ఏపీలో డీఎస్సీ, తొలిరోజు ఎస్జీటీ పరీక్ష
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి డీఎస్సీ-2014 పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఉపాధ్యాయ నియామక అర్హత పరీక్ష (డీఎస్సీ)కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిరోజు జరిగే సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) పరీక్షకు 57,722 మంది హాజరవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,560 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మే 9వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎస్జీటీ ఖాళీల భర్తీకి రాత పరీక్ష జరగనుంది. ఇందుకోసం 364 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీకి పరీక్ష జరగనుంది. 10వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లాంగ్వేజ్ పండిట్స్ పరీక్ష, ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యాయామ ఉపాధ్యాయుల పరీక్ష జరుగుతుంది. . 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1-15 గంటల వరకు స్కూల్ అసిస్టెంట్లు (లాంగ్వేజెస్) పరీక్ష నిర్వహించనున్నారు.