విమాన ప్రయాణికులకుతీపి కబురు..
రూ.25వేల వరకు డ్యూటీ ఫ్రీ షాపింగ్
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులు ఇకపై దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని డ్యూటీ ఫ్రీ షాపుల్లో రూ.25వేల వరకు షాపింగ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ పరిమితి రూ.5 వేలుగానే ఉండగా... దీన్ని పెంచాలంటూ ప్రయాణికుల నుంచి పలు అభ్యర్థనలొచ్చాయి. దీంతో డ్యూటీ ఫ్రీ షాపింగ్ పరిమితిని ఐదు రెట్లు పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ) ఆదేశాలు జారీ చేసింది. అలాగే, బ్యాంకులు ప్రకటించే విదేశీ కరెన్సీ మారకపు రేట్లను డ్యూటీ ఫ్రీ షాపుల్లో ప్రదర్శించాలని కూడా కోరినట్టు సీబీఈసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని డ్యూటీ ఫ్రీ షాపులు, విమానాశ్రయాలు తమ వెబ్ సైట్లలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని కూడా ఆదేశించామన్నారు.