RJ Chaitu
-
అందువల్లే ఆర్జే చైతూ ఎలిమినేట్ అయ్యాడా?
బిగ్‌బాస్.. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. గెలుస్తారనుకున్నవాళ్లు ఓడిపోనూవచ్చు. ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సినవాళ్లు ఫినాలేకు చేరుకోనూవచ్చు. మరీ ముఖ్యంగా ఊహించని కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవనూ వచ్చు. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నామో మీకీపాటికే అర్థమై ఉంటుంది. అవును, ఆర్జే చైతూ ఎలిమినేట్ అయినందుకే! అతడి ఆట అందరికీ నచ్చిందా? అన్నది పక్కన పెడితే అతడు గేమ్ ఆడాడు. హౌస్‌లో తను ఉన్నాడన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ నాలుగోవారంలోకి అడుగుపెట్టినా ఇప్పటికీ కొంతమంది కంటెస్టెంట్లు ఉన్నాలేనట్లుగానే వ్యవహరిస్తున్నారు. మరి వారందరూ ఉండగా గేమ్ ఆడుతూ, అందులోనూ సీనియర్ కంటెస్టెంట్లను ముప్పు తిప్పలు పెట్టి గేమ్‌ను రఫ్ఫాడించిన ఆర్జే చైతూ ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు? అందుకు కారణాలేంటో చూద్దాం.. మూడోవారం నామినేషన్స్‌లో మిత్ర శర్మ, శివ, చైతూ, తేజస్వి, అజయ్, స్రవంతి, అఖిల్, మహేశ్, హమీదా, నటరాజ్, అరియానా, బిందు మాధవి ఉన్నారు. ఎలిమినేషన్ చివరి రౌండ్లో స్రవంతి, చైతూ ఇద్దరే మిగిలారు. చాలామటుకు అందరూ స్రవంతి హౌస్‌ను వీడటం ఖాయం అనుకున్నారు. కానీ బిగ్‌బాస్ చైతూ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించడంతో అటు హౌస్‌మేట్స్‌తో పాటు బిగ్‌బాస్ ప్రేక్షకులు సైతం ఖంగు తిన్నారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న కెప్టెన్సీ పవర్‌ను అనుభవించకుండానే హౌస్‌ను వీడి వచ్చేశాడు. ఇక్కడ అర్థం కాని విషయమేంటంటే నామినేషన్స్‌లో చైతూ కంటే తక్కువ ఫ్యాన్ బేస్ ఉన్నవాళ్లుకూడా ఉన్నారు. అయినా చైతూకి పెద్దగా ఓట్లు పడకపోవడానికి ఒకరకంగా అఖిల్ కూడా కారణమే! ఇద్దరూ ఫ్రెండ్సే అయినప్పటికీ బిగ్‌బాస్ హౌస్‌లో ఇద్దరికీ పొసగకపోవడం, ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం, మాటలు విసురుకోవడం, తగాదాలు పెట్టుకోవడం.. ఫైనల్‌గా ఈ గొడవ చైతూకే మైనస్ అయింది. అఖిల్ ఫ్యాన్స్ నామినేషన్లో ఉన్న అతడితో పాటు, అతని ఫ్రెండ్ స్రవంతికి ఓట్లు గుద్దారు, ఫలితంగా చైతూ వెనకబడిపోయాడు. ఇక చైతూ తనకు సంబంధం లేని విషయాల్లో దూరుతున్నాడన్న ఆరోపణ కూడా ఉంది. దీంతో చైతూ కాస్త అతి చూపిస్తున్నాడని తిట్టుకునేవాళ్లు కూడా లేకపోలేదు. నిజానికి వారియర్స్ వర్సెస్ చాలెంజర్స్ మధ్య నడిచిన పోరులో చాలెంజర్స్ తరపున గట్టిగా మాట్లాడింది చైతూనే. ఎవరితోనూ పులిహోర కలపకుండా ముక్కుసూటిగా మాట్లాడుతూ తన గేమ్ తను ఆడాడు. కానీ చివరాఖరకు బిగ్‌బాస్ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్‌కు బలవక తప్పలేదు. చదవండి: థియేటర్లలో మూవీ చూడక చాన్నాళ్లయింది.. మంచి సినిమా ఉంటే... -
షాకింగ్, కెప్టెన్‌ను ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్!
