తెలంగాణలో జీసీసీకి పునరుజ్జీవం
మన్ననూర్ : విభజనతో స్తంభించిన గిరిజన కో–ఆపరేటివ్ సంస్థ (జీసీసీ) కార్యక్రమాలకు పునరుజ్జీవం కల్పిస్తామని తెలంగాణ రీజినల్ మేనేజర్ సీతారాంనాయక్ అన్నారు. సోమవారం అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్‌లో జీసీసీ సిబ్బందితో సమీక్షించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆటవీ ఉత్పత్తుల సేకరణకు ఏటా ఆ శాఖతో ఒప్పందం కుదుర్చుకునేదన్నారు. రెండు రాష్ట్రాల విభజన ప్రక్రియ కారణంగా అది జరగలేదన్నారు.
ప్రస్తుతం సంస్థ సబ్ డిపోలతోపాటు మన్ననూర్ డీఆర్లోనూ ఉత్పత్తులు తిరిగి కొనుగోలు చేస్తున్నామన్నారు. తెలంగాణ మూడు డివిజన్లకు మాత్రమే పరిమితమైందని, సిబ్బంది కొరత వేధిస్తోందన్నారు. జీసీసీని లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు అందరూ శ్రమించాల్సి ఉందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బ్రాంచ్ మేనేజర్ ఆశీర్వాదం, అకౌంటెంట్ అల్లాజీ పాల్గొన్నారు.