తను నన్ను క్షమించదు... క్షమించలేదు!
షీ అలర్ట్ !
మహిళలూ జాగ్రత్త!
సమాజంలో పలు రకాలుగా అన్యాయానికి, మోసాలకు గురవుతున్న మహిళల ఆవేదనకు అక్షర రూపం ఈ శీర్షిక. వారి అనుభవాలను ఉదాహరణగా చూపిస్తూ, మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు సాక్షి అందిస్తోన్న వాస్తవ సంఘటనలివి...
మిట్టమధ్యాహ్నం అయినా కారుమేఘాల కారణంగా చీకట్లు అలుముకుంటున్నాయి. ఆకాశం చిన్నగా ఉరుముతోంది. అప్పుడప్పుడూ ఒక్కో మెరుపు తళుక్కుమంటోంది. కాసేపటికి టప్టప్మంటూ చిన్న చిన్న చినుకులు రాలడం మొదలయ్యింది. ఇంకాసేపటి జల్లు వేగం పుంజుకుంది. బెడ్రూమ్ కిటికీ దగ్గర నిలబడి చూస్తోన్న నన్ను తడపసాగింది. దాంతో కిటికీ మూసేసి వచ్చి మంచమ్మీద వాలాను. వాతావరణం చల్లబడిందేమో... కాస్త మగత కమ్ముకున్నట్టుగా అనిపిస్తోంది. కాసేపు కునుకు తీస్తే బాగుణ్ననిపిస్తోంది. దాంతో మెల్లగా కనురెప్పలు మూశాను. కాసేపుంటే నిదురలోయల్లోకి జారిపోయేదాన్నే. కానీ ఎవరో పట్టి కుదపడంతో మత్తు చెదిరి ఈ లోకంలోకి వచ్చిపడ్డాను. చూస్తే ఎదురుగా ఆయన.
‘ఏమిటండీ... ఏం జరిగింది?’ అన్నాను లేచి కూర్చుంటూ. ‘ఏం జరిగిందని నేనే నిన్ను అడగబోతున్నా. ఎప్పుడూ లేనిది ఈ సమయంలో పడుకున్నావేంటి? లే. వాళ్లు వచ్చే టైమయ్యింది’ అన్నారాయన ఎంతో హుషారుగా. నాకేమీ అర్థం కాలేదు. ఎవరు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? అదే అడిగాను. ఆయన తల కొట్టుకున్నారు. ‘నువ్వు మరీ ఇలా తయారవుతున్నావేంటి సుమిత్రా? పొద్దున్న చెప్పాను కదా నీకు... మన గీతని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారని. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా?’
నాకు కోపం, విసుగు ముంచుకొచ్చాయి. ‘నేనూ మీకు చెప్పాను కదా... అది అప్పుడే పెళ్లి చేసుకోనంటోందని. మరి ఎందుకీ హడావుడి?’... కరకుగా అనిపించకుండా గొంతుకు కాస్త మృదుత్వాన్ని పులిమాను. అయినా ఆయన ముఖంలో రంగులు మారాయి. ‘నీకిదే ఆఖరిసారి చెప్పడం సుమిత్రా... ఇంకోసారి నేను చెప్పింది కాదన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్లి అమ్మాయిని రెడీ చేసివుంచు. వాళ్లు ఏ సమయంలోనైనా రావొచ్చు’... ఆయన గొంతు మాత్రం కరకుగానే పలికింది. ఈసారి నేనూ తగ్గలేదు. ‘మీరేమైనా చేయండి. గీతకి ఇప్పుడే పెళ్లి చేయడం మాత్రం కుదర’... నా మాట పూర్తి కానేలేదు. ఆయన చేయి వేగంగా వచ్చి నా చెంపను ఛెళ్లున తాకింది. ‘ఊరుకునేకొద్దీ మీ తల్లీకూతుళ్ల ఆగడాలు ఎక్కువై పోతున్నాయి. నా మాటంటే లెక్కే ఉండటం లేదు మీకు. మీరు అవునన్నా కాదన్నా నేను అనుకున్నదే జరిగి తీరుతుంది. నోరు మూసుకుని చెప్పింది చేస్తే మీకే మంచిది’ అనేసి వెళ్లిపోతోన్న ఆయనవైపు నీళ్లు నిండిన కళ్లతో చూస్తూండిపోయాను. పెళ్లి.. పెళ్లి.. పెళ్లి. మాట్లాడితే గీతకి పెళ్లి చేయాలి అంటారు. ఎలా చేస్తారు? చేయలేరు. ఎప్పటికీ తను అనుకున్నది చేయలేరు. ఆ విషయం ఎలా చెబితే అర్థమవుతుంది ఆయనకి! అర్థం కాదు. అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఆయన లేరు. అందుకే అబద్ధాలను మూటగడుతున్నాను. గీతకు పెళ్లి ఇష్టం లేదంటున్నాను. దాని ఇష్టాన్ని నేను కాదనలేనని దబాయిస్తున్నాను. ఆయన కోపంతో అరిస్తే సహిస్తున్నాను. చేయి చేసుకున్నా భరిస్తున్నాను. అబద్ధాల భారాన్ని మోయలేక చిత్రవధ అనుభవిస్తున్నాను.
