కోనసీమ వాసిపై ఉగాండాలో కాల్పులు.. మృతి
అమలాపురం టౌన్: తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం ఎ.వేమవరప్పాడుకు చెందిన సంజయ్(47) అనే వ్యక్తి ఉగాండాలో హత్యకు గురయ్యాడు. సంజయ్ 17 ఏళ్ల నుంచి వ్యాపార, ఉద్యోగ రీత్యా కుటుంబసభ్యులతో కలిసి ఉగాండాలోనే ఉంటున్నారు. ప్రస్తుతం గ్రోమోర్ సీడ్స్ కంపెనీ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో 3వ తేదీ రాత్రి కంపాల నగరంలో సంజయ్‌ను ఓ సెక్యూరిటీ గార్డు తుపాకీతో కాల్చి హత్య చేశాడు. సెక్యూరిటీ గార్డు డబ్బులు డిమాండ్ చేయగా ఇవ్వడానికి సంజయ్ నిరాకరించటంతో అతడీ కాల్పలకు తెగబడ్డాడని తెలుస్తోంది.
ఎనిమిది బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోయి తీవ్రంగా గాయపడ్డ సంజయ్‌ను ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. కేసు నమోదు చేసిన ఉగాండా పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని భారత్‌కు తరలించారు. మృతదేహం ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు రాగా అక్కడ నుంచి రాత్రికి ఎ.వేమవరప్పాడు తరలిస్తున్నారు. సంజయ్‌కు భార్య సుహాసిని, కుమార్తె ఉదయ సాయి సాధన, కుమారుడు విష్ణురాజ్ ఉన్నారు.