నేరచరిత్రలోనే ఇది రికార్డ్
- రూ. 2000కోట్ల విలువైన 18,500 కేజీల డ్రగ్స్ పట్టివేత
- ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ థానేలో చిక్కిన డ్రగ్స్ మాఫియా
భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలను నగరంలోకి సరఫరాచేస్తూ ఆర్థిక రాజధాని ముంబైని మత్తులో ముంచే కుట్రలు చేస్తోన్న డ్రగ్స్ మాఫియా మరింత బరితెగించింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో అంతర్భాగమైన థానే కేంద్రంగా అక్రమ వ్యాపారాన్ని రాన్ని నడుపుతోంది. ఇప్పటికే పలుమార్లు భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడగా శనివారం దేశచరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో మాదకద్రవ్యాలు లభించాయి. థానేలోని ఓ ప్రాంతం నుంచి ఒకేసారి 18.5 టన్నుల మాదకద్రవ్యాలను(ఎఫిడ్రిన్) స్వాధీనం చేసుకున్నట్లు థానే నార్కోటిక్స్ డిపార్ట్ మెంట్ తెలిపింది. పట్టుబడిన డ్రగ్స్ విలువ 2 వేల కోట్లకు పైమాటేనని, ఇంత మొత్తంలో డ్రగ్స్ ఒకేసారి పట్టుకోవటం ఇది మొదటిసారని నార్కొటిక్స్ అధికారులు అంటున్నారు. ఈ రాకెట్ కు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు.
థానే కేంద్రంగా సాగుతోన్న డ్రగ్స్ మాఫియాపై ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్న పోలీసులకు గడిచిన రెండేళ్ల కాలంగా తరచూ మాదకద్రవ్యాలు దొరుకుతున్నాయి. మూడురోజుల కిందటే వసంత్ విహార్ ప్రాంతంలో దాదాపు రూ.3 కోట్లు విలువ చేసే ఏడు కేజీల మాదకద్రవ్యాలను పోలీసులు కనుగొన్నారు. అంతకు ముందురోజు ముంబైకి తరలించేందుకు సిద్ధంగా ఉన్న రూ. 270 కోట్ల విలువైన డ్రగ్స్ ను గుజరాత్ లో పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. రూ.2వేల కోట్ల డ్రగ్స్ వ్యవహారంపై కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.