అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
సాక్షి, బళ్లారి : మహిళల మెడలలో చాకచక్యంగా బంగారు గొలుసులను అపహరిస్తున్న అంతరాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ ఆర్.చేతన్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన బళ్లారి నగరంలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.బళ్లారి నగరంలో గత రెండు సంవత్సరాలుగా మహిళల మెడలలో బంగారు గొలుసులను దొంగలిస్తూ నగర వాసులను భయాందోళనలకు గురి చేసిన దొంగను అరెస్ట్ చేసేందుకు బళ్లారి గ్రామీణ డీఎస్పీ సురేష్, సీఐ ప్రసాద్ గోఖలేలు బృందంగా ఏర్పడి గాలింపు చేపట్టారన్నారు.
ఈ క్రమంలోఅనంతపురం జిల్లా గంతకల్లు పట్టణంలోని బీరప్ప గుడి సమీపంలో నివాసం ఉంటున్న షేక్ జాఫర్ అలియాస్ యూసఫ్ అలియాస్ గిడ్డు అనే వ్యక్తి బళ్లారిలో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా చోరీ చేసినట్లు అంగీకరించాడన్నారు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి రూ.6 లక్షల విలువైన 185 గ్రాముల బంగారు ఆభరణాలు, డిస్కవరీ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారన్నారు. సమావేశంలో ఏఎస్పీ విజయ డంబళ్, డీఎస్పీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.