కమిటీలొద్దు..సమైక్యమే ముద్దు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: కమిటీలతో తమకు అవసరం లేదని, తక్షణమే విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక కో చైర్మన్, జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంపత్‌కుమార్ కోరారు. సమైక్యాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధన కోసం సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మూడో రోజు ఆదివారం కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, ప్రజా, విద్యార్థి సంఘాలు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నాయని తెలిపారు. ఉద్యమం తీవ్రత ఢిల్లీ దృష్టికి పోతోందని.. దీంతో ఆంటోని కమిటీ వచ్చిందన్నారు. తాజాగా ప్రభుత్వ కమిటీని కేంద్రం ప్రకటించిందని వివరించారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అన్ని ఉద్యోగ సంఘాలు సమ్మెలోకి వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి, భావి తరాల అభ్యున్నతికి కోసం ఉద్యమం చేస్తున్నట్లు చెప్పారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ క్రిష్టఫర్ దేవకుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు చేపట్టిన నిరవధిక సమ్మెను అన్ని వర్గాలు అభినందిస్తున్నాయన్నారు. ప్రభుత్వ వాహన డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షుడు, సర్దార్ అబ్దుల్‌హమీద్, ఇతర ప్రతినిధులు వెంకటేశ్వర్లు, జానకిరామ్, ఎస్ఏఎం.దాస్, లక్ష్మన్న, కరీమ్, జాకీర్ బాష, గోవిందు, రాజారావు, బాలస్వామి, బాషుమియ్య, విభీషణరావు, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ప్రతినిధులు ఎంవి.క్రిష్ణారెడ్డి, ఎంఎస్ఆర్ వరప్రసాద్, మురళీమోహన్‌రెడ్డి, కమలాకర్, రవికుమార్, రాఘవరెడ్డి, జనార్దన్ రెడ్డి, ఖాజా మోద్దీన్, మజహర్ ఉసేన్, చాంద్‌బాష, కె.శేఖర్, రాంగోపాల్ రెడ్డి, రమేష్ నాయక్, ఎం.శివరామ్ తదితరులు దీక్షల్లో కూర్చున్నారు. వీరికి పలు ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి.