బెల్గాంలో ఉద్రిక్తత
సాక్షి, బెంగళూరు : బెల్గాం జిల్లా యళ్లూరులో శుక్రవారం ఉదయం తిరిగి ఉద్రిక్తత నెలకొంది. నామఫలకం ఏర్పాటు విషయమై గత నెల 27న యళ్లూరు వద్ద మహారాష్ట్రా ఏకీకరణ సమితి (ఎంఈఎస్) సభ్యులు గందరగోళం సృష్టించడంతో పోలీసులు నిషేదాజ్ఞలు విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంఈఎస్ చర్యలను నిరసిస్తూ కన్నడ చలువళి పార్టీ నాయకుడు వాటాల్ నాగరాజు సారథ్యంలో పలు కన్నడ సంఘాల ప్రతినిధులు బెల్గాం నుంచి ‘చలో యళ్లూరు’ కార్యక్రమాన్ని చేపట్టారు. వారు బెల్గాంలోకి చేరుకోగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా వాటళ్ నాగరాజు మాట్లాడుతూ... స్థానిక శాసనసభ్యుడైన సంభాజీ పాటిల్ వల్లే బెల్గాంలో శాంతిభద్రతల సమస్యల తలెత్తుతోందన్నారు. ఆయన వెంటనే రాజీనామా చేసి మహారాష్ట్రకు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఎంఈఎస్ కార్యకర్తల చర్యలను సమర్థిస్తూ శివసేన పార్టీ ఎమ్మెల్యేలైన దివాకర్రావ్, సంజిత్ నిబేకర్తోపాటు మరికొంత మంది యళ్లూరులో శుక్రవారం ఉదయం మీడియా సమావేశం జరపడానికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని వారి చర్యలను అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యేలకు, పోలీసులకు స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. శివసేన ఎమ్మెల్యేలను, కార్యక్తలను అదుపులోకి తీసుకున్నారు. నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించే క్రమంలో చిన్న ప్రమాదం చోటు చేసుకుంది. వాహనం దగ్గరల్లో ఉన్న కాలువలోకి వెళ్లడంతో ఇన్స్పెక్టర్ హరిశ్చంద స్వల్పంగా గాయపడ్డారు.
ఈ సందర్భంలోనే దివాకర్రావ్, సంజిత్ నిబేకర్లు అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించి కోల్హాపుర శివసేన అధ్యక్షుడు విజయ్దేవన్తోపాటు పలువురు మహారాష్ట్రకు చెందిన నాయకులను పోలీసులు విచారిస్తున్నారు.