బు గురించి ఏమాత్రం ఆలోచించకుండా కొంటోంది. వాటిని షాపింగ్‌కు తీసుకెళ్లడం, బీచ్‌లకు తిప్పడంతో పాటు విదేశీ విహారానికి సైతం తీసుకెళ్తుందంటే ఇరుగుపొరుగు ఆమెను ఎందుకు అలా అంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.