బిగ్‌బాస్.. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కొన్నిసార్లు మన అంచనాలు నిజమైనా అప్పుడప్పుడు మాత్రం బొక్క బోర్లా పడక తప్పదు. రంజుగా సాగుతున్న బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షోలో ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తుంది కొద్దిమంది కంటెస్టెంట్లే! అదేంటో కానీ, ఆ కొద్దిమందిలో ఒక్కొక్కరూ ఎలిమినేట్ అవుతూ వస్తుండటం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. మొదటివారం ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అవగా రెండో వారం వారియర్స్‌కు టఫ్ ఫైట్ ఇస్తూ ఆడిన శ్రీరాపాక ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. తాజాగా మూడో వారం కూడా చాలెంజర్స్‌లో నుంచి ఒకరు ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. లీకువీరులు లీక్ చేసిన సమాచారం ప్రకారం ఆర్జే చైతూ ఎలిమినేట్ అయ్యాడట! ఈవారం కెప్టెన్సీ టాస్క్‌లో సత్తా చూపి కెప్టెన్‌గా అవతరించిన చైతూకి ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేకపోయిందని తెలుస్తోంది. ఇతడికి ఆర్జే కాజల్, యాంకర్ శ్రీముఖి, నేహాచౌదరి సహా పలువురు సెలబ్రిటీల నుంచి మద్దతు ఉన్నప్పటికీ అతడికే తక్కువ ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. చివరి రెండు స్థానాల్లో శివ, చైతూ ఉండగా చివరికి ఆర్జేకే అతి తక్కువ ఓట్లు పడటంతో అతడిని పంపించేసినట్లు కనిపిస్తోంది. వారియర్స్‌ను ముప్పులు తిప్పలు పెట్టిన చైతూ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా? చివరి నిమిషంలో మరెవరైనా హౌస్ నుంచి బయటకు వచ్చేశారా? అన్నది రేపు తేలనుంది. చదవండి: హీరోయిన్ కోసం 16 గంటలు వెయిట్ చేసిన రిషబ్ పంత్ ! బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ ఎవరో చెప్పేసిన కౌశల్ మండా -
అతడిని కెప్టెన్‌గా గెలిపించిన అఖిలే నంబర్ 1!
బిగ్‌బాస్ ఓటీటీ రంజుగా సాగుతోంది. హౌస్మేట్స్ చేసిన తప్పులకు కెప్టెన్ అనిల్ శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఇంటిసభ్యులు పట్టపగలు నిద్రపోతున్నా చూసీచూడనట్లు వదిలేయడం, మైకులు ధరించాలన్న నిబంధనకు కొందరు నీళ్లు వదలడంతో బిగ్‌బాస్ మండిపడ్డాడు. అనిల్ తన విధులు సరిగా నిర్వర్తించలేదంటూ కెప్టెన్సీ నుంచి అర్ధాంతరంగా తొలగించాడు. అయితే మెజారిటీ హౌస్మేట్స్ అనిల్ కెప్టెన్సీ సరిగ్గానే ఉందంటూ ఓటేయడంతో రెండు వారాలపాటు కెప్టెన్సీకి నేరుగా పోటీ చేసే అవకాశాన్ని గెలుచుకున్నాడు. దీంతో మూడోవారంలో కెప్టెన్సీ కంటెండర్స్‌లో అనిల్ కూడా ఉన్నాడు. ఇతడితో పాటు అషూ, అరియానా, శివ, చైతూ, అజయ్, హమీదా కెప్టెన్సీకి పోటీపడ్డారు. వీరిలో చైతూ గెలవగా అతడిని గెలిపించింది మాత్రం అఖిలే కావడం విశేషం. మరోపక్క అషూ కెప్టెన్ కాలేకపోయానని కంటతడి పెట్టుకుంది. