రెజినాకు రెక్కలొచ్చాయ్!
నటి రెజినాకు రెక్కలొచ్చేశాయి అనే మాట పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తోంది. సాధారణంగా ఆదిలో అవకాశం వస్తే చాలనుకునే నాయికలు సక్సెస్ రాగానే కొత్త నటులతో నటించను, మంచి పాత్ర అయితేనే చేస్తానంటూ షరతులు విధిస్తుండడం చూస్తుంటాం. అలాంటిది నటి రెజినా ఇంకా ఒక స్థాయికి చేరుకోకముందే ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తోంది. తమిళంలో కేడీ బిల్లా కిల్లాడి రంగా చిత్రంలో ఇద్దరిలో ఒక నాయకిగా నటించిన రెజినాకు ఆ చిత్రం విజయం సాధించినా తదుపరి అవకాశం రాలేదు.
దీంతో అవకాశాల కోసం అర్రులు సాచిన ఈ అమ్మడికి తెలుగులో రెండు మూడు అవకాశాలు రావడంతో రెక్కలు వచ్చేసినట్లు ప్రవర్తిస్తున్నట్లు సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇంతకీ రెజినా షరతులేవిటో చూద్దాం!. ప్రస్తుతం తాను తమిళం, తెలుగుభాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నానని పేర్కొంది. ఇప్పుడు ఒప్పుకున్న చిత్రాలను చేయడానికి రెండేళ్లు పడుతుందని చెప్పింది. ఇక కొత్త అవకాశాలను అంగీకరించాలంటే కచ్చితంగా కథ నచ్చాలని అంటోంది.
అదే సమయంలో కథానాయకుడు, పారితోషికం సంతృప్తిగా ఉండాలని పేర్కొంది. అలాంటి పరిస్థితిలోనే నటించడానికి అంగీకరిస్తానని చెప్పింది. మరో విషయం ఏమిటంటే నూతన నటుల సరసన నటించే సమస్య లేదు అని అంది. అందరి మాదిరిగానే తాను డబ్బుకు ప్రాధాన్యత ఇస్తానని అవకాశాల కోసం తన పాపులారిటీని తగ్గించుకోనని నిక్కచ్చిగా చెబుతోందట. అందుకే రెజీనాకు రెక్కలొచ్చాయంటున్నారు సినీ వర్గాలు.