ప్రధాని మోదీపై పాక్ మాజీ క్రికెటర్ వివాదాస్పద వ్యాఖ్యలు
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సయీద్ అన్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అజాన్ (ముస్లింల ప్రార్ధనా సమయానికి ముందు ఇచ్చే పిలుపు) ఇచ్చేటప్పుడు మోదీ ఎన్నిసార్లు ప్రసంగాలు ఆపినా సైతాన్ ఆవహించిన హిందువుగానే మిగిలిపోతాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. మసీదులా కనిపిస్తున్న ఓ ప్రదేశంలో జన సమూహం ముందు అన్వర్ భారత ప్రధానిపై అవాక్కులు చవాక్కులు పేలాడు. దీనికి సంబంధించిన వీడియోను పాకిస్తాన్ అన్‌టోల్డ్ అనే ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా, వైరలవుతోంది.
"It doesn't matter how many times you stop your speech for Azan
You will remain a Satan-possessed Hindu."
BTW this Mullah is ex Pak cricket captain Saeed Anwar who Indian Hindus hosted countless times. Imagine the hate in commoners. pic.twitter.com/tRhdSQ2HJL
— Pakistan Untold (@pakistan_untold) March 5, 2023
అన్వర్ మోదీపై దురుద్దేశంతో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం భారత దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భారత నెటిజన్లు సయీద్ అన్వర్‌పై విరుచుకుపడుతున్నారు. అన్వర్ క్రికెట్ ఆడే రోజుల్లో భారత క్రికెట్ అభిమానులు ఎంతగానో అభిమానించారని.. శత్రు దేశానికి చెందిన వాడని కూడా చూడకుండా, అతని ఆటను ఆస్వాదించారని.. భారత ప్రధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అన్వర్ తన వక్రబుద్ధిని చాటుకున్నాడని మండిపడుతున్నారు. సైతాన్ ఆవహించింది మోదీకి కాదని, మతం మత్తులో విధ్వేషాలను రెచ్చగొడుతున్న అన్వర్‌కేనని ధ్వజమెత్తుతున్నారు.
కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీ ఓ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో ప్రసంగిస్తుండగా సమీపంలో ఉన్న ఓ మసీదులో అజాన్ ఇచ్చారు. అప్పుడు మోదీ ముస్లింల మనోభావాలను గౌరవిస్తూ.. కొద్దిసేపు తన ప్రసంగాన్ని నిలిపి వేశారు. మోదీ ఇలా చేయడాన్ని ఉద్దేశిస్తూనే సయీద్ అన్వర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
1989లో అంతర్జాతీయ క్రికెట్లోని అడుగుపెట్టిన అన్వర్.. 2003లో ఆటకు వీడ్కోలు పలికాక ఇస్లాం ప్రచారకర్తగా మారిపోయాడు. అన్వర్ 2001-02లో ముల్తాన్ వేదికగా బంగ్లాదేశ్‌తో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతుండగా.. అతని కుమార్తె బిస్మా అన్వర్ ఆనారోగ్యం కారణంగా కన్నుమూసింది. మ్యాచ్ జరుగుతుండగానే అన్వర్‌కు ఈ విషయం తెలిసింది.
ఆ మ్యాచ్‌లో అన్వర్ సెంచరీ చేశాడు. ఈ విషయం పాకిస్తాన్ అభిమానులతో పాటు భారత అభిమానులను కూడా తీవ్రంగా కలిచివేసింది. పాక్ అభిమానులతో పోలిస్తే భారత అభిమానులు అన్వర్‌కు అధిక శాతం అండగా నిలిచారు. అతని చిన్నారి కుమార్తె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధనలు కూడా చేశారు.