OTT: తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘సట్టమ్ ఎన్ కైయిల్’ రివ్యూ
చట్టమనేది ఎవ్వరి చుట్టమూ కాదు. అదే చట్టాన్ని వ్యక్తిగతంగా ఎవ్వరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదు. కాని దీనికి విరుద్ధంగా ఓ తమిళ సినిమా పేరు వచ్చింది. అదే సట్టమ్ ఎన్ కైయిల్. అంటే చట్టం నా చేతుల్లో అని అర్ధం. సెన్సార్ వాళ్ళు ఈ పేరును ఎలా ఓకే చేశారో కాని సినిమా మాత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రైమ్ వీడియో ఓటిటి వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ తమిళ సినిమాకి చాచి దర్శకుడు. సినిమా ప్రధాన పాత్రైన గౌతమ్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు సతీష్ నటించడం విశేషం. మామూలుగా హాస్య పాత్రలతో ఇప్పటిదాకా అలరించిన సతీష్ ఈ సినిమాలో సీరియస్ పాత్రతో ప్రేక్షకులను అలరించాడనే చెప్పాలి.ఇక సట్టమ్ ఎన్ కైయిల్ కథాంశానికొస్తే తమిళనాడు లోని మారుమూల ప్రాంతమైన ఏర్కాడ్ పోలీస్ స్టేషన్ కి తన బిడ్డ మృతికి కారణమైన హాస్పిటల్ సిబ్బంది మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఓ వ్యక్తి రావడంతో సినిమా ప్రారంభమవుతుంది. నిజానికి ఈ సన్నివేశం ఏర్కాడ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్సపెక్టర్ బాషా అవినీతిని చూపించడం కోసం రూపొందించారు. దాని తరువాత గౌతమ్ తన కారులో ప్రయాణిస్తూ ఓ వ్యక్తిని ఢీ కొడతాడు. ఈ యాక్సిడెంట్ లో తాను ఢీ కొట్టిన వ్యక్తి చనిపోవడంతో తన కారు డిక్కీలో ఆ వ్యక్తి బాడీని పెట్టుకుని తిరిగి ప్రయాణిస్తుంటాడు. ఇంతలో పోలీస్ చెక్ పోస్టులో అనూహ్యంగా పోలీసులకు కారుతో సహా చిక్కి ఏర్కాడ్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటాడు గౌతమ్. తన పై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టి స్టేషన్ కి తీసుకువస్తారు. కాని తన కారులో ఉన్న శవం గురించి పోలీసులకు తెలియదు. ఇక అక్కడినుండి కథ అనేక అనూహ్య మలుపులు తిరిగి ఉత్కంఠభరితంగా నడుస్తుంది సినిమా. ముఖ్యంగా ఆఖరి సన్నివేశం సినిమా మొత్తానికే హైలైట్. క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఎలాగూ నచ్చుతుంది, అలాగే మామూలు వాళ్ళకి కూడా ఒక్కసారి కథలోకి లీనమైతే సినిమాలో వచ్చే ట్విస్టులకు వీస్తూ పోతూ కుర్చీలకు అతుక్కుపోతారు. సట్టమ్ ఎన్ కైయిల్ మాత్రం రొటీన్ థ్రిల్లర్ అయితే కాదు. వర్త్ టు వాచిట్. (ప్రముఖ ఓటీటీ అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది)-ఇంటూరు హరికృష్ణ