టీడీపీ ఎంపీపీ బెదిరిస్తున్నారు
అనంతపురం అర్బన్: తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమిని స్వాధీనం చేసుకోవడానికి రాప్తాడు ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్ తనను బెదిరిస్తున్నాడని రాప్తాడు మండలం బండమీదపల్లి గ్రామానికి చెందిన నారాయణస్వామి మాదిగ వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబిలేసుతో కలిసి బుధవారం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో బుధవారం జరిగిన ఎస్సీ, ఎస్టీ ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఎంపీపీ చేస్తున్న దౌర్జన్యం గురించి వివరించారు. గతంలో తాను ఒక విప్లవ పార్టీకి ఆకర్షితుడై దానిలో చేరానని, ఆ తర్వాత నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని అప్పటి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు అప్పటి జిల్లా ఎస్పీ సమక్షంలో లొంగిపోయానని నారాయణస్వామి మాదిగ తెలిపారు. అప్పట్లో నక్సల్స్ పునరావాసం కింద ప్రభుత్వం ఉపాధి కల్పిస్తామని ప్రకటించినా తనకు న్యాయం జరగలేదన్నారు.
అయితే తమ పూర్వీకుల భూమి సర్వే 207 రెండో లెటర్లో ఉన్న 5.69 ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని తెలిపారు. తన భూమి గ్రామానికి సమీపాన ఉండడంతో ఆ భూమిని ఏలాగైనా సొంతం చేసుకోవాలని ఎంపీపీ తన పలుకుబడిని ఉపయోగించి బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన భూమికి రక్షణ కల్పించాలని కోరారు.
అలాగే..జిల్లాలో అనేక ప్రాంతాల్లో దళితులకు శ్మశాన వాటికలు లేవని, వాటికి వెంటనే స్థలాలు కేటాయించాలని మాదిగ జేఏసీ జిల్లా యువసేన అధ్యక్షుడు వి.రమణ మాదిగ, రాష్ర్ట కో-కన్వీనర్ చిన్నపెద్దన్న మాదిగ అధికారులకు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో కాంట్రాక్టు వర్కర్లకు తొమ్మిది నెలల నుంచి వేతనాలు అందలేదని ఏపీ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ, ఎస్టీ, బీసీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ నాల్గో తరగతి ఉద్యోగ సంఘం నేతలు బండారు నాగేశ్వరరావు, సి.నారాయణ, కె.జోసఫ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వేతనాలు మంజూరు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
సకాలంలో సమస్యలు పరిష్కరించాలి : సకాలంలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి సూచించారు. 15 రోజుల లో 50 శాతం ఫిర్యాదులు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. షెడ్యూల్డ్ కులాల కుటుంబాల గృహ విద్యుత్ రాయితీ కింద జిల్లాలకు 2014-15లో రూ. 13.67 కోట్లు ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఇన్చార్జ్ కలెక్టర్ బి.ల క్ష్మీకాంతం మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల సమస్యలపై అందిన 2,055 ఫిర్యాదులలో 1,845 పరిష్కరించామని తెలిపారు.
పెండింగ్ లో ఉన్న 210 పిటిషన్లను పది రోజులలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్లో 39, ఐసీడీఎస్‌లో 6, డీఆర్డీఏలో 7, డ్వామాలో 8, పోలీసుశాఖలో 48, ఎల్డీఎంలో 60, డీపీవో 3, ఆర్డబ్ల్యూఎస్ 7, వ్యవసాయశాఖలో 8 పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ సెల్లో అదనపు సంయుక్త కలెక్టర్ సయ్యద్ ఖాజామొహిద్దీన్, డీఆర్వో హేమసాగర్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మల్యాద్రి, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ పాల్గొన్నారు.