నష్టాలకు బ్రేక్ - సెన్సెక్స్ 359 ప్లస్..
బీఎస్ఈ సెన్సెక్స్ ఎనిమిది నెలల కనిష్ట ముగింపు స్థాయి నుంచి బుధవారం కోలుకుంది. దీంతో ఆరు రోజుల సెన్సెక్స్ నష్టాలకు, ఏడు రోజుల నిఫ్టీ నష్టాలకు తెరపడింది. ఎంఎస్సీఐలో చైనా షేర్లను చేర్చడంపై నిర్ణయం వాయిదా పడడం, ఆకర్షణీయ ధరల్లో లభిస్తుండటంతో బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లు పెరగడం, రూపాయి బలపడడం వంటి కారణాలతో స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 359 పాయింట్ల లాభంతో 26,840 పాయింట్లు, నిఫ్టీ 102 పాయింట్ల లాభంతో 8,124 పాయింట్ల వద్ద ముగిశాయి. అంతర్జాతీయ సంకేతాలు ముఖ్యంగా ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవడం కూడా కలసివచ్చింది. అన్ని రంగాల సూచీలు లాభాల బాట పట్టాయి. అన్ని రంగాల షేర్లు,,, ముఖ్యంగా బ్యాంక్, ఆర్థిక సేవల సంస్థల, టెక్నాలజీ, వాహన, ఆయిల్ షేర్లు లాభపడ్డాయి.
కెయిర్న్ ఇండియా 7 శాతం అప్
ఇక నిఫ్టీ ఫిఫ్టీలో కెయిర్న్ ఇండియా షేర్ బాగా లాభపడింది. విలీన ప్రతిపాదన విషయమై చర్చించడానికి వేదాంత, కెయిర్న్ ఇండియా బోర్డ్ సభ్యులు ఈ నెల 14న సమావేశం కానున్నారన్న వార్తల నేపథ్యంలో కెయిర్న్ ఇండియా 6.8 శాతం లాభపడింది. పంచదార పరిశ్రమకు వడ్డీలేని రూ.6,000 కోట్ల రుణాలివ్వాలన్న ప్రతిపాదనను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించడంతో పంచదార కంపెనీల షేర్లు పెరిగాయి.