కలకలం రేపిన బాలికలు
భీమడోలు(పోలసానిపల్లి) : పోలసానిపల్లిలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల కళాశాల నుంచి బుధవారం తెల్లవారుజామున ముగ్గురు విద్యార్థినులు పరారయ్యారు. దీంతో కళాశాల వద్ద కలకలం రేగింది. ఎట్టకేలకు వారు సూరప్పగూడెంలో ప్రత్యక్షం కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తల్లిదండ్రుల మధ్య విభేదాలతోపాటు కళాశాలలో విద్యార్థినుల మధ్య భేదాభిప్రాయాల వల్లే వారు పరారైనట్టు తెలుస్తోంది. పోలీసులు, కళాశాల సిబ్బంది కథనం ప్రకారం.. పదో తరగతి చదువుతున్న నల్లజర్ల మండలం పుల్లలపాడుకు చెందిన గుంటి నైమిష, ఉంగుటూరు మండలం తల్లాపురానికి చెందిన మాతంగి సుమాని, తొమ్మిదో తరగతి చదువుతున్న దెందులూరు మండలం కొమిరేపల్లికి చెందిన అనప హేమ ముగ్గురూ స్నేహితులు. ఇటీవల దసరా సెలవులకు ఇళ్లకు వెళ్లివచ్చిన వారు అప్పటి నుంచి కలతగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున స్టడీ అవర్ కోసం నిద్రలేచిన ముగ్గురూ బ్యాగులో దుస్తులు సర్దుకుని కాలకృత్యాలకని వెళ్లి కళాశాల వెనుక గోడ నుంచి పరారయ్యారు. ఆ తర్వాత బాలికలు లేరని గుర్తించిన సిబ్బంది వారి ఇళ్లకు వెళ్లి ఆరా తీశారు. దీంతో వారి తల్లిదండ్రులు, బంధువులు పెద్దఎత్తున కళాశాలకు చేరుకున్నారు. రాష్ట్రస్థాయి క్రీడల పోటీల నిమిత్తం కృష్ణాజిల్లా నూజివీడు సమీపంలోని నరసాపురం గ్రామానికి వెళ్లిన ప్రిన్సిపాల్ ఎం.వి.వి.కె.సూర్యారావు విషయం తెలుసుకుని హుటాహుటిన కళాశాలకు వచ్చారు. దీంతో బాలికల బంధువులు ప్రిన్సిపాల్ కారును చుట్టుముట్టారు. ఆయన ఎంత సర్దిచెప్పినా శాంతించలేదు. వాచ్మన్ గంజి నాగేశ్వరరావు నిర్లక్ష్యం వల్లే తమ పిల్లలు తప్పిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో నైమిష తల్లి సుజాత సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్, విద్యార్థుల తల్లిదండ్రులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూరప్పగూడెం ప్రాథమిక పాఠశాలలో బాలికలు క్షేమంగా ఉన్నారని సమాచారం రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం సూరప్పగూడెం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శర్వాణి బాలికలను తీసుకొచ్చి అప్పగించారు. ఎస్ఐ బి.వెంకటేశ్వరరావు వారివద్ద స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఇన్చార్జి సీఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వారి తల్లిదడ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇళ్లకు పంపారు.
దొరికిందిలా..
వెనుకగోడ నుంచి పరారైన బాలికలు పంట పొలాల మీదుగా సూరప్పగూడెం శివారుకు చేరుకున్నారు. అక్కడ ఆ గ్రామ ప్రాథమిక పాఠశాల మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు పద్మ వారిని గమనించారు. వారు భయంభయంగా ఉండడంతో అనుమానం వచ్చి తన ఇంటికి తీసుకెళ్లి అల్పాహారం పెట్టారు. అక్కడి నుంచి పాఠశాలకు తీసుకెళ్లి హెచ్ఎం ఎన్.వి.ఎల్.Ô¶ ర్వాణికి అప్పగించారు. శర్వాణి బాలికలను వాకబు చేశారు. ఈ సందర్భంగా వారు తాము తల్లిదండ్రుల గొడవల వల్ల దూరంగా వెళ్లిపోతున్నట్టు చెప్పారు. దీంతో ఆమె వారికి కౌన్సెలింగ్ ఇచ్చి గురుకుల కళాశాల యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. స్వయంగా తీసుకొచ్చి అప్పగించారు.