ఈ-వెహికల్ విభాగంలోకి స్మార్ట్ గ్లోబల్ గ్రూప్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలోకి బీకే మోడీ నేతృత్వంలోని స్మార్ట్ గ్లోబల్ గ్రూప్ ప్రవేశిస్తోంది. తొలి దశలో ఎలక్ట్రిక్ బస్సులు, ట్యాక్సీలను మార్కెట్లోకి తీసుకురావాలన్నది తమ ప్రయత్నమని గ్రూప్ వ్యవస్థాపకులు, చైర్మన్ బీకే మోడీ ఇక్కడ విలేకరులకు తెలిపారు. తరువాత పాసింజర్ వాహనాలను ఆవిష్కరించాలన్నది లక్ష్యమన్నారు. ‘స్మార్ట్ డ్రీమ్స్’ బ్రాండ్‌తో ఈ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మురాదాబాద్‌లోని మూడీ సిటీలో ఎలక్ట్రిక్ బస్ తయారీ కర్మాగారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ రంగంలో తమ లక్ష్యాల సాధనకు వీలుగా ప్రపంచ ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ సంస్థ ‘బిల్డ్ యువర్ డ్రీమ్స్’ (బీవైడీ)తో ఒక అవగాహన కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కంపెనీతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశంలోనే వాహన ఉత్పత్తి జరపనున్నట్లు మోడీ తెలిపారు. దీర్ఘకాలంలో ఈ ప్రాజెక్టుపై దాదాపు బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు.