కార్తెల బలమే రైతుకు కలిమి
మన పూర్వీకులు సంవత్సర కాల చక్రాన్ని మన జీవన విధానానికి సరిపోయే విధంగా చక్కని పద్ధతిలో విభజించారు. సంవత్సరంలోని పన్నెండు నెలల్లో ప్రతి ఆరు నెలలు ఒక ఆయనం.. ఉత్తర, దక్షిణాయనాలు. ప్రతి రెండు నెలల కాలం ఒక రుతువు. ఆ విధంగా వసంత, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత, శిశిర రుతువులను ఏర్పాటు చేశారు. రుతువును రెండు మాసాలుగానూ, మాసాన్ని రెండు పక్షాలగానూ విభజించారు. పక్షంలో రోజులు పదిహేను.. ఇదీ మన వాడుకలో ఉన్నది. అయితే, ప్రతి 14 రోజులను ఒక కార్తెగా ఏర్పాటు చేశారు. ఈ కార్తెలను వ్యవసాయదారులు, పశుపోషకులు మాత్రమే పాటిస్తున్నారు.
‘ఉత్తర చూసి ఎత్తర గంప’ అనే సామెత ఉంది. ఇది 12వ కార్తె. 12ను 14 రోజులతో గణిస్తే సంవత్సరాది నుంచి 168 రోజులు అవుతుంది. సంవత్సరాది ఏప్రిల్ 1 అయితే, సెప్టెంబర్ 20వ తేదీ వరకు వర్షాలు లేకపోతే ఇక (ధాన్యపు) గంపతో పనిలేదు. ఈ సంవత్సరానికి గంపతో పనిలేనట్లే కాబట్టి గంపని అటకెక్కించక తప్పదు అనేది ఈ నానుడిలో భావం. ఆశ్వ కార్తెలో భూమిలో సారం (వైద్య శాస్త్ర నిపుణులు అశ్విని దేవతలు కాబట్టి) ప్రారంభమౌతుంది. కృత్తిక కార్తెలో భూమిలో అగ్ని గుణం పెరుగుతుంది. ఆర్ద్ర కార్తెలో నేలలో తేమ పెరుగుతుంది. జల ఊరుతుందన్న మాట. ఇలా ఒక్కొక్క కార్తెకీ ఒక్కో గుణం ఉంది. అది వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. ఇక్క ‘చిత్త’లో సంతానోత్పత్తి కాబట్టి వృషోత్సర్జనం (అచ్చుబోసి అంబోతుని విడవడం) చేస్తారు. బలరామునికి ఆయుధంగా నాగలి ఉంటుంది. అది పంటకీ, కృష్ణుడు పోషించే గోవు పాడికీ సంకేతం. కాబట్టి మన దేవతలూ.. కాలచక్రం అంతా కూడా వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చేవారే అన్నమాట!
- డా. మైలవరపు శ్రీనివాసరావు