తెలంగాణ సారథ్యం జిల్లాకే?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : వామపక్ష పార్టీల తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పదవుల్లో రెండోది కూడా మన జిల్లాకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శిగా జిల్లాకు చెందిన తమ్మినేని వీరభద్రం ఎన్నిక కాగా, మరో వామపక్షమైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పదవి కూడా ఇక్కడి నాయకులకే లభిస్తుందనే సంకేతాలు వస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర తొలి కార్యదర్శిగా జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు సిద్ధి వెంకటేశ్వర్లు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జిల్లాకే చెందిన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత కూనంనేని సాంబశివరావు పేరు కూడా పార్టీ జాతీయ సమితి పరిశీలనలో ఉంది. అయితే అన్ని సమీకరణలను బట్టి చూస్తే సిద్ధికే ఈ పదవి లభిస్తుందని పార్టీ వర్గాలంటున్నాయి. కాగా, ఈ పదవి కోసం సిద్ది వెంకటేశ్వర్లుకు కరీంనగర్ జిల్లాకు చెందిన చాడా వెంకటరెడ్డి కూడా తీవ్ర పోటీ ఇస్తున్నారు. వీరిలో ఒకరిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించి తెలంగాణ కమిటీని శుక్రవారం ప్రకటించనున్నారు.
కూనంనేనికి అక్కడా... ఇక్కడా?
జిల్లాకు చెందిన సిద్ధి వెంకటేశ్వర్లు, కూనంనేని సాంబశివరావు పేర్లను జాతీయ సమితి పరిశీలిస్తోంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా ఉన్న వీరిద్దరూ ఆ పదవి చేపట్టేందుకు అర్హులే అయినా, కొన్ని సమీకరణల్లో కూనంనేని కొంత వెనుకబడుతున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. సామాజిక కోణంతో పాటు మరికొన్ని కారణాలతో సిద్ధి వెంకటేశ్వర్లును రాష్ట్ర కార్యదర్శిగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే కూనంనేనిని పార్టీ జిల్లా కార్యదర్శిగా నియమించవచ్చనే చర్చ పార్టీలో జరుగుతోంది.
సార్వత్రిక ఎన్నికల ఫలితంతో కొంత మేర కుదేలైన పార్టీని మళ్లీ గాడిలో పెట్టడంలో భాగంగా జిల్లా కార్యదర్శిని కూడా మార్చే అవకాశం ఉందని సమాచారం. ఇక తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రేసులో ఉన్న చాడా వెంకటరెడ్డి విశాలాంధ్ర విజ్ఞాన సమితిలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పల్లా వెంకటరెడ్డి మాత్రం తాను రాష్ట్ర కార్యదర్శిగా ఉండలేనని చెప్పిన ట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన సిద్ధి వెంకటేశ్వర్లు పేరు దాదాపు ఖరారయినట్టేననే ప్రచారం మఖ్దూంభవన్ స్థాయిలో జరుగుతోంది.