తల్లీబిడ్డకు రక్షణ కవచం
జీజీహెచ్‌లో ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు ప్రారంభం
వారం రోజుల్లో పూర్తిస్థాయిలో అమల్లోకి
నాలుగు వార్డుల్లో సెన్సార్ల ఏర్పాటు
గుంటూరు మెడికల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో తరచుగా పసికందులు అదృశ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉండటంతో ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించి పిల్లల అపహరణను నియంత్రించేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్( ఆర్ఎఫ్ఐడీ) ట్యాగ్‌ను మొట్టమొదటిసారిగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ప్రారంభించింది.
ఆస్పత్రిలో నాలుగుచోట్ల ఏర్పాటు...
ఆస్పత్రి ఇన్‌పేషెంట్ విభాగంలోని కాన్పుల విభాగం( లేబర్‌రూమ్), నవజాతశిశు సంరక్షణ కేంద్రం( ఎస్ఎన్సీయూ), పిల్లల వైద్య విభాగం, గైనకాలజీ వైద్యవిభాగం( 107, 107 వార్డుల్లో)లో సెన్సార్లు ఏర్పాటు చేశారు. పసికందులు పుట్టిన వెంటనే తల్లికి, బిడ్డకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌ను అమర్చుతారు. దీంతో తల్లీబిడ్డలకు ఒకటే నంబర్ ఉంటుంది. ట్యాగ్ అమర్చగానే తల్లి వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఒకసారి ట్యాగ్‌ను చేతికి పెడితే దానిని తీయటం కుదరదు. ట్యాగ్‌లను కత్తిరించి తొలగించటమే మినహా వేరే మార్గం లేదు. తల్లికీ బిడ్డకు మధ్య దూరం 10 మీటర్లు దాటితే వెంటనే పెద్దగా శబ్దం వస్తుంది. వేరే‡వారు పిల్లలను పట్టుకుంటే వెంటనే దొరికిపోతారు. పిల్లలు, తల్లులను ఉంచే వార్డుల్లో సెన్సార్లు ఏర్పాటు చేయడంతో ఇవి ట్యాగ్‌లను మానిటరింగ్ చేస్తూ ఉంటాయి. గుజరాత్‌కు చెందిన ఓడోహబ్ డాట్‌కామ్ సంస్థ ఈ నూతన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. వార్డుల ప్రారంభంలో, చివర్లో ఇంటిగ్రేటెడ్ రీడర్ల అమర్చుతారు. కంప్యూటర్లో డెస్క్‌టాప్ రీడర్ ఉంటుంది. తల్లికి, బిడ్డకు అమర్చే ట్యాగ్‌కు సిల్వర్ పూత మాదిరిగా రేడియోవేవ్స్ ఉంటాయి. ట్యాగ్ల నుంచి వచ్చే రేడియోవేవ్స్‌ను అనుసంధానం చేస్తూ కంప్యూటర్లో సాఫ్ట్వేర్ అమర్చారు.
రూ.12 లక్షలతో ఏర్పాటు...
ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌లను ఆస్పత్రిలో ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.12 లక్షల వరకు ఖర్చయిందని, జీజీహెచ్‌లో సెక్యూరిటీ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న జేబీ సెక్యూరిటీ ఖర్చును భరించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు వెల్లడించారు. కాంట్రాక్ట్ ఒప్పందంలో భాగంగానే ఈ నూతన విధానం ఏర్పాటు చేశామన్నారు. ట్యాగ్‌లను అమర్చిన వెంటనే తల్లి బిడ్డ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేందుకు రిసెప్షనిస్ట్ కమ్ ఆపరేటర్‌ను నియమించనున్నట్లు తెలిపారు. ట్యాగ్లు ఏర్పాటుచేసేందుకు జతకు రూ.50 ఖర్చవుతుందని, అహ్మదాబాద్ నుంచి ట్యాగ్‌లను తెప్పిస్తున్నామని చెప్పారు. వారం రోజుల్లో పూర్తిస్థాయిలో తల్లిబిడ్డ సంరక్షక కవచాలు అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు.