ప్లూటో గుట్టు విప్పనుంది..
అంగారకుడిపై పరిశోధనల కోసం రోదసిలో దూసుకుపోతున్న మన మంగళ్యాన్(మామ్) ఉపగ్రహం మాదిరిగానే.. ప్లూటోపై పరిశోధనలకు బయలుదేరిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన ‘న్యూ హారిజోన్స్’ వ్యోమనౌక ఇది. సౌరకుటుంబం చిట్టచివరలో మంచు, ఖగోళ శకలాలతో కూడిన కూపర్బెల్ట్ ప్రాంతంలో ఉన్న మరుగుజ్జు గ్రహం ప్లూటో గుట్టు విప్పేం దుకు ఇది 2006 నుంచి ప్రయాణం సాగిస్తోంది.
తాజా అంచనాల ప్రకారం.. వచ్చే ఏడాది జూలై 14న ఈ వ్యోమనౌక ప్లూటోకు 10 వేల కిలోమీటర్ల సమీపానికి చేరుకుంటుందని నాసా ప్రకటించింది. హబుల్ లాంటి శక్తిమంతమైన టెలిస్కోపుతో నిఘా పెట్టినా.. కూపర్బెల్ట్ ప్రాంతంలోని క్లిష్ట పరిస్థితుల వల్ల ప్లూటో గురించి ఇంతవరకూ తెలిసింది చాలా తక్కువే. ఈ వ్యోమనౌక ప్లూటోకు సమీపంలోకి చేరితేనే.. ఇక ఆ గ్రహం కచ్చితమైన ఆకారం, రంగులు, వలయాలు, మంచు, పర్వతాలు, లోయల వంటివాటి గురించిన గుట్టు వీడనుందని భావిస్తున్నారు.