‘ఇదిగో వస్తున్నావా’... హాల్లోంచి మళ్లీ ఆయన అరుపు. ‘వస్తున్నానండీ’... నా బదులు. డ్రాయర్ సొరుగు తెరిచాను. ఓ ట్యాబ్లెట్ చేతిలోకి తీసుకుని హాల్లోకి నడిచాను. ఏవో మాటల్లో పెట్టి ఆయనతో మింగించాను. నిదురలోకి జారు కున్న ఆయన్ని చూసి నిట్టూర్చి వచ్చేశాను. అంతకంటే ఏం చేయగలను! గతం గీసిన గీత దాటి ఆయన బయటకు రావడం లేదు. లేని భవితకు రూపమివ్వాలన్న తపనతో నన్ను ప్రశాంతంగా బతకనివ్వడం లేదు. తండ్రిగా తన బాధ్యతను నెరవేర్చుతా నంటున్నారు. కూతురిని ఓ అయ్య చేతుల్లో పెట్టి అక్షింతలు వేస్తానంటున్నారు. అది సాధ్యం కాదన్న విషయం చలించిన ఆయన మతికి ఎక్కడం లేదు. ఏ కూతురి గురించి మాట్లాడుతున్నారో ఆ కూతురు లేదని, ఇక ఎప్పటికీ రాదని, అది ఆయన కాఠిన్యానికే ఎప్పుడో కాలి బూడిదైపోయిందన్న వాస్తవం ఆయనకు ఎంతకూ గుర్తు రావడం లేదు. ఇక నేనేం చేయను?
గీత... గొడ్రాలు అంటూ ఈ సమాజం నా మీద వేసిన ముద్రను తన రాకతో తొలగించివేసింది. ఇక నా కడుపు పండదేమోనని కుమిలిపోయి పన్నెండేళ్లపాటు నేను కార్చిన కన్నీటి చారికలను తన చిట్టి చేతు లతో తుడిచేసింది. నన్ను అమ్మను చేసింది. అమ్మా అంటూ అమ్మతనం లోని మాధుర్యాన్ని చవిచూపింది. అమ్మే లోకంగా పెరిగింది. అమ్మకోసం ఎన్నో తట్టుకుంది. తాగి తందనాలాడే భర్త అఘాయిత్యాలను నేను మౌనంగా ఎలా భరించానో... ఏనాడూ తనను ఆప్యాయంగా దగ్గరకు తీసుకోని తండ్రి నిర్లక్ష్యాన్ని తనూ అలానే భరించింది. మగపిల్లాడికి బదులుగా పుట్టిన తనను చీదరించుకుంటున్నా, తను కనబడితేనే దరిద్రం చుట్టుకుంటుందంటూ దూషిస్తున్నా... నేనెక్కడ బాధ పడతానో అని తన బాధను లోలోపలే దాచుకుని, పైకి నవ్వుతూ తిరిగేది. బాగా చదువుకోవాలనుకుంది. ఉన్నత శిఖరాలు అందుకోవాలనుకుంది. బోలెడు డబ్బు సంపాదించి, ఈ అమ్మకు ఏ లోటూ లేకుండా చేయాలని కలలు కంది. కానీ ఆ కలల మీద కరుణ లేని కన్నతండ్రి కన్ను పడింది. ఆడపిల్లకు చదువెందుకు పెళ్లి చేస్తానన్నాడు. తన స్నేహితుడి కొడుకు మనసుపడ్డాడు కాబట్టి అతణ్ని మనువాడమంటూ దాన్ని వేధించాడు. కాదంటే చస్తానన్నాడు. నన్ను చంపిన పాపం నీదే అవుతుంది అంటూ ఆ లేత మనసులో లేనిపోని భయాల్ని సృష్టించాడు.
