ఇదీ మన ఎమ్మెల్యేల తీరు!
శాసనసభలో మౌన ముద్ర
చర్చల్లో పాల్గొంటున్నది ముగ్గురే?
216 చర్చల్లో పాల్గొని మంత్రి జయచంద్ర టాప్
80 చర్చల్లో పాల్గొన్న విపక్ష నేత శెట్టర్
అన్ని చర్చల్లోనూ పాల్గొని ఎమ్మెల్యే శివలింగే గౌడ రికార్డు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన సభలో 28 మంది ఎమ్మెల్యేలు ఒక్కటంటే ఒక్క ప్రశ్న అడిగిన పాపాన పోలేదు. ప్రతిపక్షాలు ఎదురు దాడికి దిగినప్పుడు ప్రభుత్వాన్ని వెనకేసుకుని రావాల్సిన బాధ్యత మంత్రులపై ఉంది. అయితే అలాంటి సందర్భాల్లో ముఖ్యమంత్రి, మరో ఇద్దరు మంత్రులు మినహా మిగిలిన వారు మౌన ముద్ర దాల్చారు.
14వ శాసన సభ తొలి మూడు సమావేశాలకు సంబంధించి, ఎమ్మెల్యేల పనితీరుపై విశ్లేషణలతో కూడిన నివేదికను రిజోర్స్ రీసెర్చ్ ఫౌండేషన్ గురువారం ఇక్కడ విడుదల చేసింది. దాని ప్రకారం...ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, న్యాయ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి టీబీ. జయచంద్ర, రెవెన్యూ శాఖ మంత్రి వీ. శ్రీనివాస ప్రసాద్‌లు మాత్రమే చర్చల్లో పాల్గొని ప్రభుత్వ విధానాలను సమర్థించుకుంటున్నారు.
సంతాప, అభినందన తీర్మానాల్లో అనేక మంది మంత్రులే కాకుండా శాసన సభ్యులూ పాల్గొనడం లేదు. మొత్తం 216 చర్చల్లో పాల్గొనడం ద్వారా మంత్రి జయచంద్ర సమర్థుడుగా పేరు తెచ్చుకున్నారు. సిద్ధరామయ్య 125, ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ 80 చర్చల్లో పాల్గొన్నారు. హాసన జిల్లా అరసీకెరె ఎమ్మెల్యే కేఎం. శివలింగే గౌడ దాదాపు అన్ని చర్చల్లో పాల్గొనడం ద్వారా రికార్డు సృష్టించారు. ప్రజా సమస్యలపై ఎలుగెత్తడంలో ఆయన తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. 43 మంది ఎమ్మెల్యేలు ‘మనకెందుకొచ్చిందిలే’ అని చర్చల్లో పాల్గొనలేదు. మాజీ మంత్రులు, అనేక సార్లు గెలుస్తూ వస్తున్న ఎమ్మెల్యేలు కూడా చర్చలకు దూరంగా ఉండడం ప్రజాస్వామ్య ప్రియులకు ఆందోళన కలిగిస్తోంది.
సజావుగా సమావేశాలు
గత ఏడాది కాలంలో శాసన సభ మూడు సార్లు 51 రోజుల పాటు సమావేశమైంది. 286.31 గంటల పాటు సభా కార్యకలాపాలు సాగాయి. ఇందులో ఆరు గంటల సేపు వివిధ కారణాల వల్ల ఆటంకం కలిగింది. రోజుకు సగటున 5.37 గంటల పాటు సభ సమావేశమైంది. సభ్యులు మొత్తం 6,440 ప్రశ్నలు వేశారు. ఏ ఒక్క సభ్యుడూ ప్రైవేట్ బిల్లును ప్రవేశ పెట్టలేదు. పది ప్రైవేట్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి నివేదించినా, వాటికింకా మోక్షం లభించలేదు. శాసన సభ హామీల కమిటీ ఈ మూడు సమావేశాల్లో ఒక్క నివేదికనూ సమర్పించలేదు. ఒకే రోజు దిగువ, ఎగువ సభల్లో ఎనిమిది బిల్లులకు ఆమోదం లభించింది.
మార్పు వస్తుందనే ఆశతో...
ఈ నివేదిక ద్వారా ఎమ్మెల్యేల పని తీరులో ఏ కొద్ది మార్పు వచ్చినా ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని ఫౌండేషన్ డెరైక్టర్ కేవీ. నరేంద్ర తెలిపారు. ఈ నివేదిక రూప కల్పనలో శాసన సభ సచివాలయం తమకు సహకరించిందని చెప్పారు. సమావేశాల సందర్భంగా మంత్రులు లేదా ముఖ్యమంత్రి ఇచ్చే హామీలు ఎంతవరకు అమలయ్యాయనే విషయమై సరైన సమాచారం లేదని తెలిపారు. హామీలు ఏ దశలో ఉన్నాయో....గత మూడు సమావేశాల్లో నివేదిక సమర్పించలేదని ఆయన చెప్పారు.