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు అఖిల్ మీద పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 'అఖిల్ గేమ్‌లో దిగితే వేరే విషయాలు, గొడవలు పట్టించుకోడు', 'చైతూ అఖిల్‌ను సిల్లీ రీజన్స్‌తో నామినేట్ చేసినా అతడు అవేమీ పట్టించుకోకుండా కెప్టెన్ అవడానికి సాయం చేశాడు', 'అఖిలే నంబర్ 1' అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: నటి కావ్యశ్రీ బెంగళూరు ఇంటిని చూశారా? -
సిగరెట్ల కోసం ఏడుస్తుంది, ముమైత్ ముఖం చూడబుద్ది కాదు: చైతూ
ఏడాదికోసారి వచ్చే బిగ్‌బాస్ షో అంటే బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. అంతలా షోను ఆదరించేవారి కోసం బిగ్‌బాస్ ఓటీటీని ప్రవేశపెట్టారు నిర్వాహకులు. ఇదివరకే పరియమున్న కంటెస్టెంట్లతోపాటు కొత్తవాళ్లను సైతం షోలోకి ఆహ్వానించి గేమ్ మొదలు పెట్టారు. అలా కొత్త, పాతల కలయికతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ మొదలైంది. మరి బిగ్‌బాస్ షోలో ఏం జరుగుతోంది? ఎవరు కెప్టెన్ అయ్యారు? చైతూకు, ముమైత్‌కు మధ్య గొడవకు కారణమేంటి? అన్న విషయాలు మార్చి 4 నాటి ఎపిసోడ్లో చూసేద్దాం.. స్మోకింగ్ రూమ్‌లో దమ్ము లాగుతూ ముమైత్ ఏడుస్తుండటంతో ఆమెను ఊరడించే ప్రయత్నం చేసింది అషూ. ఆమెను ఎలాగైనా నవ్వించాలనుకున్న అషూ అందుకు అఖిల్‌ను పావుగా వాడుకుంది. ఆ సీజన్లో ఆమె(మోనాల్)ను, ఈ సీజన్‌ను ఈమె(ముమైత్)ను ఎందుకు ఏడిపిస్తున్నావ్? అని సరదాగా కౌంటర్లు వేసింది. కానీ ఆమె మాటలకు అఖిల్ హర్టవడంతో తప్పు తెలుసుకున్న బ్యూటీ అతడికి క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ ఆ బాధలో నుంచి అంత త్వరగా తేరుకోలేకపోయిన అఖిల్ మోనాల్ గుర్తొస్తోందని బాధపడ్డాడు. తర్వాత బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఉదయం లేవగానే ఎవరి ముఖం చూడాలనుకుంటారు? ఎవరి ముఖం చూడొద్దనుకుంటారో చెప్పాలన్నాడు. మొదటగా చైతూ మాట్లాడుతూ.. బిందుమాధవి ముఖం చూస్తే రోజంతా హ్యాపీగా ఉంటుందంటూ ఆమెకు హార్ట్ సింబల్ బ్యాడ్జ్ పెట్టాడు. పొద్దున లేవగానే బిగ్‌బాస్‌తో గొడవలు పడే ముమైత్ ఖాన్ ముఖం చూడకూడదనుకుంటున్నానని అసహ్యపు ఎమోజీ ఉన్న బ్యాడ్జ్ పెట్టాడు. తర్వాత తేజస్వి ముమైత్‌కు హార్ట్ బ్యాడ్జ్, కుళ్లు జోకులేసే అజయ్ ముఖం చూడొద్దనుకుంటున్నానని అతడికి అసహ్యపు బ్యాడ్జ్ పెట్టింది. యాంకర్ స్రవంతి.. తేజస్వికి హార్ట్ బ్యాడ్జ్, తొడపాశం పెడతానన్న అజయ్‌కు అసహ్యపు బ్యాడ్జ్ ఇచ్చింది. అషూ.. నటరాజ్ మాస్టర్‌కు హార్ట్, శివకు అసహ్యపు బ్యాడ్జ్ పెట్టింది. ఓ వైపు టాస్క్ జరుగుతుండగానే ముమైత్ ఏడుపందుకుంది. తెలుగు సరిగా రాదు కాదు కాబట్టి సరిపోయింది, లేకపోతే గుద్దుతా, నాన్సెన్స్, నన్ను టార్గెట్ చేస్తున్నాడు, నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అంటూ చైతూ ఫైర్ అయింది ముమైత్. పొద్దుపొద్దునే సిగరెట్ల కోసం ఏడుస్తుంది, అలా పొద్దున ఏడవకూడదని చెప్పాను. అది తప్పా? అని ఫ్రస్టేట్ అయ్యాడు చైతూ. వీళ్ల మధ్య ఇలా గొడవ కొనసాగుతున్న సమయంలోనే కెప్టెన్సీ టాస్క్ జరగ్గా ఇందులో తేజస్వి గెలిచి మొదటి కెప్టెన్‌గా అవతరించింది. తేజస్వి నటరాజ్ మాస్టర్‌ను రేషన్ మేనేజర్‌గా ఎన్నుకుంది. