జీఎంసీ అధికారులపై ముగిసిన విచారణ
అరండల్‌పేట: నగరపాలకసంస్థ ఉన్నతాధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ ముగిసింది. జీఎంసీ ఉన్నతాధికారులను విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేకా విచారణాధికారి సాంబశివరావు గురు, శుక్రవారాలు రెండురోజులపాటు కార్పొరేషన్లో విచారణ నిర్వహించారు. శుక్రవారం ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ నిర్మాణాలు తనిఖీచేశారు. భవన నిర్మాణానికి ఇచ్చిన అనుమతుల ఫైల్స్, ఆ ప్రాంతానికి చెందిన బిల్డింగ్ ఇన్స్పెక్టర్లతో కలిసి ఆయన భవనాలను తనిఖీచేశారు.
తొలుత అమరావతిరోడ్డులో నిర్మించిన ఓ ఫంక్షన్‌హాల్‌తో పాటు బ్రాడీపేటలోని ఓ బంగారు నగల దుకాణం, అరండల్‌పేటలోని ఓ భనం, ముత్యాలరెడ్డి నగర్లో నిర్మించిన వాణిజ్య సముదాయం, ఆటోనగర్‌లో నిర్మించిన భవన సముదాయాలను ఆయన తనిఖీ చేశారు. భవన నిర్మాణానికి తీసుకున్న ప్లాన్‌ను అతిక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఆయన వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో సెట్‌బ్యాక్స్ వదలలేదని, అటువంటి వాటికి ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్ మంజూరు చేయలేదని తెలిపారు. అనంతరం ఆయన కార్పొరేషన్ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశమందిరంలో ఇంజినీరింగ్ విభాగం అధికారులను విచారించారు. సంబంధిత ఫైల్స్‌ను ఆయన తనిఖీచేశారు.
బిల్లుల చెల్లింపులపై అకౌంట్స్ విభాగం అధికారులతో మాట్లాడారు. అనంతరం ప్రజారోగ్యవిభాగంలోజరిగిన మందుల కొనుగోళ్లు, అందుకు సంబంధించిన బిల్లులను పరిశీలించారు. ఎంహెచ్‌ఓలుగా పని చేసిన విక్టర్‌బాబు, నరసింహారావు నియామకాలకు సంబ ంధించిన ఫైల్స్‌ను తీసుకున్నారు. రెవెన్యూ అధికారుల నియామకం, మేనేజరు పోస్టు భర్తీ తది తర అంశాలపై ఆయన విచారణ జరిపారు. ఆయన మాట్లాడుతూ ప్రాథమిక విచారణ జరిపామన్నారు. పూర్తినివేదికను రాష్ట్ర పురపాలకశాఖ డెరైక్టర్ వాణీమోహన్‌కు అందజేస్తామన్నారు. దీని ఆధారంగా తదుపరి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.