స్వైప్ మిషన్స్ ఎక్కడ..?
జిల్లాలో కనిపించని నగదు రహిత లావాదేవీలు
పట్టించుకోని వ్యాపారవర్గాలు
ఇబ్బందులు పడుతున్న జనం
కొనసాగుతున్న నగదు కష్టాలు
జిల్లాలో స్వైప్ మిషన్లు కనిపించడంలేదు. కలెక్టర్ శరత్ పలుచోట్ల సమావేశం నిర్వహించి నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలని.. ప్రతి ఒక్కరూ స్వైప్ మిషన్లు వినియోగించాలని కోరినా ఫలితం కానరావడంలేదు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలపై అందిస్తున్న రాయితీలు జనం దరిచేరడంలేదు. సుమారు 55 రోజులు దాటినా జనాన్ని నగదు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.
జగిత్యాల: జిల్లా కేంద్రంలో నగదు లావాదేవీలపై వ్యాపారులు మక్కువ చూపుతున్నారు. కాని వ్యాపార కేంద్రాల్లో మాత్రం స్వైప్ మిషన్లు కనిపించడం లేదు. ఇప్పటికే కలెక్టర్ శరత్ వర్తక సంఘం వ్యాపారులతో సమావేశం నిర్వహించి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరు స్వైప్ మిషన్లు వాడాలని సూచించారు. అయినా జిల్లాలో కనీసం 50 శాతం మేరకైనా నగదు రహిత లావాదేవీలను జరగడం లేదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీల చెల్లింపులపై అనేక రాయితీలు çకల్పించినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. స్వైప్ మిషన్లు కరువుతో ఇబ్బందికరంగా మారింది.
చౌక ధరల దుకాణాల్లో..
చౌకధరల దుకాణాల్లో సైతం నగదు రహిత సేవలు జరపాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. డెబిట్, రూపే కార్డులలో కొనుగోలు చేయాలని ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు చౌక ధరల దుకాణాల్లో అమలు కావడం లేదు.
సూపర్మార్కెట్లలో..
జిల్లా కేంద్రంలో సూపర్మార్కెట్లలో కూడా స్వైప్ మిషన్లు లేకపోవడంతో నగదు లావాదేవీలే కొనసాగుతున్నాయి. కొందరు రూ.2 వేల సరుకులు తీసుకుంటేనే ఇస్తున్నారు. లేకుంటే చిల్లర లేవంటూ పంపిస్తున్నారు. దీంతో చేసేదేమీలేక వారు రూ.2 వేలు పెట్టి సరుకులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
పెట్రోల్ బంక్ల్లో...
జిల్లాలో ముఖ్యంగా పెట్రోల్బంక్లలో స్వైప్ మిషన్లు ఏర్పాటు చేయకుండా నగదు ఉంటేనే పెట్రోల్ పోస్తున్నారు. రూ.2 వేల నోటు తెస్తే కనీసం రూ.500 నుంచి రూ.వెయ్యి పోసుకుంటేనే చిల్లర ఇస్తున్నారు. లేదంటే పెట్రోల్ లేదనే సమాధానం చెబుతున్నారు.
విద్యుత్ శాఖలో..
విద్యుత్ చెల్లింపుల్లో సైతం నగదుగానే తీసుకుంటున్నారు. స్వైప్ మిషన్లు ఏర్పాటు చేయడం లేదు. దీంతో వారు సైతం చిల్లర లేకపోవడంతో వచ్చేనెలలో జమ చేసుకోవచ్చంటూ అధిక మొత్తంలో విద్యుత్ బిల్లులను తీసుకుంటున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో..
ముఖ్యంగా జిల్లా కేంద్రానికి ప్రతి ఒక్కరు ఏదో ఒక పని మీద వస్తుంటారు. ఆర్టీసీ బస్సుల్లోనే విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు వస్తారు. వీరి వద్ద చిల్లర లేకపోవడంతో బస్సు కండక్టర్లు దింపేస్తున్నారు. వీటిలో కూడా స్వైప్ మిషన్లు ఏర్పాటు చేస్తామన్నప్పటికీ ఇప్పటికైతే ఏర్పాటు చేయలేదు.
మద్యం షాపుల్లో..
జిల్లాలో ముఖ్యంగా మద్యం షాపుల్లో, బార్ అండ్ రెస్టారెంట్లలో అత్యధికంగా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. సుమారు రూ.లక్షకు పైగానే జరుగుతాయి. ఇందులో సైతం స్వైప్ మిషన్లు ఏర్పాటు చేయకుండా నగదుగానే తీసుకుంటున్నారు. ముందుగా వచ్చిన వినియోగదారులకు డబ్బులుంటేనే కూర్చోవాలని, లేదంటే స్వైప్ మిషన్లు లేవని పంపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
స్పందించని సంబంధిత శాఖ అధికారులు
ప్రతి శాఖ అధికారులు వారి ఆధీనంలో ఉన్న వాటిలో స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిచోట ఇప్పటి వరకు జిల్లాలో స్వైప్మిషన్లు ఏర్పాటు చేసిన దాఖలు లేవు. వ్యాపారులు, వివిధ రకాల వ్యాపారాలు చేసే వారిపై ఒత్తిడి తీసుకురాకపోవడంతో నగదుకే మొగ్గుచూపుతున్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రతిచోట స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసేలా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.