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ కెప్టెన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. పర్మినెంట్‌గా బెడ్రూమ్ యాక్సెస్, లగేజీ ఉంచుకునే అవకాశాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారని అడగ్గా తేజస్వి.. అషూ పేరు చెప్పింది. దీంతో అషూ వారియర్స్‌తో పాటు బెడ్రూమ్లో నిద్రించే అవకాశం దక్కించుకుంది. -
అషూ మీద నీళ్లు ఉమ్మేసిన చైతూ, షాకైన హౌస్మేట్స్
బిగ్‌బాస్ ప్రారంభమై మూడు రోజులయ్యిందో లేదో ఆట మొదలుపెట్టేశారు కంటెస్టెంట్లు. వారికి వారే టాస్కులు ఇచ్చుకుంటూ సరదాగా కాలం గడుపుతున్నారు. దీంతో బిగ్‌బాస్ వీరికో చాలెంజ్ విసిరాడు. సీనియర్స్‌లా భావిస్తున్న వారియర్స్‌కు షాకిస్తూ చాలెంజర్స్‌కు ఆధిపత్యం చెలాయించే అవకాశమిచ్చాడు. ఛాలెంజర్స్ అనుమతి లభించిన ఒక వారియర్ మాత్రమే బెడ్రూమ్లో నిద్రపోయే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. అంతేకాదు, వారియర్స్‌కు సంబంధించిన లగేజ్ నుంచి ఒక్కో వారియర్ ఐదు వస్తువులు మాత్రమే తీసుకోవాలని, అవి తీసుకోవడానికి చాలెంజర్స్ అనుమతి పొందాలని మెలిక పెట్టాడు. చాలెంజర్స్ భోజనం చేశాక వారియర్స్ విందు ఆరగించాలని కండీషన్ పెట్టాడు. వారియర్స్ అందరూ మాజీ కంటెస్టెంట్లే కాబట్టి వారికి హౌస్‌ను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలన్న అవగాహన ఉంటుంది. దీంతో ఇంటి పనులన్నీ వారియర్స్‌కే అప్పజెప్పాడు. ఒకవేళ పనులు చేయకపోతే జూనియర్స్ అయిన చాలెంజర్స్ వారిని శిక్షించవచ్చన్నాడు. ఇక వారియర్స్‌తో సేవలు చేయించుకునే అవకాశం ఉండటంతో చైతూ అషూను ఓ ఆటాడుకున్నాడు. మంచినీళ్లు తీసుకురమ్మని చెప్పడంతో ఆమె బాటిల్లో నీళ్లు పట్టుకొచ్చింది. దాన్ని తాగించమని చైతూ అడగడంతో ఆమె అలానే తాగించింది. అలా తాగిస్తున్న క్రమంలో చైతూ నోట్లో ఉన్న నీళ్లను ఊసేయడంతో అవి అషూ మీద పడ్డాయి. ఈ చర్యతో అక్కడున్న హౌస్మేట్స్ ఒక్కసారిగా షాకయ్యారు. నోట్లో నీళ్లు ఎక్కువవడం వల్ల అలా ఊసేశానని చైతూ క్లారిటీ ఇవ్వడంతో అషూ దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అయితే చైతూ కావాలనే అలా చేశాడంటూ నెట్టింట ప్రచారం జరుగుతుండటం గమనార్హం. -
నామినేషన్స్‌లో బాడీ షేమింగ్! ఏడ్చేసిన నటరాజ్, చైతూ
