టర్కీ ఘాతుకం: ఎనిమిది మంది అరెస్టు
నైట్ క్లబ్ ఉగ్రదాడిలో ఎనిమిది మంది అనుమానితులను టర్కీ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రీనా నైట్ క్లబ్ లోకి దూసుకువచ్చిన ఆగంతకుడు 39 మందిని కాల్చి చంపిన విషయం తెలిసిందే. దాడిని తామే జరిపినట్లు ఐసిస్ ప్రకటించింది. కాల్పుల అనంతరం దుండగుడు ఉజ్బెకిస్ధాన్ లేదా కజకిస్ధాన్ కు పారిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.
టర్కీలో ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇరాక్ లోని 103 ఐసిస్ స్ధావరాలపై సేనలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 22మంది ఐసిస్ ఉగ్రవాదులు హతమైనట్లు టర్కీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ తెలిపారు. ఉగ్రదాడిలో మరణించిన వారిలో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. అయితే, క్లబ్ కు కూతవేటు దూరంలో పోలీసు స్టేషన్ ఉన్నా కాల్పుల అనంతరం దుండగుడు ఎలా పరారయ్యాడు అనే విషయంపై మాత్రం టర్కీ ప్రభుత్వం ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. కాల్పుల అనంతరం తుపాకీని పారేసిన దుండగుడు జన సమూహంలో కలిసిపోయి తప్పించుకున్నట్లు ఓ రిపోర్టు పేర్కొంది.