అక్రమాల పునాదులపై..
అక్రమాలకు అడ్డుకట్ట వేయూల్సిన పాలకులే వాటికి అండగా నిలబడితే ఏం జరుగుతుంది? నగరంలోని భారీ భవనాల నిర్మాణాన్ని చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అక్రమార్కులు అంతస్తులపై అంతస్తులను యథేచ్ఛగా నిర్మించేస్తున్నారు. ఈ తంతు గురించి తెలిసినా నగర పాలక సంస్థ అధికారులు కళ్లకు గంతలు కట్టుకుని పనిచేస్తున్నారు.
సాక్షి, గుంటూరు
అక్రమ కట్టడాలకు గుంటూరు నగరం కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పట్టించుకోకపోవటంతో అనుమతులు లేకుండానే భారీ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా భవనాలు నిర్మిస్తున్నారు. ఇలా నిర్మించిన భవనాలను సాక్షాత్తు రాష్ట్ర మంత్రి, శాసనసభ స్పీకర్లే ప్రారంభిస్తున్నారు. దీంతో వాటివైపు కన్నెత్తి చూసేందుకు అధికారులు హడలిపోతున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీతోపాటు పలువురు ముఖ్య నేతలు పాత భవనాలపై అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలాంటివి కార్పొరేషన్ పరిధిలో 140కి పైగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదులు వెళ్లాయి. కొన్ని అక్రమ కట్టడాల్లో కాలేజి హాస్టళ్లు ఉన్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నిర్మించిన కట్టడాల్లో ప్రమాదాలు సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇవీ ఉదాహరణలు..
= బృందావన్ గార్డెన్స్‌లోని కమ్మజన సేవా సమితి పాత భవనంపై ఇటీవల నిర్మించిన రెండంతస్తులకు అనుమతులు లేవు. ఈ భవనాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు, స్పీకర్ కోడెల శివప్రసాద్, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావులు ఇటీవల ప్రారంభించారు.
= అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ ఎస్వీఎన్ కాలనీలో ఉమెన్స్ కాలేజి హాస్టల్ భవనానికి సంబంధించి ఇటీవల నిర్మించిన రెండంతస్తులకు కూడా అనుమతులు లేవు. ఈ విషయాన్ని కార్పొరేషన్ అధికారులు ధ్రువీకరించారు.
= కొత్తపేటలోని బోసుబొమ్మ సెంటర్లో ఓ ఆస్పత్రి, ఓల్డ్ క్లబ్ రోడ్డులోని లలిత హాస్పిటల్ భవనాలకు పూర్తి స్థాయి అనుమతులు లేవు.
= అమరావతి మెయిన్ రోడ్డులోని ఓ కాంప్లెక్స్, శ్రీనగర్ కాలనీలోని ఓ అపార్టుమెంట్, పాత గుంటూరు, శ్యామలనగర్‌లలో రెండు అపార్టుమెంట్లను అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారు. ఇలా అక్రమ కట్టడాల జాబితా చాంతాడంత ఉంది.
= వీటిలో కొన్నింటికి టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అక్రమ కట్టడాలపై సమగ్ర విచారణకు గుంటూరు మున్సిపల్ ఆర్డీ శ్రీనివాసరావును నియమించినట్లు సమాచారం. విజిలెన్స్ అధికారులు, కార్పొరేషన్ ప్రత్యేకాధికారైన జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే వీటిపై దృష్టి సారించి విచారణ జరిపిస్తే అన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
నోటీసులు జారీ చేశాం..
ఈ విషయమై నగర పాలక సంస్థ ఇన్చార్జి డీసీపీ విశ్వప్రసాద్‌ను వివరణ కోరగా కార్పొరేషన్ పరిధిలో ఇంతవరకు 89 అక్రమ కట్టడాలు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. ఇందులో 16 భవనాలను కూలగొట్టామని, 32 భవనాలకు సంబంధించి కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. మిగినవాటికి నోటీసులు జారీ చేశామని తెలిపారు.