టాప్ సీడ్‌కు సానియా జోడి షాక్
బీజింగ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన డబుల్స్ కెరీర్లో గొప్ప విజయం సాధించింది. తన భాగస్వామి కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి చైనా ఓపెన్ టోర్నమెంట్లో సానియా... ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ జోడిని బోల్తా కొట్టించింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సానియా-కారా బ్లాక్ ద్వయం 6-4, 6-4తో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న సారా ఎరాని-రొబెర్టా విన్సీ (ఇటలీ) జంటను ఇంటిముఖం పట్టించి ఫైనల్లోకి దూసుకెళ్లింది.
దాంతో గతవారం పాన్ పసిఫిక్ ఓపెన్‌లో టైటిల్ నెగ్గిన ఈ ఇండో-జింబాబ్వే జంట వరుసగా రెండో టైటిల్‌పై కన్నేసింది. 82 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో సానియా జంట తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి ప్రత్యర్థి జోడి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. శనివారం జరిగే ఫైనల్లో దుషెవినా (రష్యా)-సాన్టోంజా (స్పెయిన్) జోడితో సానియా జంట తలపడుతుంది.
బోపన్న జంట కూడా: టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ టోర్నీలో బోపన్న (భారత్)-వాసెలిన్ (ఫ్రాన్స్) ద్వయం ఫైనల్‌కి చేరింది. సెమీస్‌లో బోపన్న జోడి 6-4, 7-6 (8/6)తో హుయ్ (ఫిలిప్పీన్స్)-ఇంగ్లోట్ (బ్రిటన్)లపై గెలిచారు.