'ఎన్నారై విద్యార్థిని శృతి బరాల్ది ఆత్మహత్యే'
ఇంగ్లండ్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించిన భారతీయ విద్యార్థినిది ఆత్మహత్యేనని అక్కడి అధికారులు తేల్చారు. శృతి బరాల్ (22) అనే విద్యార్థిని ఇటీవల మరణించగా, ఆమె మణికట్టు మీద 'నా శరీర అవయవాలు తీసుకోండి' అని రాసి ఉంది. తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆమె కొకైన్ అధిక మోతాదులో తీసుకోవడం వల్లే మరణించినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఆమె మరణించాలనే ఉద్దేశంతోనే అలా చేసినట్లు వైద్యాధికారి పాట్రీషియా హార్డింగ్ తెలిపారు. యూకే నుంచి హాంకాంగ్ వెళ్లిన బరాల్, డ్రగ్స్ అధిక మోతాదులో తీసుకోవడం వల్లే మరణించినట్లు పాథాలజిస్టు డాక్టర్ డేవిడ్ రౌస్ కూడా నిర్ధరించారు.
ఆమె రక్తంలో కొంత ఆల్కహాల్ ఆనవాళ్లు కూడా కనిపించాయి. శృతి తన బెడ్రూంలో నేల మీద పడి ఉండగా ఆమె తమ్ముడు గమనించాడు. యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో జియోగ్రఫీ చదువుతున్న ఆమె చాలా తెలివైన విద్యార్థిని అని, అసలు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఏమాత్రం లేదని విచారణలో తేలింది. ఫిబ్రవరి 17న ఆమె మరణించగా, అంతకుముందు ఫేస్బుక్లో ఓ సందేశం పెట్టింది. ఒకవేళ తాను చనిపోతే తనను గుర్తుపెట్టుకుంటారా అని ఆ సందేశంలో అందరినీ అడిగింది. డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆమె, తన యూనివర్సిటీలోని మానసిక వైద్య విభాగాన్ని కూడా సంప్రదించింది.