SFJ
-
మోదీ వీసా రికార్డులు సమర్పించండి: అమెరికా కోర్టు
న్యూయార్క్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీసాకు సంబంధించిన అన్ని రికార్డులను తమ ముందు ఉంచాలని అమెరికా కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మోదీ అమెరికా రాకుండా విధించిన నిషేధం ఎత్తివేస్తూ బరాక్ ఒబామా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన రికార్డులు వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా సమర్పించాలని పేర్కొంది. 2016, జనవరి నెల మధ్యలో ప్రాథమిక నివేదిక సమర్పించాలని న్యూయార్క్ సదరన్ డిస్టిక్ట్ జడ్జి జాన్ కొయల్ టెల్ ఈ నెల 9న ఆదేశించారు. దీనిపై తదుపరి విచారణను ఫిబ్రవరి 29కు వాయిదా వేశారు. సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నరేంద్ర మోదీ వీసా, అమెరికాలో ఆయన ప్రవేశానికి సంబంధించిన రికార్డులు (2013 జూన్ నుంచి) ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎస్ఎఫ్జే కోర్టును ఆశ్రయించింది. -
సోనియాపై కేసు పిటిషన్ కొట్టివేత
-
సోనియాపై కేసు పిటిషన్ కొట్టివేత
న్యూయార్క్: 1984నాటి సిక్కుల ఊచకోత ఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై అమెరికాలో దాఖలైన ఓ పిటిషన్‌ను అక్కడి కోర్టు కొట్టివేసింది. ఆరోపణ దారులు దాఖలు చేసిన పిటిషన్లో పరిపక్వత కలిగిన అంశాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. సిక్కుల ఊచకోత ఘటన విషయంలో సోనియాగాంధీ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని, ఆమెపై కేసులు నమోదు చేయాలంటూ న్యూయార్క్‌లోని సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) అనే సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టన ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లో కొత్తగా అభివృద్ధి ఏమి లేదని, గతంలో పేర్కొన్న అంశాలే మళ్లీ చెప్తున్నారంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. -
మన్మోహన్ సింగ్‌కు అమెరికా కోర్టు సమన్లు
అమెరికా పర్యటనకు భారత నాయకులు ఎవరు వెళ్లినా వాళ్లకు అక్కడి కోర్టుల నుంచి సమన్లు తప్పడంలేదు. తాజాగా, నాలుగు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అక్కడి కోర్టు సమన్లు ఇచ్చింది. 1990లలో పంజాబ్ రాష్ట్రంలో ఉగ్రవాద నిరోధ ఆపరేషన్ల సందర్భంగా మానవహక్కుల ఉల్లంఘన జరిగిందంటూ.. దానికి సంబంధించి ఈ సమన్లు అందించింది. ఈ సమన్లను వైట్‌హౌస్ సిబ్బంది ద్వారా మన్మోహన్ సింగ్ భద్రతా సిబ్బందికి అందజేయాలని న్యూయార్క్‌లోని మానవహక్కుల సంస్థ 'సిఖ్ ఫర్ జస్టిస్' (ఎస్ఎఫ్జె) ప్రయత్నిస్తోంది. గతంలో అమెరికాకు చికిత్స నిమిత్తం వెళ్లిన ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి కూడా ఇదే సంస్థ సమన్లు అందజేసింది. అయితే, వాటిని అందుకోకముందే ఆమె తిరిగి భారతదేశానికి వచ్చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో గురువారం సమావేశం కానున్నారు. అయితే, ఇప్పుడు మన్మోహన్ సింగ్‌కు సమన్లు అందించడం కూడా ఎస్ఎఫ్జెకు అంత సులభం కాకపోవచ్చన్నది సమాచారం. ఎస్ఎఫ్జె కేవలం ప్రచారం కోసమే ఇలా ప్రముఖులకు సమన్లు ఇస్తోందంటూ న్యూయార్క్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్న న్యాయవాది రవి బాత్రా ఓ కేసు దాఖలు చేశారు.