పురుషాహంకారానికి జవాబు శిఖండి
అంబ తొలితరం స్త్రీవాది అంటే కాదనడానికి కారణం ఏమీ కనపడటం లేదు. భీష్ముడి పురుషాహంకారాన్ని జన్మలకొద్దీ నీడలా వెంటాడి శిఖండిలా అవతరించి అతడి మరణం చూసిందామె. అయితే దురదృష్టవశాత్తు ఆమెను ఒక స్వతంత్ర పాత్రగా కాకుండా ఇతరులు ‘అడ్డు పెట్టుకొని’ విజయం సాధించే పాత్రగా మార్చారు. ఇంతకీ శిఖండి కథ ఏమిటి? జనసామాన్యంలో నలిగే ఆ పేరు వెనుక పగ ఏమిటి?
కురుక్షేత్ర యుద్ధానికి కౌరవ సేనలు సిద్ధమవుతున్నాయి. ‘నీకు విజయమో నాకు వీర మరణమో ఈ యుద్ధంలో తేలాలి. పాండవపక్షంలో ఉన్న ఎవరినైనా ఎదిరిస్తాను. కానీ పాంచాల రాజకుమారుడైన శిఖండి నా ఎదుట నిలిస్తే నేను అతనిని కొట్టను’... అన్నాడు భీష్ముడు.‘తాతా! ఎందరో మహావీరులను గెలిచిన నువ్వు శిఖండి ముందు నిశ్చేష్టుడివి కావటం ఏమిటి?’ అన్నాడు దుర్యోధనుడు. ‘దుర్యోధనా! పురుషాహంకారానికి నాకు నేను విధించుకున్న శిక్షే దానికి కారణం. నన్నెదిరించిన శిఖండిని నేను ఎందుకు ఎదిరించలేనో చెబుతాను. అందరూ శ్రద్ధగా వినండి. నా తండ్రి శంతనుని వివాహం కోసం నేను బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను. ఇచ్చిన మాట ప్రకారం ఆయన మరణానంతరం పెద్ద తమ్ముడు చిత్రాంగదుణ్ని రాజును చేశాను. అతడు చనిపోవడంతో చిన్నతమ్ముడు విచిత్రవీర్యునికి పట్టాభిషేకం చేసి అతనికి తగిన కన్యను చూసి పెళ్లి చెయ్యాలనుకున్నాను. కాశీరాజు కుమార్తెలు ముగ్గురు అంబ, అంబిక, అంబాలిక స్వయంవరానికి సిద్ధంగా ఉన్నారని విని నేను ఒక్కడినే స్వయంవరానికి వెళ్లాను.
నా అహంకారం కొద్దీ ఆ ముగ్గురి ఇష్టాయిష్టాలు ఎరగక వచ్చిన రాజులందరినీ ఎదిరించి రథంపై ఎక్కించుకొని హస్తినాపురానికి వచ్చి తల్లి సత్యవతికి అప్పగించాను. అక్కచెల్లెళ్లు ముగ్గురినీ విచిత్రవీర్యునికి ఇచ్చి పెళ్లి చేయబోతుండగా కాశీరాజు పెద్దకూతురు అంబ ‘ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. నేను ఇంతకుమునుపే సాళ్వరాజును ప్రేమించాను. అతనినే పెళ్లి చేసుకుంటాను. సాళ్వరాజు నాకోసం ఎదురుచూస్తూ ఉంటాడు’ అంది. నేను తల్లిని, పెద్దలను అడిగి అంబ ఇష్టప్రకారం ఆమెను సాళ్వరాజు దగ్గరకు పంపాను. అయితే ‘నిన్ను భీష్ముడు ఎత్తుకువెళ్లాడు. ఇప్పుడు నువ్వు పరాయిదానివి. నాకు అక్కర్లేదు’ అని సాళ్వుడు తిరస్కరించాడు. దాంతో అంబ హతాశురాలయ్యింది. అంతేకాదు తనకు జరిగిన అన్యాయానికి నేనే ముఖ్యకారణం అని నాపై పగతో ఒక ఆశ్రమానికి వెళ్లి రాజర్షి హోత్రవాహనుణ్ణి కలిసింది. ఆమె తన మనుమరాలనీ, కూతురు బిడ్డ అనీ ఆయన తెలుసుకున్నాడు. బాధపడ్డాడు. ‘అమ్మా! నీ ప్రతీకారం తీరే ఉపాయం చెబుతాను. నువ్వు పరశురాముడి దగ్గరకు వెళ్లి శరణు వేడు. నీ దుఃఖాన్ని పోగొడతాడు. భీష్ముడు ఆయన శిష్యుడు. తాను చెప్పినట్టు వినకపోతే భీష్ముణ్ని శిక్షిస్తాడు’ అన్నాడు.
అంబ పరశురాముడి దగ్గరకు వెళ్లింది. తన జీవితం అడవిగాచిన వెన్నెల కావటానికి కారణమైన నన్ను శిక్షించమని ప్రార్థించింది. ‘ఏం చెయ్యమంటావు?’ అని అడిగాడు పరశురాముడు. ‘భీష్మున్ని చంపండి’ అంది అంబ. ‘భీష్ముడు మంచివాడు, నా శిష్యుడు’ అన్నాడు పరశురాముడు. ‘అతడు నా దుఃఖానికి కారణం. మీరు నాకు ఇచ్చినమాట నిలబెట్టుకోండి. భీష్ముణ్ని చంపటమే నాకు ఇష్టం’ అంది అంబ.