బిగ్‌బాస్.. ఆరడుగుల దూరం నుంచి చూసే ఈ షో అరచేతిలో నుంచి చూసేంత దగ్గరయ్యైంది. బుల్లితెర నుంచి మొబైల్ ఫోన్లో చూసేందుకు వీలుగా ఓటీటీలోకి వచ్చేసింది. కొత్త, పాత కంటెస్టెంట్ల కలయికతో బిగ్‌బాస్ నాన్‌స్టాప్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. వచ్చీరావడంతోనే పరిచయాలే కాదు పోట్లాటలు కూడా మొదలు పెట్టేశారు కంటెస్టెంట్లు. ఒకరినొకరు తెలుసుకునే క్రమంలో గొడవలు రాజుకుంటున్నాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా దీనికి నామినేషన్ ప్రక్రియ తోడైంది. వారియర్స్, చాలెంజర్స్ మధ్య జరిగిన నామినేషన్ రసాభాసగా మారింది. ఈ ప్రక్రియలో పాల్గొన్న చైతు తనను బాడీ షేమింగ్ చేస్తున్నాడంటూ నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేశాడు. దాదాపు చాలెంజర్స్ అందరూ నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేశారు. దీంతో తనను టార్గెట్ చేశారంటూ మాస్టర్ కంటతడి పెట్టుకున్నాడు. నేను అందరికీ ఆదర్శంగా నిల్చుంటానే తప్ప బాడీ షేమింగ్ చేయలేదంటూ మోకాలి మీద కూర్చుని ఏడ్చేశాడు. అయితే తాను చిన్నప్పటి నుంచి బాడీ షేమింగ్ కామెంట్లు ఫేస్ చేస్తున్నా కాబట్టే తట్టుకోలేకపోయానని కన్నీళ్లు పెట్టుకున్నాడు చైతు. వారియర్స్ అందరూ ఏకాభిప్రాయంతో మిత్ర శర్మ, చైతూను నామినేట్ చేశారు. ఫైనల్‌గా తొలివారం నటరాజ్ మాస్టర్, సరయు, హమీదా, మిత్ర శర్మ, ఆర్జే చైతూ, అరియానా, ముమైత్ ఖాన్ నామినేషన్స్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేషన్ గండం గట్టెక్కుతారు? ఎవరు వచ్చిన వారంలోనే బయటకు వెళ్లిపోతారు? అనేది చూడాలి! Nominations bringing out the True Emotions!!⚔️😱💥💥 It's 🔥🔥🔥🔥 in the House, ofcourse with Nonstop entertainment!! #Biggboss #BiggBossTelugu #BiggBossNonStop @DisneyPlusHS @EndemolShineIND pic.twitter.com/n8XQVlJMLd — DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 28, 2022 -
అదే నా డ్రీమ్ అంటున్న ఆర్జే చైతూ
ఈయన నోరు తెరిచాడంటే ఆనకట్ట వేయడం కష్టం. అతడే ఆర్జే చైతూ. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన అతడు కుటుంబ పోషణ కోసం ఎంతగానో కష్టపడ్డాడు. విజయవాడకు చెందిన చైతూ హైదరాబాద్‌కు వచ్చి డిగ్రీ చదువుతూ, యానిమేషన్స్ చేసుకుంటూనే రకరకాల ఉద్యోగాలు చేశాడు. కానీ ఎప్పుడైతే ఆర్జేగా మారాడో అప్పుడే అతడి దశ తిరిగిపోయింది. ఇప్పటివరకు ఆరు జాతీయ అవార్డులు అందుకున్నాడు చైతు. కనిపించకుండా వినిపించిన అతడు బిగ్‌బాస్ షోలో కనిపించబోతున్నాడు. అయితే తల్లికి డ్రీమ్ హౌస్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు చైతు. అయితే భోజన ప్రియుడైన చైతూకు నాగార్జున చికెన్ పిజ్జాను తినిపించాడు. దీంతో సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు చాటర్‌బాక్స్ చైతూ. మరి ఈ ఆర్జే షోలో ఎన్నివారాలు ఉండగలుగుతాడు? అతడి వాగ్ధాటిని మిగతావాళ్లు తట్టుకుంటారో లేదో చూడాలి!