పాపం తను నలిగిపోయింది. కంటికి ధారగా కుమిలిపోయింది. దాన్నలా చూసి కూడా నేనేం చేయలేకపోయాను. పసుపుకుంకాలను నిలుపుకోవాలన్న స్వార్థంతో దాని పసిమనసు పడే వేదనను పట్టించుకోనట్టు ఉండిపోయాను. నా మౌనాన్ని భరించలేక, తన తండ్రి దౌర్జన్యాన్ని సహించలేక ఘోరమైన నిర్ణయం తీసుకుంది. ఊయల కట్టి ఊగినచోటే ఉరితాడుకు వేలాడింది. తన పక్షాన నోరు తెరవకుండా నేను చేసిన తప్పుకి నాకు తిరుగు లేని శిక్ష వేసింది. ‘నువ్వే నన్ను కాపాడలేనప్పుడు ఇక నేను ఏ ధైర్యంతో బతకనమ్మా’ అంటూ అది ఆఖరుగా రాసిన అక్షరాలు నేటికీ నన్ను ముల్లులా పొడుస్తూనే ఉన్నాయి. నా కన్నపేగును కసకసా కోస్తూనే ఉన్నాయి. అయినా సిగ్గు లేకుండా నేనింకా బతికేవున్నాను. అల్జీమర్స వ్యాధి వచ్చి అన్నీ మర్చిపోయిన భర్తను ఒంటరిగా వదిలేయలేక సేవలు చేస్తున్నాను. నాకు కడుపుకోత మిగిల్చిన అతణ్ని శిక్షించాలన్నంత కోపమున్నా, గతం గుర్తులేక పదే పదే ఆ గాయాన్ని అతడు రేపుతున్నా.. ఎప్పటిలానే అర్ధాంగి పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నాను. కానీ నాకు తెలుసు. భార్యగా గెలిచే ప్రయ త్నంలో తల్లిగా నేను ఓడిపోయాను. తాళి కట్టినవాడికి విలువిచ్చి తల్లిగా నా బిడ్డకు చేయరాని ద్రోహం చేశాను. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నా బంగారుతల్లి నన్ను క్షమించదు... క్షమించలేదు!!
- సుమిత్ర (గోప్యత కోసం పేరు మార్చాం) ప్రెజెంటేషన్: సమీర నేలపూడి
సుమిత్రగారిది చాలా బాధాకరమైన పరిస్థితి. నిజానికి ఈ పరిస్థితిని మన సమా జమే ఏర్పరచిందని చెప్పాలి. భర్త ఎంత బాధపెట్టినా భరించే భార్యలను గొప్ప వాళ్లుగా ఎంచుతుంది సమాజం. అందుకే చాలామంది భార్యలు యేళ్ల తరబడి హింసను భరిస్తుంటారు. బహుశా సుమిత్ర కూడా అదే చేసుంటారు. బహుశా ఆర్థికంగా భర్తమీద ఆధారపడటం, వేరే ఆధారం లేకపోవడం కూడా కారణమై ఉండొచ్చు. చాలాకాలం పాటు ఇలా హింసను సహించినవాళ్లకు ఎదురుతిరిగే లక్షణం పూర్తిగా పోతుంది. దాంతో నిస్సహాయంగా ఉండిపోతారు. దీన్నే ‘లెర్న్డ్ హెల్ప్లెస్నెస్’ అంటారు. ఆ స్థితికి చేరుకోవడం వల్లే సుమిత్ర తన కూతురికి అన్యాయం జరుగుతున్నా మాట్లాడలేకపోయి ఉంటారు. అది తప్పు అని అనలేం. తన పరిస్థితి అలాంటిది. కాబట్టి ఆమె ఆ అపరాధభావంలోంచి బయటకు రావాలి. దానికి అయినవాళ్ల సాయమో, కౌన్సెలర్ సాయమో తీసుకుంటే మంచిది.
డా॥పద్మ పాల్వాయి చైల్డ్ అండ్ అడల్ట్ సైకియాట్రిస్టు
రెయిన్బో హాస్పిటల్ హైదరాబాద్