పరశురాముడు అంబతో హస్తినాపురానికి వచ్చాడు. నన్ను కలిశాడు. ‘భీష్మా! నీవు ఎత్తుకురావడం వల్ల ఈమె బ్రతుకు నాశనమైంది. ఈమెను స్వీకరించు’ అన్నాడు. ‘వివాహం చేసుకోరాదనే నా ప్రతిజ్ఞను నేను వీడను. పరాయివాణ్ని ప్రేమించిన ఆమెను నా తమ్ముడు చేసుకోడు’ అన్నాను. ‘భీష్మా! అయితే యుద్ధంలో నీ అహంకారాన్ని పోగొడతాను’ అన్నాడు పరశురాముడు. మా ఇరువురికీ భయంకరమైన యుద్ధం ఇరవైనాలుగు రోజులు జరిగింది. చివరికి పరశురాముడే ఓడిపోయాడు.
దాంతో అంబకు రోషం ఇనుమడించింది. తపస్సు చేయాలని నిశ్చయించింది. యమునాతీరంలో పన్నెండేళ్ల కఠోరమైన తపస్సు చేసింది. తపస్సులో సగ భాగంతో అంబానదిగా మారింది. మిగిలిన తపోబలంతో కన్యగా పుట్టింది. ఆ జన్మలో కూడా నాపై పగతో ఘోరమైన తపస్సు చేసింది. కాని ఏమీ చేయలేకపోయింది. ‘నా స్త్రీత్వం వ్యర్థమైంది. ఈసారి పురుషుణ్ని అయి అనుకున్నది సాధిస్తాను’ అని అడిగినవారికి తన ఆశయాన్ని చెప్పింది. శివుడు ప్రత్యక్షమైనాడు. ‘అమ్మా! నీ తపస్సుకు మెచ్చాను. యుద్ధంలో భీష్ముణ్ని చంపుతావు. అందుకోసం పురుషత్వాన్ని పొందుతావు’ అని వరం ఇచ్చాడు. అప్పుడు అంబ చితి పేర్చుకొని ‘భీష్ముని వధ కోసం’ అంటూ అగ్నిప్రవేశం చేసింది.
దుర్యోధనా! నా మీద కోపంతో ద్రుపదుడు నన్ను చంపే కొడుకు కోసం శివుణ్ని తపస్సు చేశాడు. శివుడు ‘నీకు మొదట ఆడపిల్ల పుట్టి, తరువాత మగవాడుగా మారి భీష్ముణ్ని చంపుతుంది’ అని వరం ఇచ్చాడు. అలాగే ద్రుపదునికి ఆడపిల్ల పుట్టింది. కానీ మగపిల్లవాడు పుట్టినట్టు ప్రకటించారు. అలాగే పెంచారు. శిఖండి పేరుతో ద్రోణుని వద్ద విద్యలు నేర్పించారు. దశార్ణ దేశపురాజు కూతురిని ఇచ్చి పెళ్లి చేశారు. శిఖండి పురుషుడు కాదనే నిజం తెలిసిన మామ వియ్యంకుడైన ద్రుపదునిపై యుద్ధానికి వచ్చాడు. శిఖండి దుఃఖంతో ఇల్లు వదిలి అడివికి వెళ్లింది. ఆ వనాన్ని రక్షిస్తున్న స్థూణాకర్ణుడనే యక్షుడు ఈమె కథ విని జాలిపడి ‘తాత్కాలికంగా నా పుంసత్వాన్ని నీకు ఇస్తాను. నీ స్త్రీత్వాన్ని నేను తీసుకొంటాను’ అని ఓదార్చాడు. శిఖండి మగవాడై ఇంటికి వెళ్లాడు. మామగారికి నమ్మకం కలిగించి తిరిగి వచ్చేసరికి యక్షుని స్త్రీత్వం శిఖండి మరణించేదాకా ఉంటుందని కుబేరుడు శాపం పెట్టాడు. దాంతో శిఖండి శాశ్వతంగా పురుషుడై, మహావీరుడై, పాండవపక్షంలో ఉన్నాడు.
నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. స్త్రీ మీద గాని, పూర్వం స్త్రీగా ఉన్నవాని మీద గాని, స్త్రీ పేరు ఉన్నవాని మీద గాని, స్త్రీ రూపం గలవాని మీద గాని నేను బాణం విడువను. ఈ కారణంగానే శిఖండిని నేను చంపను. యుద్ధరంగంలో అతడు చంపడానికి బద్ధమై వచ్చినా నేను అతనిని చంపను... అని భీష్ముడు అంబ వృత్తాంతాన్ని దుర్యోధనునికి మొత్తం చెప్పాడు. పురుషాహంకారాన్ని పరాక్రమంగా భావించి తన జీవితాన్ని చిందరవందర చేసిన భీష్ముణ్ని పడగొట్టి ప్రతీకారం తీర్చుకున్న స్త్రీరత్నం అంబ. పట్టువదలని మొండిశిఖండిగా స్త్రీ జాతిని మేలుకొల్పుతోంది.
- డా. పాలపర్తి శ్యామలానందప్రసాద్
.